16, జనవరి 2020, గురువారం

వార్త జాతీయ దినపత్రిక మొగ్గ శీర్షిక (11/01/2020) లో ప్రచురితమైన నా బాలల కథ : బంగారు వర్షం ✍🏻✍🏻✍🏻🙏🏻🙏🏻🙏🏻

కథ పేరు :విందు ఆంతర్యం.. బంగారు వర్షం...
రచన :గోదా. లిఖిత్ కుమార్.

విధర్భ రాజ్యానికి చక్రవర్తి వేదాంతుడు. ఆయని పాలనలో ప్రజలు ఎంతో సుభిక్షంగా, సుఖసంతోషాలతో జీవించే వారు. తన దగ్గర బంగారు రాశులు, వజ్రాల నిధులు సమృద్ధిగా వున్నాయి.
   ఒక రోజు తన సభకు బంగారయ్య అనే బీదవాడు వచ్చాడు ఓ ఆహ్వాన పత్రిక ను చేతపట్టుకుని. అతని అవతారం ఎలా వుందంటే మాసిన గడ్డంతో, చినిగిన బట్టలతో, చింపిరి జుట్టు తో అచ్చంగా ఒక పపిచ్చివాడిలా ఉన్నాడు. వేదాంతుడికి నమస్కరించి ''మహారాజా! నన్ను బంగారయ్య అంటారు. పేరుకే బంగారయ్య కానీ నా జీవితంలో ఒక్క పైసా కూడా నిలిచింది లేదు. నేను కటిక బీదవాణ్ణి. యువకుడినే అయినా ఏదో ఒక పని చేసి జీవనం సాగిద్దామనుకున్నా ఎక్కడా పని దొరకడం లేదు. ఎవ్వరూ ఇవ్వడం లేదు. నా వల్ల, నా నిరుపేద స్థితి వల్ల నా కుటుంబం ఎన్నో ఇక్కట్లు అనుభవిస్తుంది.అయినా నేను మీకు రేపు విందు ఇవ్వదలిచాను.తప్పకుండా తమరు నా ఇంటికి విచ్చేసి నేను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా మనవి. దయచేసి నా ఈ ఆహ్వానాన్ని పెడచెవిన పెట్టకుండా నా ఆహ్వనాన్ని అందుకోండి. నేను మీకు ఏ లోటు లేకుండా ఆతిథ్యం ఇస్తాను. కావున ఈ నిరుపేద బంగారయ్య ఆహ్వానాన్ని తప్ప కుండా అందుకోగలరు. నా ఇంటికి విచ్చేయగలరు''. అని అన్నాడు బంగారయ్య. వేదాంతుడు ఆలోచన లో పడ్డాడు. ''ఒక పేద వాడు తన కెలా విందు, సకల సౌకర్యాలు కల్పిస్తాడు. పూటకు గడవడమే ఎంతో కష్టంగా ఉంది అతని పరివారానికి తన వేషం, మాటలు చూస్తుంటే. అయినా తనకు పంచభక్ష పరమాన్నాలు కల్పిస్తానంటున్నాడు. నా దగ్గర నుండి ఏం ఆశిస్తున్నాడు. ?''అనే ఆతృత, సందేహంతో, అతని తో ''సరే! నేను వస్తాను లే! ''అని బదులు ఇచ్చాడు.
మరుసటి రోజు వేదాంతుడు తన మంత్రులు, సైన్యంతో బంగారయ్య ఇంటికి ఆతిథ్యానికి వెళ్లాడు. మహారాజుని బంగారయ్య కుటుంబ సభ్యులు, పూలు ఆయని పై చల్లుతూ ఎంతో సాదరంగా ఆహ్వానించారు. బంగారయ్య భార్య సుమతి వేదాంతుడికి పంచభక్ష పరమాన్నాలు వడ్డించింది. మహారాజు కడుపు నిండా భోజనం ఆరగించాడు.
''ఇక సరే!భోజనం,నీ పరివార ఆహ్వానం నన్ను మెప్పించింది. భళా! మంచి ఆతిథ్యాన్ని కల్పించావు. రాజ్యాంలో చాలా పని ఉంది. నేనిక బయల్దేరతాను బంగారయ్య!''అని అన్నారు. బంగారయ్య ఎంతో దిగులు తో వేదాంతుడుని సాగనంపే ఏర్పాటు చేశాడు. వేదాంతుడు వెళ్లే ముందు ''బంగారయ్య! అసలు నన్ను విందుకు పిలవడానికి గల ఆంతర్యమేమిటి? కాస్త దిగులు కూడా నీ ముఖంలో తాండవిస్తుంది. ఏమిటి విషయం? ''అని అడిగాడు. బంగారయ్య చేతులు జోడించి నమస్కరించి, బిక్క ముఖంతో, నీరస గొంతు తో అసహనం వ్యక్తపరుస్తూ ''మహారాజా! మీరు కుబేరిడితో సమానమట కదా! మీరున్న చోట బంగారు వర్షం (నాణేలు )కురుస్తుందట అని నా మిత్రుడు చెబితే విన్నాను. నేను కటిక బీదవాణ్ణి కదా!ఎలాగోలా అప్పు చేసి మీకు విందు ఇస్తే నా ఇంట్లో బంగారు వర్షం కురుస్తుందనే ఆశతో అప్పులు చేసి మిమ్మల్ని ఆతిథ్యానికి ఆహ్వానంచాను. కానీ, అంతా నా దురదృష్టం. నాకు దిగులే తప్ప ఒక్క పసిడి నాణం కూడా రాల లేదు. ఇక నా గతేంటో? ఎలా బ్రతకాలో? భగవంతుడా ? '' అని మొరపెట్టు కున్నాడు.
వేదాంతుడికి అతని సైన్యనికి పగలబడేంత నవ్వు వచ్చింది. మహారాజు నవ్వుతూ ''భలే వాడివయ్య! నేనున్న చోట బంగారు వర్షం కురుస్తుందని, బంగారు నాణేలు రాలతాయని నమ్మివా? పిచ్చి బంగారయ్య!పోనీ లే నీ అమాయకత్వం నా సంపదకి నిదర్శనమని తెలుస్తుంది. సరే! ఇందా వెయ్యి బంగారు వరహాల వర్షం. ఈ ధనం చక్కగా నీ వ్యాపారానికి వినియోగించు. నీ కుటుంబాన్ని చక్కగా పోషించుకో. ఇక నేను వెళ్ళి వస్తాను! ''అని వరహాల మూట ఇచ్చారు. ''అంతా మీ దయ ''అని అన్నాడు బంగారయ్య. వేదాంతుడు రాజ్యానికి పయనమయ్యాడు. బంగారయ్య రాజు ఇచ్చిన ధనం తో వ్యాపారం మొదలు పెట్టి, కుటుంబాన్ని పోషించసాగాడు.
రచన : గోదా. లిఖిత్ కుమార్.

బాల చెలిమి చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రచురించ తలపించిన తెలంగాణ బడి పిల్లల కథలు ఖమ్మం జిల్లా ఎడిషన్ లో రాసిన నా 13వ బాలల కథ :రెండు కళ్లు ✍🏻✍🏻✍🏻🙏🏻🙏🏻🙏🏻

బాల చెలిమి, చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ సంపాదకులు, చైర్మన్ 
శ్రీ మణికొండ వేదకుమార్ గారి సారధ్యంలో, శ్రీ గరిపెల్లి అశోక్ గారు కన్వీనర్  గా నిలబడి వెలువరించి తెలంగాణ బడి పిల్లల కథలు, ఖమ్మం జిల్లా బడి పిల్లల కథల సంకలనంలో ప్రచురితమైన నా కథ రెండు ళ్ళు.
ఖమ్మం జిల్లా సంకలనకర్త శ్రీ డా.అమ్మిన శ్రీనివాస రాజు గారు






ఖమ్మం జిల్లా - బడి పిల్లల కథలు-2019

రెండు కళ్లు


బనిగండ్లపాడు గ్రామంలో యస్ఆర్ ఆర్ గవర్నమెంట్ పాఠశాల ఉంది అప్పుడే 10వ తరగతిలోకి అడుగుపెట్టారు, తెలుగు సార్ రత్న కుమార్ గారు విద్యార్థులకు "యక్షుడు, ధర్మరాజు” పాఠం పూర్తి చేసి “పిల్లలూ! చూసారా! పాఠంలో యక్షుడి ప్రశ్నలకు ధర్మరాజు చాలా చక్కగా సమాధానాలు చెప్పి, తన తమ్ముళ్లను ఎలా యక్షుడు నుండి కాపాడుకున్నాడో? ఇప్పుడు మీకో సవాల్ విసరబోతున్నాను అన్నారు


“ఏంటి సార్ అది?” "ఆత్రంగా అడిగారు విద్యార్థులందరూ ఇప్పుడు మీరు పాఠం విన్నారు కదా! ఒకవేళ ధర్మరాజు స్థానంలో మీరుండి, యమధర్మరాజు మీ తల్లిదండ్రులని స్పృహ కోల్పోయేలా చేసి, మిమ్మల్ని కూడా అలాగే ప్రశ్నలు అడిగి, ఒకవేళ మీరు అన్నింటికి సమాధానాలు చెప్పారనుకోండి.

అప్పుడు యమధర్మరాజు మిమ్మల్ని మెచ్చి, 'ప్రసన్నుడను అయ్యాను. నీ

తల్లిదండ్రులలో ఒకరిని బ్రతికించుకో!' అంటే, మీరు ఎవరిని బ్రతికించుకుంటారో ఒకొక్కరూ లేచి చెప్పండి అన్నారు షణ్ముఖ్ లేచి "ఇది కాస్త జటిలమైన ప్రశ్న సార్! అయినా జవాబు చెప్తాను నాకన్నీ మా అమ్మే, అడిగి మరీ తెలుసుకొని అవసరాలు తీరుస్తుంది. మానాన్న

ఎప్పుడో... అంతే! అందుకే నేను మా అమ్మని బ్రతికించమంటాను” అన్నాడు.

సందీప్ నిలబడి “సార్! నాకు మానాన్న క్రికెట్ బ్యాట్, సైకిల్ ఏదడిగినా ఇస్తాడు. మా అమ్మ వాటిని సహించేది కాదు. ఎప్పుడు చివాట్లు పెడుతుంది. అందుకే మా నాన్నని బ్రతికించమని ఆ యమధర్మరాజుని కోరుకుంటాను” అని కూర్చున్నాడు

ఇందు లేచి “సార్! మాది పేద కుటుంబం. ఎప్పుడు మా నాన్న తీరిక లేకుండా పనికి వెళ్లి మమ్మల్ని బ్రతికిస్తాడు. కాబట్టి మానాన్నని బ్రతికించుకుంటా” అంది.

త్రినాథ్ లేచి "సార్! నాకు ఇద్దరూ రెండు కళ్ళు లాంటివారు. అమ్మ ఇంట్లో కష్టపడుతుంది. నాన్న ఆఫీసులో కష్టపడతారు. ఇద్దరూ నాకోసమే కష్టపడతారు. ఇది కుదురుతుందో లేదో నాకు తెలీదు. కానీ నాకే అలాంటి స్థితి వస్తే మాత్రం నేను కుదిరితే ఇద్దరిని బ్రతికించమంటాను. కుదరకపోతే నన్ను కూడా వాళ్లతో పాటే తీసుకెళ్లమంటాను. అంతే... అమ్మా నాన్న లేకుండా బ్రతకడం కన్నా నరకం లేదా చావే మంచిది” అన్నాడు

రత్న కుమార్ గారు ఆనందంగా కరతాళాలు మ్రోగించారు నిశ్శబ్దంగా ఉన్న క్లాసులో

శభాష్! చాలా చక్కగా సమాధానం చెప్పావ్” అంటూనే మిగిలిన వారితో తల్లిదండ్రులు లేని జీవితం బ్రతికున్న శవం లాంటిది. అందుకే మనకు ఇద్దరూ కావాలి. అలాగని అమ్మ తిట్టింది అని. నాన్న కసురుకుంటున్నాడని ఒకరిపై ఇష్టం మరొకరిపై అయిష్టం ఉండకూడదు. సరేనా!” అన్నారు.

చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పిన త్రినాథ్ కి "నీతి కథలు" పుస్తకాన్ని బహుకరించారు. పిల్లలందరూ చప్పట్లు కొడుతూ తమ తప్పు తెలుసుకొని హర్షం వ్యక్తం చేశారు. ఆ

-గోదా లిఖిత్ కుమార్, 10వ తరగతి బనిగండ్లపాడు, మధిర, ఖమ్మం జిల్లా

- ఖమ్మం జిల్లా - బడి పిల్లల కథలు-2019




వార్త జాతీయ దినపత్రిక మొగ్గ శీర్షిక(20/05/2019)లో ప్రచురితమైన నా 12వ బాలల కథ: స్నేహమంటే ఇదేలే..

కథ: స్నేహమంటే ఇదేలే..

రచన :గోదా.లిఖిత్ కుమార్
        10th class.

 అనగనగా ఒక అడవిలో ఒక చిలుకల గుంపు ఉండేది. ఆ గుంపులో రాము అనే చిలుక ఒకటి ఉండేది.
        కానీ రామూతో ఏ చిలుక స్నేహం చేసేది కాదు. రాము చాలా బాధ పడేది.
         
           ఒక సారి ఒక వేటగాడు వేసిన ఉచ్చులో రాము చిక్కుకుని ''ఎవరైనా నన్ను కాపాడండి! ప్లీజ్! ఎవరైనా నన్ను ప్రాణగండం నుంచి రక్షించండి. ''అని రోదించసాగింది. కానీ అక్కడున్న చిలుకలు రామూని పట్టించుకోలేదు.
పైగా ఆనందించసాగాయి.
     అప్పుడే అటుగా వెళ్తున్న చిట్టి అనే ఎలుక రామూని చూసింది. ఎలాగైనా రాముని కాపాడాలని అటుగా వెళ్లింది. ఎలాగోలా వేటగాడు రాకముందే ఉచ్చుని తన పదునైన పంటితో కొరికి రామూని కాపాడింది.
   రాము తనని కాపాడిన చిట్టిని కృతజ్ఞతలు చెప్తూ ఆలింగనం చేసుకుంది. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది.
   చాలా రోజులు గడిచినా తరువాత ఒక రోజు చిట్టి ఆడుకోవడానికి ఒంటరిగా, రామూకి చెప్పకుండా వెళ్లింది.
   అప్పుడే అటుగా ఆకలితో ఎగురుతూ వస్తున్న ''బ్లాకీ '' అనే కాకి చిట్టిని చూసి ఆనందంతో కేరింతలు కొడుతూ చిట్టీని నోటపట్టి ఎగిరింది.
            అప్పుడే చిట్టీ కోసం వెళ్తున్న రాము కి బ్లాకి దగ్గర చిట్టి కనబడింది.
తన నేస్తం ఆపదలో ఉన్నాడని గ్రహించిన రాము వాళ్లను అనుసరించింది.
  బ్లాకీకి ఒక అలవాటు ఉంది. దేన్నైనా తినే ముందు పాట పాడి ఆరగించాలని.
   చిట్టిని తినే ముందు బ్లాకీ ''ఆహా ఆహారము! నేడు చక్కని ఫలహారము ''అని కఠోరమైన కంఠంతో పాట పాడసాగింది. చిట్టిని కాలు క్రింద అదిమి పట్టి.
   అప్పుడు రాము ఒక ఉపాయం ఆలోచించి బ్లాకీ తో ''ఏయ్! నాకూ ఆకలి వేస్తుంది. కనుక మనం ఒక పోటీ పెట్టుకుందాం. ఎవరు బాగా పాడితే వారికి ఆ ఎలుక దక్కుతుంది. సరేనా! ''.
      బ్లాకీ సరే అంటూ పాట మొదలు పెట్టింది. చిట్టిని పట్టించుకోకుండా.
   అప్పుడు రాము చిట్టి తో ''పారిపో''అని సింబల్ ఇచ్చింది.
  చిట్టి ఇదే అదునుగా భావించి లేడీ పరుగెత్తి నట్టు పరిగెత్తింది. తన ప్రాణాలను కాపాడుకుంది.
         తన ప్రాణాలను కాపాడిన రాము ని ఆప్యాయంగా హత్తుకుంది.

వార్త మొగ్గ (25/04/2019) పేజీ లో ప్రచురితమైన నా 11వ బాలల కథ : కిట్టు తెలివి 🙏🏻🙏🏻🙏🏻✍🏻✍🏻✍🏻




కథ పేరు :కిట్టు తెలివి   
రచన : గోదా.లిఖిత్ కుమార్

 బనిగండ్లపాడు అనే గ్రామంలో కిట్టు అనే అబ్బాయి ఉండేవాడు. కిట్టు చాలా మంచి పిల్లవాడు. మంచిని తప్ప చెడును సహించలేనివాడు. ఆ ఊరిలోనే సునీత అనే ఆమెకు కిరాణా షాపు ఉంది. సునీత కల్తీ సరుకులు , ఎక్స్పైరీ అయిన చాక్లెట్, బిస్కెట్, కిరాణా సరుకులు అమ్మడం వంటివి చేసేది.
       
          ఒక రోజు కిట్టు, తన చెల్లెలు కలిసి సునీత కిరాణాకి వెళ్లి చాక్లెట్లు,బిస్కెట్లు కొనుకున్నారు. ఇంటికి వెళ్తూ అవి ఓపెన్ చేసి చూస్తే బిస్కెట్లల్లో, చాక్లెట్లు లో పురుగులు ఉన్నాయి.

తిరిగివచ్చి''చాక్లెట్లు లో పురుగులు ఉన్నాయి ఆంటీ '' అన్నాడు కిట్టు.
'' మా చాక్లెట్లు లో పురుగులా? మేము నాణ్యమైన సరుకులు, తిను బండరాలు అమ్ముతాము. నువ్వు వాటిని కింద పడేసి ఉంటావు. ఏదో మాయ మాటలు చెప్పి మళ్లీ చాక్లెట్లు తీసుకుందామని ఇలా అబద్ధాలు చెబుతున్నావు. ఇలా చిన్న వయసులో అబద్ధాలు చెప్పకూడదు కిట్టు ''అని తన తప్పును వెనకేసుకొస్తూ మంచి మాటలు చెప్పినట్లు చెప్పింది సునీత.

ఆమె మోసాన్ని గ్రహించాడు కిట్టు. ఈ ఊరిలో ఆమె చేసే మోసాలు ఆపాలని అనుకుంటూ ముందుకు కదిలాడు కిట్టు.
   అతని అదృష్టం కొద్దీ అక్కడ ఒక పాడైపోయిన బల్బు కనిపించింది. దాన్ని ఒక రాయితో పగల గొట్టాడు.
      అది చూసిన సునీత ''చాలా గడసరి లా ఉన్నావే? అలా రోడ్డు మీద ఉన్న బల్బుని పగలగొట్టొచ్చా? అది తప్పు కదా? అవి ఎవరికైనా గుచ్చుకుంటే ప్రమాదం జరగదూ? అలా చేయకూడదు ''అని మంచిగా నీతిని చెబుతున్నట్టు వాపోయింది.
    ''అవునా ఆంటీ! మరి మీరు పాడైపోయిన చాక్లెట్లు, బిస్కెట్లు, వస్తువులు అమ్మితే మాత్రం అనారోగ్యం పాలవరా? ప్రమాదం జరగదా? మోసం చేయకండి ఆంటీ. మంచిగా కొట్టు నడపండి. ఎవరి అనారోగ్యానికి కారణం కాకండి. ''అని అన్నాడు కిట్టు.
సునీత తెల్ల ముఖం పెట్టింది.

రచన : గోదా. లిఖిత్ కుమార్

కొత్తపల్లి పిల్లల ఈ మాసపత్రిక (జనవరి/ఫిబ్రవరి 2019) లో ప్రచురితమైన నా 10వ బాలల కథ : ప్రాణత్యాగం (కొత్త బేతాళం)✍🏻✍🏻✍🏻✍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻







నవంబర్ 2018 బాలబాట పిల్లల మాసపత్రికలో ప్రచురితమైన నా 9వ బాలల కథ : చీమ కోరిక ✍🏻✍🏻✍🏻🙏🏻🙏🏻🙏🏻




అక్టోబర్ 2018 బాలబాట పిల్లల మాసపత్రికలో ప్రచురితమైన నా మొదటి బాలగేయం "బాలలం..బంగారు వెలుగులం"




అక్టోబరు 2018 బాలబాట పిల్లల మాసపత్రికలో ప్రచురితమైన నా 8వ బాలల కథ "తిలక్ నేర్చిన పాఠం"✍🏻✍🏻✍🏻✍🏻✍🏻




కొత్తపల్లి పిల్లల ఈ మాసపత్రిక (అక్టోబర్ 2018)లో ప్రచురితమైన నా 7వ బాలల కథ "చిలుకతో స్నేహం"🙏🏻🙏🏻🙏🏻





కొత్తపల్లి పిల్లల ఈ మాసపత్రిక (జులై2018)సంచికలో ప్రచురితమైన నా 6వ బాలల కథ "తుంటరి బాలలు"😂😂😂😂🙏🏻🙏🏻🙏🏻✍🏻✍🏻✍🏻✍🏻





15, జనవరి 2020, బుధవారం

వార్త మొగ్గ (07/06/2018) శీర్షికలో ప్రచురితమైన నా 5వ కథ "మనసుంటేనే మార్గం".ఇది నేను నా 9వ తరగతి లో రాసిన కథ.🙏🏻🙏🏻🙏🏻


మొలక పిల్లల మాసపత్రిక (మార్చ్/ఏప్రిల్ 2018) సంచికలో ప్రచురితమైన నా 4వ కథ "కడుపు నింపలేనా మాష్టారూ...?





బాలల బొమ్మరిల్లు పిల్లల మాసపత్రిక (జులై 2017)సంచికలో ప్రచురితమైన నా 3వ కథ"ప్రదీపుడి క్షుద్భాధ"





ప్రదీపుడి ‌‌‍క్షుద్భాధ


       మగధ రాజ్యానికి ప్రదీపుడు అనే మహారాజు ఉండేవాడు.అతను ప్రజల్ని ఎంతో బాగా చూసుకునేవాడు.రాజ్యానికి వచ్చే వేదాంతులను,కవులను,మేధావులను,పండితులను,సాధువులను బాగా ఆదరించేవాడు. అతను వేదాంతులకు, కవులకు, మేధావులకు, పండితులకు బహుమానంగా పుత్తడి,వజ్రవైడుర్యాలను ఇచ్చేవాడు.అతనికి రాజ్యంలో"ద్వితీయ కర్ణుడు" అనే పేరుండేది.ప్రజలు కూడా ఆయన్ని "ద్వితీయ కర్ణుడు మా మహారాజు"అని చెప్పుకునే వారు.ఆయని కీర్తి దేశ నలుమూలలా వ్యాపించింది.
                   
                         ఆయన కొంత కాలానికి   మరణించాడు.అతని పాపపుణ్యాల లో పుణ్యాలు చాలా ఉండడంతో ప్రదీపుడు స్వర్గానికి వెళ్తున్నాడు. దారిలో ఆయనికి బాగా దాహం,ఆకలి వేసాయి.ఆకలి దప్పులను ఆపుకుంటూ స్వర్గం దారిలో నడుస్తూ ఉండగా అతనికి దారిలో ఒక ఫలవృక్షం, చిన్న కాలువ కనబడ్డాయి.ఆకలి దాహం తీర్చుకుందామని అక్కడికి వెళ్ళాడు.నీళ్ళు త్రాగుదామని నీళ్ళను తన దోసిళ్లతో తీసుకుని త్రాగబోయాడు.  ఆశ్చర్యంగా ఆ నీరు "బంగారు ద్రవం"గా మారిపోయింది . ఇలా ఎన్నిసార్లు ప్రయత్నించినా అలాగే జరిగింది.

                సరే పండ్లను తిందామని చెట్టు దగ్గరికి వెళ్ళి పండుకోసి తినబోయాడు .ఆశ్చర్యంగా ఆ ఫలం వజ్రంలా  మారిపోయింది.ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకుందాం అని ఆకాశవాణిని అడిగాడు. "ఓ దాన ప్రదీపా! నీవు కర్ణుడి లా బంగారం,వజ్రంలే దానధర్మాలు చేశావు కానీ ఒక పేదవాడికి కూడా 'అన్నదానం' చేయలేదు. అలాగే ఓ పేద సాధువు నీ దగ్గరకు ఆకలితో వచ్చినప్పుడు నీవు అన్నదానం చేయకుండా బంగారం ఇచ్చావు. అది మోయలేని ఆ బీద సాధువు  అక్కడే కూలాడు. నీవు అతనిని నీ భటులతో గెంటించ్చావు. తరువాత ఆకలితో అలమటించిన ఆ బీద సాధువు మరణించాడు " అని పలికింది."మరి  దీనికి పరిష్కారం ఏమిటి ?"అని అడిగాడు.  నీవీరోజు బ్రహ్మను పూజించి ఈ ఒక్క దినం మానవరూపం దాల్చి భూమి కెళ్ళిపది మంది ఋషులకు అన్నదానం చేయి ఇక నీ పాపాలు తీరిపోతాయి" అని పలికింది. ఆకాశవాణి చెప్పినట్టు చేసి విముక్తి పొందాడు." కేజీల బంగారం కన్నా, గుప్పెడు అన్నదానం మిన్న" అని తెలుసుకున్నాడు. మరో జన్మంటూ ఉంటే మళ్ళీ రాజుగా జన్మించి అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నాడు.


            ************************
       రచన:లిఖిత్ కుమార్ గోదా 
   (ఈ కథ నేను బాలల బొమ్మరిల్లు (జూలై2017) బాలల మాసపత్రిక లో రచించినది")

         


బాల భారతం పిల్లల మాసపత్రిక (జూన్2017) సంచికలో ప్రచురితమైన నా 2వ కథ"కోతి ఉపాయం".



కథ :- కోతి ఉపాయం
(బాల భారతం పత్రిక
  జూన్ 2017)

వేసవి సెలవులకి రాహుల్, దివ్య వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చారు. వాళ్లకి పల్లెటూరు వాతావరణం అంటే ఇష్టం. వెంట తెచ్చుకున్న కెమెరాతో నచ్చిన దృశ్యాల్ని ఫోటోలు తీసేవారు. ఒకరోజు ఓ చెట్టు కింద చేరి పెంపుడు కుక్క లక్కీ తో కలిసి బోలెడు ఫోటోలు దిగారు.
ఆలోగా ఓ రైతు ఇంట్లో దూరిన రెండు కోతుల్ని రైతు రాళ్లు పెట్టి తరిమాడు. ఓ రాయి బలంగా వెళ్లి ఒక కోతి కాలికి తగిలి గాయమైంది. రెండో కోతికి ఏం చేయాలో తోచక రాహుల్, దివ్య దగ్గరకు వచ్చింది. తెలివిగా వాళ్ల దగ్గర ఉన్న కెమెరాను లాక్కొని చెట్టెక్కేసింది. ఆ కెమెరా కోసం వాళ్ళు దాని వెంటపడ్డారు. కోతి చెట్టు దిగి పరుగు అందుకుంది.అది సరాసరి కదలలేక పోతున్నది కోతిని సమీపించి కీచుకీచుమని దాని చుట్టూ తిరుగుతోంది. పడి ఉన్న కోతికి ఏదో అయిందని, తన భాషలో తెలియజేస్తుందని రాహుల్, దివ్యకి అర్థమైంది. దివ్య తన దగ్గర ఉన్న రుమాలు తీసి గాయానికి కట్టింది. తరువాత ఆసుపత్రికి తీసుకెళ్ళి కట్టుకట్టించారు. రెండో కోతి ఆనందంతో గంతులు వేస్తూ వాళ్ళ కెమెరాని వాళ్ళకి అందించింది. ఒక మూగ జీవి ని కాపాడామనే సంతృప్తితో ఇద్దరు ఇల్లు చేరారు.

బాల భారతం పిల్లల మాసపత్రిక (డిసెంబర్ 2016) సంచికలో పిలుపు కథలలో ప్రచురితమైన నా తొలి కథా రచన"హరితహారం"







హరితహారం


హను అనే కోతికి ప్రకృతి అన్న ,మొక్కలు అన్న ఇష్టం. ఇంటి చుట్టూ, పెరట్లో నూ పూల మొక్కలు పెంచేది. ఓ రోజు వర్షం పడుతుండగా నక్క గొడుగు వేసుకుని ఫోన్లో మాట్లాడుకుంటూ అటువైపు వచ్చింది. “ఏంటి హను ” ఇలా తడుస్తూ ముక్కలు నాటక పోతే నేమ్? అని ప్రశ్నించింది. అయ్యో నక్క బావా! ఇప్పుడు మొక్కలు నాటితే కొన్నాళ్ళకు అవి పెరిగి పెద్ద చెట్ల అవుతాయి. మనకు రక్షణ, నివాసం, సంపద కలిగిస్తాయి. చెట్లు జీవులకు ప్రాణవాయువు అందిస్తాయి. అలాగే తినడానికి పళ్ళు, పూలు, కలపను అందిస్తాయి. విడమరచి చెప్పింది కోతి. ఇంతలో అటు పోతున్న పోలీస్ ఎలుగుబంటి వీళ్ళను చూసింది . కోతి మాటలు దానిలో స్ఫూర్తి కలిగించాయి.

ఇకమీదట మొక్కలు పెంచాలని నిర్ణయించుకుంది. నక్క, ఎలుగుబంటి కోసం వేచి ఉన్నాయి అడవిలో మొక్కలు నాటి చెట్లను కాపాడతామని మాట ఇచ్చాయి. ఆ మాటలకు హను “మా అడవంతా పచ్చదనంతో నిండబోతోందోచ్"- అంటూ వానలో చిందేసింది.



                   *********************
      
        సేకరణ: బాల భారతం పత్రిక
                   డిసెంబరు 2016
     రచయిత: లిఖిత్ కుమార్ గోదా



రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...