8, డిసెంబర్ 2020, మంగళవారం

లిఖిత్ కవనాలు

లిఖిత్ కవనాలు 


కపోతాలు

కవిత్వాలయ్యాయి..

శాంతిని అన్వేషిస్తూ..

🌻

కొత్త చెట్లు

పుట్టుకొస్తున్నాయి..

కవిత్వాల కొత్త పరిమళం జగితికి చేరవేయడానికి!

🌻

రాతలతో (రచనలు) పత్రికలు.,

కొన్ని నిండుతాయి,

కొన్ని ఎండుతాయి,

కొన్ని మండుతాయి...

🌻

నా లిఖిత్ కవనాలు పై సమీక్ష రాసిన ప్రముఖ కవయిత్రి శ్రీ  లలిత చిట్టె గారికి కృతజ్ఞతలు 🌹🌹


ముందుగా.. కవులను ప్రోత్సహిస్తూ వారి కలం నుండి ఉన్నతమైన కవిత్వాన్ని వెలికితీయాలనే సంకల్పం కలిగి కవితా సమీక్షలకు పట్టం కడుతున్న శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ అక్షర తపస్వి డా. కత్తిమండ ప్రతాప్ గారికి అభివాదములు. 


💐మీ కవిత మా స్పందన💐


కవి : మాస్టర్ లిఖిత్ కుమార్ గోదా 💐

చదువుతున్నది ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం.

🌹🌹🌹


పిట్ట కొంచెం కూత ఘనం.

పువ్వు పుట్టగానే పరిమళించును. ఈ సూక్తులన్నీ ఇలాంటి కవులను చూసినప్పుడు గుర్తొస్తుంటాయి.

చిన్న వయసులోనే పెద్ద భావాలు.

ఉన్నతమైన ఆశయాలు కలిగిన లిఖిత్ అందమైన భావాలతో అద్భుతమైన కవిత్వాన్ని మనకు అందిస్తున్నాడు.

ఈ కవి రాసే కవనాలు భావార్థకమై.. ఆలోచనాత్మకమై.. పాఠకుల హృదయాలను ఆకట్టుకుంటున్నాయి.

అక్షరాలు అందంగా.. సరళంగా.. నిగూఢమైన భావాన్ని కలిగి.. దివ్యమైన సందేశాన్ని అందిస్తూ అలరిస్తున్నాయి. 


లిఖిత్ కవనాలు అనే శీర్షికన ఈ అబ్బాయి రాసుకున్న మనోభావాలను ఒక సారి మనం పరిశీలించినట్లయితే..


కవితలను కపోతాలతో పోల్చి చెపుతున్నాడు..

ఈ భావాన్ని అందంగా చెప్పడం.. అక్షరాల్లో చూపించడం లిఖిత్ కే సాధ్యమయింది.

🌹

- 1

కపోతాలు కవిత్వాలయ్యాయి...

శాంతిని అన్వేషిస్తూ.....


పావురాలను మనం శాంతికి చిహ్నాలుగా భావిస్తుంటాము. 

కవిత్వానికీ.. కపోతానికీ.. శాంతికీ చక్కటి ముడి పెట్టి రెండు వాక్యాల కవితగా మలచి మనకందించాడు లిఖిత్.

చక్కటి భావం ఇమిడి ఉన్న ఈ కవితాక్షరాలను అవగతం చేసుకుంటే..  

కవిత్వాన్ని అక్షరీకరించే ప్రతి కవీ పొంగిపోతాడు. తన కవిత్వం శాంతి సందేశమిచ్చే కపోతమయినందుకు.. నలుదిశలా శాంతిని చాటుతూ ప్రపంచశాంతిని అన్వేషించే సాధనమయినందుకు.

🌹

- 2

కొత్త చెట్లు పుట్టుకొస్తున్నాయి

కవిత్వాల కొత్త పరిమళాన్ని జగతికి చేరవేయడానికి..!


ఇక్కడ చూసినట్లయితే ఆకట్టుకునే సరికొత్త భావన.. 

ఈ చిన్న వయసులో ఇంత పరిపక్వత కలిగిన భావం ఈ అబ్బాయినుండి ఎలా వెలువడిందా అనే ఆశ్చర్యం...

కవిత్వాన్ని కొత్త చెట్లతో పోల్చాడు ఈ అబ్బాయి. 

అద్భుతం కదా...

కొత్త పరిమళాన్ని జగతికి చేరవేయడానికి కవిత్వాన్ని పువ్వులుగా.. వారధిగా భావించడం.. వాడుకోవడం..

ఊహల్లో ఎంతో ఉన్నతంగా వుంది.

ఎంత సుందరమైన భావమిది. కవులు గర్వపడే కొత్త అంశమిది.

పాఠకులారా.. దయచేసి ఇలాంటి కవిత్వాల పరిమళాన్ని ఆఘ్రాణించండి.. ఆనందించండి.. ఆస్వాదించండి. హృదయాల్లోకి ఒంపుకొని తరించండి. 

కవులు సంబరంతో సందడిగా పండగ చేసుకునే అపురూపమైన వాక్యమిది.

కవితలు మదిని పరవశింపజేసే పరిమళాలను జగతికి పంచితే.. ఎంత బావుంటుందో కదా. 

కవులారా.. మీ కవనంలో విరబూసిన పువ్వుల పరిమళాలను జగతికి పంచండి. జనులను అలరించండి. 

ఇందులో పరిశీలించి.. పరిశోధిస్తే.. అంతర్లీనంగా మానవతా దృక్పదo నెలకొన్న మానవీయ కోణం కూడా గోచరమవుతోంది. 

చిన్నవాక్యాల్లో గొప్ప భావాలను పలికించిన లిఖిత్ ...

నీకు జేజేలు...

🌹

-3

రాతలతో (రచనలు) పత్రికలు

కొన్ని నిండుతాయి

కొన్ని ఎండుతాయి

కొన్ని మండుతాయి..!


ముచ్చటైన ఈ మూడు చిన్న వాక్యాల సరాలు.. నాకు నవ్వును తెప్పించాయి.

మరలా మరొకసారి చదివాను. 

ఇందులో ఎంత లోతైన భావం పొందుపరచబడిందో.. నా మట్టుకు నాకు ఒకటి రెండుసార్లు ఈ వాక్యాలను చదివితే గానీ భావం బోధపడలేదు. 

ఇది వ్యంగ్యమా..

బాధా.. ఉత్తేజమా.. నిరాశతో నిండుకున్న వాదమా..

ఈ మూడింటి సమ్మిళితమా...!

ఈ మూడు వాక్యాలను మాత్రం మరొక్కసారి ఇంకా లోతుగా అధ్యయనం చేసి పరిశోధించి మూలాలను కనుక్కోవాలి అని నేను అనుకుంటున్నాను.

నేను కవిని.. రచయితను.. లేదా..

నేను పత్రికకు సంపాదకుడిని.. అనుకునే ప్రతి ఒక్కరూ ఈ మూడు వాక్యాలనూ తరచి చూసి తమను తాము పరిశీలించుకుని నిండుతున్నామా.. ఎండుతున్నామా.. మండుతున్నామా అనే విషయాన్ని అర్థం చేసుకొని లోపాలను సరి చేసుకునే దిశగా సాగాలి.


ఒకసారి లిఖిత్ రాసిన చిన్ని కవనాలను మన చూద్దామా...💐💐💐


#లిఖిత్_కవనాలు


కపోతాలు

కవిత్వాలయ్యాయి..

శాంతిని అన్వేషిస్తూ...(01)


కొత్త చెట్లు

పుట్టుకొస్తున్నాయి..

కవిత్వాల కొత్త పరిమళం జగతికి చేరవేయడానికి!(02)


రాతలతో (రచనలు) పత్రికలు.,

కొన్ని నిండుతాయి,

కొన్ని ఎండుతాయి,

కొన్ని మండుతాయి...(03)


✍️ లిఖిత్ కుమార్ గోదా.

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.


💐💐💐👏👏👏

-చిన్నవాడైనా చక్కటి సందేశాన్ని చిన్న కవితలో నింపి మనకందించిన అభ్యుదయ కవి లిఖిత్ కుమార్ గోదా కు శుభాభినందనలు.

లిఖిత్ ఇంకా సాహిత్యాన్ని అధ్యయనం చేసి గొప్ప కవిగా.. రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనీ భవిష్యత్తు ఉజ్వలంగా ప్రకాశించాలనీ ఆశిస్తున్నాను.

ఈ అవకాశం నాకిచ్చిన డా. ప్రతాప్ గారికీ మా శ్రీశ్రీ కళావేదిక కార్యవర్గానికి ధన్యవాదములు తెలుపుతున్నాను..

నా కవితా సమీక్షలను ఆసక్తితో చదివి అభిప్రాయం తెలియజేస్తున్న పాఠకులకు.. కవులకూ.. శుభాభినందనలు.


మీ లలిత చిట్టే. 06.12.20. 🌹🌹


లిఖిత్ కవనాలు_2

🌹

కన్నీళ్లు నవ్వుతున్నాయి..

పేదోళ్లు విద్య చేయి పట్టుకొని

జీవితారోహణ చేస్తుంటే..

🌹

కొన్ని నవ్వుల్లో కనబడని కన్నీళ్లుంటాయి..

ఎదిగే పేద మొక్కలను చూసి ఓర్వలేక..

🌹

కవిత్వం ఏడుస్తుంది..

నవ్వుతూ రాజ్యమేలుతున్న తవిక్యాన్ని చూసి..

🌹

నా కవితలు

మనుషులై నవ్వుతున్నాయి..

రాసేదొకటి.. పాటించేదొకటి అని వేలు చూపిస్తూ..



07.12.2020

✍️ లిఖిత్ కుమార్ గోదా.

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.


06.10.2020.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...