31, మే 2020, ఆదివారం

దేశభక్తి సాహిత్య ఈ మాస పత్రిక కోసం రాసిన "జోహార్..సర్దార్"కవిత.జూన్ 2020 ఈరోజు (16/06/2020) నాడు ప్రచురితమైంది.సంపాద వర్గానికి కృతజ్ఞతలు 🌹🌹🌹

కవిత:- జోహార్..సర్దార్
రచన:-లిఖిత్ కుమార్ గోదా.

__________________


రాస్తున్నా సర్దార్ నీ పైన ఓ కవిత 
చాటి చెబుతున్న దేశానికి నీ చరిత.
నువ్వు “ఉక్కుమనిషి” వి
ఉద్యమాల బాటలో నడిచి
దేశమాత సంకెళ్లు తెంచి
దుష్టులను తరిమేసిన వీరుడువి,
బారిష్టరు చదివావు 
ఎదురులేని న్యాయవాదివై నిలిచావు,
మహాత్మునికి సహచరుడువి
వాక్చాతుర్యం తెలిసిన మితభాషివి
మానవత్వం తెలిసిన మనూజుడువి,
తొలి ఉపప్రధానివయ్యి చేశావు
దేశానికి నీ సేవ,
ఉపమన్యుడి వంటి పట్టుదలతో
నవాబులు వంటి ఎందరో 
అధములనీ చుట్టుముట్టి
ఎన్నో సంస్థానాలను ఏకం చేసి,
ఐక్యత భావానికి నిలువెత్తు రూపంగా నిలిచిన కార్యసాధకుడవి,
పటేల్ అంటే గుండె ధైర్యం అని
సర్దార్ అంటే ఐక్యత అని
భావితరాలకు తెలియపరిచావు,
భరతమాత కన్న భారతరత్నానివి, జాతి గర్వించదగ్గ ఆదర్శవంతమైన పాలనను చేసిన మహా నాయకుడవి,
సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి
భారత జాతి అంతా ఒక్కటేనని నిరూపించి
నిర్మలమైన దేశాన్ని నిర్మించిన మహోన్నతడివి.
ప్రతి భారతీయుడి ప్రాతఃస్మరణీయుడు నువ్వు.
భావితరాలకు స్ఫూర్తి నిచ్చిన “వల్లభాయ్”
ఇవే నేను నీకు అందించే కవితల కృతజ్ఞతలు.
_______________________________
శీర్షిక : - జోహార్.. సర్దార్..,
కవి పేరు: - లిఖిత్ కుమార్ గోదా,
రచన: - జోహార్.. సర్దార్. (కవిత)
చిరునామా: -
 హౌస్ నెంబర్ : - 
 1 - 115/3,బనిగండ్లపాడు గ్రామం, 
ఎర్రుపాలెం మండలం,
ఖమ్మం జిల్లా - 507 202.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
_________________

చిత్రాలు 👇👇👇

క్రింది లింక్లో కవితను చదవగలరు 🦚💐🏵️

https://drive.google.com/file/d/1_PVxnzDjL1dBtCpw04b5ZFXXv73pXJtr/view

30, మే 2020, శనివారం

నా మొదటి పుస్తక సమీక్ష జక్కాపూర్ బడి పిల్లలు రాసిన కవితల సంకలనం "మధుర పద్మాలు"పై.(ఈ పుస్తక సమీక్ష (11/06/2020) నేటినిజం దినపత్రికలో ప్రచురితం.

పుస్తక సమీక్ష-1

నేను రాసిన 25వ బాలల కథ "మోసకారి మొసలి స్నేహం"

25వ బాలల కథ:-

"మోసకారి మొసలి స్నేహం"

రచన:- లిఖిత్ కుమార్ గోదా.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ విద్యార్థి, 
మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్, ఖమ్మం జిల్లా - 507204
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 
మార్తాండ అనే అడవిలో భైరవి అనే పెద్ద కొలను ఉండేది. అందులో ఎప్పటినుండో నివాసముంటున్న మిక్కీ అనే ఒక ముసలి మొసలి చిన్న చిన్న చేపలని తింటూ జీవనం గడిపేది.
   మొసలికి వయసు పైబడటం తో చేపల్ని వేటాడలేక కడుపు మాడ్చుకునేది.
ఒకసారి మిక్కీ నీళ్ళల్లో ఉండలేక ఒడ్డు మీదకి వచ్చింది. కొలను వైపు అలానే చూస్తూ ఉంది.
అప్పుడు నిక్కీ అనే కొంగ చేపలని వేటాడడానికి వచ్చింది ఆ కొలను దగ్గరికి. మిక్కీ చేపలు పట్టడం చూసింది నిక్కీ. బ్రహ్మ విద్య తెలిసినట్టు చేపల పట్టుకొని తింటుంది నిక్కీ.
నిక్కీ భోజనం అయిపోగానే మిక్కీ నిక్కీని పిలిచి “హాయ్ నేస్తమా! నాపేరు మిక్కీ. నేనొక ముసలి మొసలిని. నేను ముసలిదానిని కదా. వేటాడలేక పోతున్నాను. కొంచెం దయ ఉంచి కొన్ని చేపలు పట్టి నాకు ఇవ్వవూ. బాగా ఆకలిగా ఉంది.” అని చెప్పింది నిక్కీతో.
నిక్కీ మిక్కీ బాధ చూడలేక జాలి కలిగి దయతో కొన్ని చేపలు వేటాడి మిక్కీ ఆకలి తీర్చింది.
నిక్కీ మిక్కీకి సహాయం చేసినందుకు మిక్కీ నిక్కీతో “నేస్తమా కృతజ్ఞతలు! నా ఆకలి తీర్చావు. నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను నాతో జత కడతావా.” అని అడిగింది నిక్కీని.
“తప్పకుండా మిత్రమా! ఈరోజు నుంచి మనం స్నేహితులం” అంది నిక్కీ.
“కాకపోతే మిత్రమా నువ్వు రోజు నాకు సహాయం చేయాలి! చేస్తావా?” అని అడిగింది మిక్కీ.
“ఏంటది మిత్రమా చెప్పు?” అనంది.
“మనమిద్దరం ఒక ఒప్పందం చేసుకుందాం. నేను ఎలాగో ముసలిదాన్ని. బ్రతికినా ఇంకొన్నాళ్లు. నేను బ్రతికినన్నాళ్లు నువ్వు నాకు ఆహారం అందించావే అనుకో నా దగ్గర ఉన్న బంగారం నీకు ఇస్తాను. అప్పుడు నువ్వు సంతోషంగా గడపవచ్చు. ఓకేనా" అన్నది మిక్కీ.
నిక్కీకి బంగారం మీద ఉన్న ఆశతో సరేనని ఒప్పుకున్నది.

అలా చాలా కాలం గడిచిన తర్వాత ఒకసారి మనుషులు పర్యావరణానికి చేసిన నష్టం కారణంగా ఆ సంవత్సరం వర్షాలు పడక కొలను ఎండిపోయే స్థితికి వచ్చేసింది. కొలను లో చేపలు కూడా దొరక్కపోవడంతో నిక్కీ మిక్కీ కి ఆహారం అందించలేకపోయింది.
అయితే మిక్కీ ఒక పథకాన్ని ఆలోచించింది. తన దగ్గర ఉన్న బంగారం తో రోజుకొక కొంగ కి ఆశ చూపించి దాన్ని పట్టి తింటే తాను ఇంకొంతకాలం బ్రతుకుతా అని అనుకున్నది. తన ఆకలి కోసం మిత్రులు లేడు శత్రువు లేడు అన్నట్టుగా ఆలోచించింది మిక్కీ.
రెండు రోజుల నుండి ఆహారం లేక సతమతమైన మిక్కీ నిక్కీ కొలను దగ్గరికి రావడం గమనించింది.
మొసలి కన్నీరు కారుస్తూ నిక్కీ తో “మిత్రమా! కొలను ఎండిపో వస్తుంది . చేపలు ఎట్లాగు లేవు. నీకు నాకు ఇద్దరికి ఆహారం లేదు. బహుశా ఇక నువ్వు వేరే చోటకి వెళ్లాల్సి వస్తుందేమో. ఇక నేను అస్తమించాల్సిన తరుణం ఆసన్నమైంది ఏమో. మన స్నేహ బంధం తెగిపోతుంది ఏమో. నువ్వు మన స్నేహానికి చాలా విలువ ఇచ్చి నాకు సేవ చేశావు. నీకు మొదట మాట ఇచ్చాను కదా నీకు బంగారం ఇస్తానని ఇదిగో ఈ సంచిలో ఉంది వచ్చి తీసుకో” అని బంగారం ఉన్న సంచిని చూపించింది మొసలి.
బంగారం మీద ఆశతో నిక్కీ సంచి దగ్గరికి రాగానే ఒక్కసారిగా మిక్కీ నిక్కీ మీదకి దూకింది. “ఏంటిది మిక్కీ!నీకు సహాయం చేసినందుకు ఇదా నువ్వు నాకు చేసే న్యాయం. అయినా మొసలివని అనిపించావు. నీ మొసలి కన్నీరు కార్చి ఈ ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చావు. దుష్టులకు పోనీలే పాపం అని సహాయం చేస్తే అది తిరిగి సహాయకుడికే అపకారం చేస్తారని నిరూపించావు.” అని తనువు చాలించింది నిక్కీ.

28, మే 2020, గురువారం

ఈరోజు మొలక న్యూస్ లో వచ్చిన నా నానోలు

లిఖిత్ కుమార్ గోదా నానోలు(21-25)

_____________________
21)లాలన 
      అమ్మ
      పాలన
      నాన్న.
22)కల్లు
      మత్తు
      కల్ల
      గమ్మత్తు.
23)బొబ్బలు
      చేయి
      దెబ్బలు
      రాయి.
24)కవి
      కేసరి
      కవిత
     గర్జన 
25)ప్రచారం
      మనిషి
      ఆచారం
      మనీషి!

____________________________
రచన:-లిఖిత్ కుమార్ గోదా.
క్రింద లింకులో వీక్షించగలరు..
https://molakanews.page/article/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8B%E0%B0%B2%E0%B1%81_3(19-25)-19)%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B2%E0%B1%81%E0%B0%B5-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A3%E0%B0%82-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B2%E0%B1%81%E0%B0%B5%E0%B1%81-%E0%B0%A6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82.-20)%E0%B0%AE%E0%B0%A4%E0%B0%82-%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B1%81-%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B0%82-%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82.-21)%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A8-%E0%B0%85%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A8-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8.-22)%E0%B0%95%E0%B0%B2/QTjYWG.html

మొలక న్యూస్ లో నా సిరా మాటలు (కవితలు-7)

త్రివేణి సంగమం (కవిత)
రచన:-లిఖిత్ కుమార్ గోదా (చిన్ని)
_______________________

ఓ కోడికూత వేళ
అంటే సూర్యోదయ సమయాన 
త్రివేణి సంగమం 
మువ్వల సవ్వడితో ప్రవహిస్తోంది,
కమనీయమైన నయనాలతో సూర్యభగవానుడు,
త్రివేణి పై వాత్సల్యంతో 
కిరణాన్ని త్రివేణిపై ప్రసరింపజేశాడు,
ఆ క్షణం త్రివేణి
కిరణ స్పర్శతో పులకరించిపోయింది,
వెలలేని ఆనందంతో పరవశించిపోయింది.
తన పేర్మికి సూచికగా 
తన గర్భంలో దాచుకున్న కలువతో 
కెరటంలా ఎగిరి
తామరని అర్పిస్తూ 
"నమస్సుమాంజలి" పలికింది.
జగతి మొత్తం
"త్రివేణి కిరణాన్ని" చూసి 
చల్లని చూపులు వాల్చుతూ 
నవ్వుల తారలను విసురుతూ 
మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది.
ఆనందంలో మునిగిపోయింది.

______________________
క్రింద లింకులో చదవగలరు👇👇👇👇👇👇https://molakanews.page/article/%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4:-%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%A3%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%82%E0%B0%97%E0%B0%AE%E0%B0%82---%E0%B0%B0%E0%B0%9A%E0%B0%A8:-%E0%B0%B2%E0%B0%BF%E0%B0%96%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%97%E0%B1%8B%E0%B0%A6%E0%B0%BE.---%E0%B0%93-%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B0%BF%E0%B0%95%E0%B1%82%E0%B0%A4-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B3-%E0%B0%85%E0%B0%82%E0%B0%9F%E0%B1%87-%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B1%8B%E0%B0%A6%E0%B0%AF-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8-%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%A3%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%82%E0%B0%97%E0%B0%AE%E0%B0%82-%E0%B0%AE/u5jSmY.html

24, మే 2020, ఆదివారం

లిఖిత్ కుమార్ గోదా నానోలు(11-20)

లిఖిత్ కుమార్ గోదా నానోలు (11-20)

రచన:-లిఖిత్ కుమార్ గోదా
_______________________

11)పువ్వు
      నవ్వు
      పురుగు
      చెరుపు.
_____________
12)పుస్తకం
     పువ్వు
     అక్షరాలు
     పరిమళం.
_____________
13)నైనం
      కన్నీళ్లు
      నైలా
      వర్షం.

___________
14)అమ్మ
     "రాణి"
      నాన్న
     "రాజు".
____________
15)ప్రేమ
      ఐరావతం
      అహంకారం
     మత్తము.
____________
16)తరవాణి 
      బలం
      బాలవాణి
      నిజం.
___________
17)పుస్తకం
      ప్రమిద
      చదువు
      విజేత.
____________
18)చరవాణి
      ఆటలు
      తల్లిదండ్రి
      తిట్లు.
 ___________
19)విలువ 
      ప్రాణం
     నిలువు
     దానం.
_________
20)మతం
      అందరు
     హితం
     సర్వం.
___________ 

23, మే 2020, శనివారం

లిఖిత్ కుమార్ గోదా నానోలు-1 (10)

 నానోలు -1(1-10)
లిఖిత్ కుమార్ గోదా.


________________________
1)చిరునవ్వు
    ఆరోగ్యం
    కంటతడి
    అనారోగ్యం.
________________________
2)కవిత్వం
   కోడికూత
   కవి
   "మేలు"కో(రు)డి.
_________________________
3)కాకి గానం
   వికారం,
   కోకిల గాత్రం
   వినసొంపు.
_________________________
4)మాట రెండు
   విధాలుగా
   పిలుపు
   అరుపు.
_________________________
5)కోవెల
   దేవుళ్లు
   ఇల్లు
   తల్లిదండ్రులు.
_________________________
6)సంకల్పం
   మార్గం
   గమనం
   లాంతరు.
_________________________
7)శాంతం
    మిత్రుడు
    కోపం
    విరోధి.
________________________
8)పబ్జి 
    పిచ్చి,
    పిచ్చికి
    సూచిక.
_________________________
9)కల్పన
   వినసొంపు
   నిజం
   విషాదం.
_________________________
10)విసుగు
      దోమ
      విలువ 
      చీమ.
నానోలు 👇👇👇 క్రింది లింక్లో చదవొచ్చు 👇👇👇

https://tharanam.net/నానోలు-రచన-లిఖిత్-కుమార్

22, మే 2020, శుక్రవారం

సిరా మాటలు కవితలు-6

నేస్తమా..నా ప్రియ వరమా..👬👬👬



నేనంటే వాడికి ప్రాణం
నా కోసం పరులతో చేస్తాడు రణం.,
పిచ్చిపాటి ఆలోచనలతో,
నా హృదయం సతమతమైనప్పుడు
అతడు శ్రీకృష్ణుడై నాకు గీతను బోధిస్తాడు.
ఆపదల్లో,అవమానాల్లో
కర్ణుడిలా బ్రతుకుతున్న నాకు
దుర్యోధనుడిలా ఆశ్రయాన్ని కల్పిస్తాడు.
నా కోసం వీలైతే
జటాయువులా మరణిస్తాడు.
లేదా సుగ్రీవుడిలా ఒంటరనైనపుడు
నాకు అపాయం తలపెట్టిన
వాలీని రాముడిలా వధిస్తాడు.
కుచేలుడిలా దరిద్రాన్ని వెంటబెట్టుకునుంటే
అడగకుండానే కృష్ణుడిలా
సకలసంపదలు కల్పిస్తాడు.
సదా నా ఉన్నతినే ఆకాంక్షిస్తాడు
నా తల్లిదండ్రుల తరువాత
నేను బాగుండాలని ఆశించే 
నా శ్రేయోభిలాషి...


నా తొలి పాట రచన ...

పాట:  అవని ఎంత గొప్పదో....
🙏 🙏 🙏 🙏 
పల్లవి: 
అవని ఎంత గొప్పదో అమ్మ అంత గొప్పది 
సంద్రమంత ప్రేమన ఎదలోన దాచినది         ll2ll

చరణం1: 
కడుపు లోని ప్రేమను బిడ్డకు అందిస్తుంది
ఒడినే దిండుగా మలచి జోల పాడుతుంది                             ||2||
చేతితో చేతిని పట్టి నడక నేర్పుతుంది

ఏడిస్తే కన్నీళ్లు తుడిచే వేలు తానౌవతుంది                              ||2||

చరణం 2:
చంద్రుణ్ణి చూపిస్తూ గోరుముద్ద లెడుతుంది
కొంగునే ఊయల చేసి లాలి పాడుతుంది||2||
అల్లారుముద్దుగా అనురాగం పంచుతోంది
కమ్మనీ లాలి పాడే కోయిల తానౌతుంది  
||2||
          *   *   *   *  *  *  *  *  *  *  *
రచన: గోదా. లిఖిత్ కుమార్
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్.


18, మే 2020, సోమవారం

నా గురువు గారు పోతగాని గారిపై నేను రాసిన పద్యాలు

ఓం🙏🙏🙏 శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏

పోతగాని✍🏻✍🏻✍🏻 రచన పోరుబాట...

1)ఆ.వె:
    పాల బువ్వ బెట్టి పాఠాలు బోధించు
    చెలిమి తోన వారు వెలుగు చూపు
     బాల ఎడద నెరిగి బాలుడై మెలుగును
     బాల పోతగాని బాల చెలిమి!!

2)ఆ.వె :
    వెలుగు బాల తోన వెలుగుబాటమనకు
    పాల బువ్వ కథలు బాల కొరకు
    పూల గోపురమున పూసిన దిగ్గజం
    బాల పోతగాని బాల మురళి!!

3)ఆ.వె:
   గోరుముద్ద వంటి పోతగాని పిలుపు 
   తేటతెల్ల మవును తెలుగు భాష 
   తెలుగు చరిత లోన తేజస్సు గలవాడు
   పోత గాని గళము పోరుబాట!!

4)ఆ.వె
    పరితపించి పోవు ప్రతిపాఠకమహుడు
    కవిత యంతర్యమును గళముఎరుగుఁ
    నైన మునగలదును నైలాల గవితలు
    కవిత పోతగాని కలము నుండి!!
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
రచన:-లిఖిత్ కుమార్ గోదా 

15, మే 2020, శుక్రవారం

లిఖిత్ రెక్కలు (6️⃣)

 👐👐👐లిఖిత్ రెక్కలు👐👐👐


1️⃣) పుస్తకాలను 
      విడిచాడు,
       చైతన్యాన్ని
       వెతుకుతున్నాడు.
                 నేటి మనిషి
                 మేధస్సు ఇది!
       *     *    *    *     *    *
 
2️⃣) దానాలలో
      కర్ణుడు ఘనుడు
       అన్నదానంలో
        రైతు ఘనుడు.
                  మానవుడు గొప్ప
                   కష్టశీలి,దానశీలి!
         *     *    * ‌    *    *      *

3️⃣) బ్రహ్మ చేస్తే
       మనిషి,
        మనిషి చేస్తే
        యంత్రం.
                అంతా 
                 సృష్టేగా!
          *      *     *     *        *       *


4️⃣) ఉపమన్యుడు
        శివున్ని రప్పించాడు,
         ప్రహ్లాదుడు
         విష్ణువుని మెప్పించాడు.
                      బాలల
                      భలే మేధావులు!
         *         *           *          *        *
5️⃣) మేధావి
        మాట్లాడతాడు.
        మూర్ఖుడు
         వాదిస్తాడు.
                 మేధావికి, మూర్ఖుడికి
                 భేదం ఇదే!
         *         *         *       *        *
6️⃣) ఆవేదన ఎందుకు
        ఆలోచిస్తే సాధ్యం.
        అది కవిత్వమైన,
         సమస్యలకు పరిష్కారాలైనా .
                    ఆలోచిస్తేనే కదా 
                     ఏదైనా సుసాధ్యం.
        *       *           *         *         *
రచన:- లిఖిత్ కుమార్ గోదా(చిన్ని)




13, మే 2020, బుధవారం

మొలక న్యూస్ లో వచ్చిన నా 3️⃣వ కవిత (13/05/2020)

మొలక న్యూస్ లో వచ్చిన నా 4️⃣వ కవిత (సిరా మాటలు-కవితలు)

కవిత :- ఒక్క చుక్క నీరు
(సిరా మాటలు-కవితలు) 

ఒక్క చుక్క నీరు 
జీవుల కంఠములో పడితే, గొంతు తడుస్తుంది. 
ఒక్క చుక్క నీరు, 
కనుల నుండి జారితే, అది ఘోషవతుంది. 
ఒక్క చుక్క నీరు, అవని పైన పడితే, థాత్రి సర్వం పులకరిస్తుంది. 
ఒక్క చుక్క నీరు, 
నుదుటి నుండి జారితే, అది శ్రమ అవుతుంది. 
ఒక్క చుక్క నీరు, మేఘం నుండి. ఊడిపడితే, 
అది భూమికి, రైతుకి భరోసా అవుతుంది. 
ఒక్క చుక్క నీరు, 
సంద్రంలోని ముత్యపు చిప్పలో ఇరుక్కుంటే, 
అది ముత్యమై ప్రకాశిస్తుంది. 
ఒక్క చుక్క నీరు, పుష్పంపై వాలితే, అది పులకరిస్తుంది. పరిమళిస్తుంది. 
ఒక్క చుక్క నీరు, 
భగవంతుని దేహాన్ని చుట్టితే, అది అభిషేకమవుతుంది. 
ఒక్క చుక్క నీరు, 
మనిషికి మార్గమవుతుంది. 
        -గోదా. లిఖిత్ కుమార్.


సిరా మాటలు కవితలు -3


||క్వారంటైన్ రైటింగ్స్-4||


¶¶కవిత -3¶¶


కవిత:-తేనీరు..(సిరా మాటలు )


లిఖిత్ కుమార్ గోదా కవితలు











సలసల కాలుతుంది తేనీరు (ఛాయ్)

సలసల కాలే దాన్ని

పోసానో పేపర్ గ్లాసులో

అబ్బా! పట్టుకుంటే చర్మం సైతం ఊడేటట్టుంది

పెదవులపై పెడితే పెదవులు సైతం 

లావా పేలినట్టు పేలిపోయేట్టుంది.

నాలుక మీద పడితే

"నాలుక డాక్టర్" దగ్గరికి 

వెళ్లాల్సి వస్తుందేమో.

పట్టుకుంటేనే 'అమ్మో' అన్న

ఐదు అడుగుల భారీ శరీరం

కలిగి ఉన్న నేను,

పెదవులపై పెట్టుకుంటేనే 

ఆ వేడికి పాతాళం దాకా అరిచిన నేను,

ఆ తేనీరు వేడిని

తట్టుకుంటున్న ఐదు సెంటీమీటర్ల

పేపర్ గ్లాస్ ను చూసి సిగ్గు పడుతున్నాను.

అది జీవి కాదు;

దానికి జీవం లేదు,

నలిపేస్తే నలిగిపోయే ఆ పేపర్ గ్లాసు

అంతటి వేడిని ఎలా భరిస్తుంది?

ఆ పేపర్ గ్లాస్ ను చూస్తూ,

దాని ముందు నేను నలిగిపోయాను,

గాలికి ఎగిరిపోయాను,

చతికిలబడిపోయాను,

ముడుచుకున్నాను.

ఇంతలో తేనీరు చల్లారడంతో

ఆ పేపర్ క్లాస్ కి జోహార్లు కొడుతూ 

ఓ సిప్ వేశాను.


__________________


రచన:- లిఖిత్ కుమార్ గోదా (చిన్ని)


__________________


మొలక న్యూస్ (13/05/2020)


క్రింది లింక్లో కవితని చదవొచ్చు 👇👇

https://molakanews.page/82hCGA.html

కవి సంగమం ఫేస్బుక్ గ్రూపులో అప్రూవ్ అయచయిందోచ్ నా కవిత



12, మే 2020, మంగళవారం

నా పద్యాలు-2(ఒక సంవత్సరం క్రితం 12-05-2019)

మమత అసలు పేరు..


ఆ.వె:
1) పుట్టగానే శిశువు పులకించు పోవును /
 అమ్మ యనెడి పిలుపు కాత్ర పడును /    
పసిద నమును చూసి పరవశమొందును /   
కన్న తల్లి కరుణ కలత దీర్చు!! 

2)కడుపులోన మోసి కనులలో ననుదాచి / 
   జాబిలమ్మ జూపి హాయినిచ్చు  / 
   గోరు ముద్ద బెట్టి గోముగా ముద్దాడు /
   కన్న తల్లి కరుణ కలత దీర్చు!!

3)అమ్మ మాట యొకటి యమృతంబు తొలకరి /
"లాలి జోజొ" యంటు లాలి పాడు 
మమత మారు  పేరు మాతయని యెరుగురా / 
 కన్న తల్లి కరుణ కలత దీర్చు!!

4) అమ్మ చూడు మనల యాలనా పాలనా /
    తల్లి యొడిన యుండు తీపి పేర్మి/ 
  కడుపు లోని కరుణ కమ్మగా కురిపించు /
కన్న తల్లి కరుణ కలత దీర్చు!!

5) తెలుగు వాడు బిలుచు తల్లని పేర్మితో/ 
    తెలుగు భాష లోని తీపి పదము/ 
   "మమ్మి "అన్న పిలుపు మరువుము/ సోదరా 
  కన్న తల్లి కరుణ కలత దీర్చు!!

రచన :గోదా. లిఖిత్ కుమార్ 
10వ తరగతి, యస్. ఆర్. ఆర్. యమ్. జి. హెచ్. స్కూలు,  బనిగండ్లపాడు. 

ఈ పద్యాలు మా అమ్మ రాణిగారికి అంకితం చేస్తూ. .

11, మే 2020, సోమవారం

నా పద్యాలు-1

||క్వారెంటైన్ రైటింగ్స్ -3||
||కవిత-3||

🙏🙏🎉🎉💐💐🤱🤱🤰🤰అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు🤱🤱💐💐🏵️🏵️
ఆ.వె పద్యం/
కరము కరము లోన కమనీయ భావన/
గోరుముద్దలెట్టు కోయిలమ్మ/
కడుపులోని ప్రేమ కమ్మగా గురిపించు/
మాతృమూర్తులకిదె వందనాలు..!

10, మే 2020, ఆదివారం

🙏🙏💐💐🤱🤱🤰🤰 అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు 🤱🤱💐🏵️ (10/05/2020)

||క్వారంటైన్ రైటింగ్స్ -2||
||కవిత -2||

🤰🤰🤱🤱 ప్రపంచ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు 🤰🤰🤱🤱•••
________________________________
••అమ్మ.. మనందరి మోనిస్..

అమ్మ
రోజు పిలుచుకునే పాత పిలుపే
కానీ కొత్త నవ్వుతో అలరించే కవిత..

అమ్మ
సిరి హాసాల సుమాలు
కేశాల్లో దాచుకునే
ఓ పూలతోట..

అమ్మ
కడుపులో గొప్ప ప్రేమను దాచుకుని
నిశ్చలంగా ప్రవహించే
ఓ సంద్రం..

అమ్మ
తన మువ్వల సవ్వడితో
ఇంటిని ప్రశాంతంగా మార్చే
ఓ గువ్వ..

అమ్మ
ఏమడిగినా కసురుకోకుండా
కొసరి కొసరి ఇచ్చే
ఓ కల్పవృక్షం..
ఓ కామధేనువు..

అమ్మ
ఎంత పెద్దదైనా
చిన్న పిల్లలా అల్లరి చేసే
ఓ బుడుగు..

అమ్మ
నాట్యం చేసే నెమలి
పాటలు పాడే కోయిల
ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి..

అమ్మ
మారుతి ఎదలో సీతారాములను దాచుకుంటే
తన ఎదలో తన కుటుంబాన్ని దాచుకునే
ఓ అవని..

అమ్మ
నుదుటిపై పెట్టే చుంబనం ఆనందాన్ని ఇస్తుంది
నుదుటిపై పెట్టే బొట్టు అందాన్నిస్తుంది మనకు
ఓ నేస్తం..

అమ్మ
బిడ్డ ఎంత దూరం పెంచుకునే కొద్ది
అంత ప్రేమను పెంచుకుంటుంది
తెంపితే తప్ప ఆ బంధం తెగిపోని
ఓ గాలిపటం..

అమ్మ
తన కుటుంబంలో వారందర్నీ
పేర్మితో పాలించే
ఓ రాణి..

అమ్మ
తన పిల్లలే తనకి కోహినూర్ వజ్రాలు
అందుకేనేమో ఈ విశ్వంలోకెల్లా
ఆమె అత్యంత సంపన్నురాలు..
( నేను ఈ కవిత రాస్తున్నప్పుడు ఓ దెయ్యం నా కవిత చదవడానికి వచ్చింది.ఆమె కూడా అమ్మేనట..)
రచన:లిఖిత్ కుమార్ గోదా (చిన్ని)


6, మే 2020, బుధవారం

మొలక న్యూస్ లో వచ్చిన నా 2️⃣4️⃣ బాలల కథ జిమ్మీ మెడలో మువ్వ

కథ:జిమ్మీ మెడలో మువ్వ (బాలల కథ)
 రచన :-లిఖిత్ కుమార్ గోదా (చిన్ని)
     చిన్ని వాళ్ళింట్లో జిమ్మీ అనే కుక్క పిల్ల ఉండేది. దానికి పొడవాటి తెల్లటి పట్టులాంటి జుట్టు, నల్లటి కళ్ళు, అందమైన తోక, అల్లరి చేష్టలతో అందర్నీ ఆకర్షించేది. జిమ్మీ ఎదిగి పెద్దదయిన తర్వాత చిన్ని వాళ్ళ నాన్న సూర్య జిమ్మీ మెడలో ఒక మువ్వ కట్టాడు. అది కట్టిన దగ్గర నుండి తను నడిచే తరుణంలో మువ్వ ఘల్లు ఘల్లు మని శబ్దం రావడం జిమ్మికి ఎంతో ఆనందాన్ని ఇచ్చేది.కొద్దికాలం తర్వాత జిమ్మి మెడలో మువ్వని చూసిన చుట్టుపక్కన కుక్కలు జిమ్మి నీ చూసి నవ్వుకునేవి.జిమ్మీ చిన్ని తో కలిసి సాయంత్రం వాకింగ్ కి వెళ్ళినప్పుడల్లా "నీ మెడలో మువ్వ.. గువ్వలా పాడుతుంది"; "నీ మెడలో మువ్వ భలే విడ్డూరంగా ఉంది జిమ్మి" అని బయటి కుక్కలు హేళన చేసేవి‌.అలా అన్నప్పుడల్లా జిమ్మీ కి చాలా బాధ వేసేది పాపం.కొంతకాలం గడిచిన తరువాత జిమ్మీకి, సన్నీ అనే కుక్క తో స్నేహం ఏర్పడింది.అవి రెండూ ఎప్పుడూ ముచ్చటించుకునేవి. ఒకసారి మాటల మధ్యలో జిమ్మి తన మెడలో ఉన్న మువ్వ గురించి, కుక్కల తనను హేళన చేయడం గురించి బాధ పడింది. అప్పుడు సన్నీ "అరెరే!ఎందుకు మిత్రమా బాధపడుతున్నావు. నీ యజమాని నీకు మంచి పనే కదా చేశాడు. నీ జాగ్రత్త కోసమే ఆ మువ్వని నీ మెడలో కట్టాడు నీ యజమాని‌. ఆ మువ్వని చూస్తేనే తెలుస్తుంది నీ యజమానికి నీ మీద ఎంత ప్రేమ ఉందో"అనంది సన్నీ. "ప్రేమా! ఎలాగో చెప్పు సన్నీ" అని అడిగింది జిమ్మి."ఆ మువ్వ వల్ల నువ్వు తిరుగుతుంటే శబ్దం వస్తుంది. నువ్వెక్కడున్నావో తేలిగ్గా గుర్తించవచ్చు. ఒకవేళ నువ్వు ఎక్కడైనా తప్పిపోయిన నిన్ను కనిపెట్టడం ఈజీ కదా. లేదా ఏమైనా పాడు కుక్కలు నిన్ను కరవడానికి వచ్చినప్పుడు నువ్వు భయపడితూ పరిగెడుతుంటే ఆ మువ్వ శబ్దం వల్ల నీ యజమాని అది నువ్వే అని అప్రమత్తమై నిన్ను కాపాడే అవకాశం ఉంది. నిన్ను కాపాడుకోవడం నీ యజమాని బాధ్యత. అందుకే నీ మీద ప్రేమతో, బయటి కుక్కలకు భయపడి నిన్ను కాపాడుకోవడం కోసం ప్రేమతో నీ మెడలో ఈ మువ్వని కట్టారు అంతే. నువ్వు ఆ పాడు కుక్కల మాటలు గురించి ఆలోచించకు."అని సర్ది చెప్పింది సన్నీ.అప్పటినుండి జిమ్మీ మెడలో మువ్వ గురించి ఎప్పుడూ బాధపడలేదు.
May 6, 2020 • T. VEDANTA SURY • Story


2, మే 2020, శనివారం

మొలక న్యూస్(02/05/2020) లో వచ్చిన నా 23వ బాలల కథ "మోసానికి తగిన శాస్తి"




కథ:మోసానికి తగిన శాస్తి(బాలల కథ)
రచన :లిఖిత్ కుమార్ గోదా
      నరేష్ గోపవరం అనే గ్రామంలో నివసిస్తున్నాడు. నరేష్ కథలు రాయడం మొదలుపెట్టాడు అప్పుడే.నరేష్ కథలు రాయడం వల్ల ఆ ఊర్లో అతనికి చాలా మంచి పేరు ఉంది. అందరూ అతన్ని అభినందించడం కాక ప్రోత్సహించే వారు కూడా. ఒక రోజు ఆ ఊరిలోనే ఉన్న ఒక పెద్ద రచయిత వేదాంత సూరి గారు నరేష్ దగ్గరకు వచ్చి "బాబు నరేష్! నువ్వు కథలు రాయడం మొదలుపెట్టావట. నువ్వు నీ భవిష్యత్తులో గొప్ప రచయితగా ఎదగాలంటే ఇప్పుడు రాసిన కథల్ని ఏదో ఒక దినపత్రికకో, వారపత్రికకో, మాసపత్రికకో, పంపించి చూడు. నీకు చాలా గొప్ప పేరు వస్తుంది."అని సలహా ఇచ్చాడు. నరేష్ వేదాంత సూరి గారు చెప్పినట్లే మూడు కథలు మంచివి ఎన్నుకొని వాటిలో రెండింటిని రెండు పత్రికలకు పంపి మూడో కథని ఓ సాహిత్య పోటీకి పంపగా దానికి ప్రథమ బహుమతి వచ్చింది. అలా తనకు ప్రథమ బహుమతి రావడం తో ఇక నరేష్ రచనలు వివిధ పత్రికలకు పంపుతూ ఎంతో కీర్తి పొందాడు. ఆ ఊరిలోనే రాకేష్ అనే పోస్ట్ ఆఫీస్లో పని చేసే వ్యక్తి ఉండేవాడు. ఒకరోజు రాకేష్ నరేష్ కథని ఓ సాహిత్య పత్రికల్లో చూశాడు. ఆ కథ చాలా బాగా నచ్చింది అతనికి.
      ఆ కథ చదవగానే అతని మనసులో ఒక దుర్బుద్ధి పుట్టింది. అదేంటంటే నరేష్ కథలు పంపించేటప్పుడు స్టాంప్ లెటర్ మీద వేసి తరువాత అతను వెళ్ళగానే దానిని చదివి తన పేరుతో పంపిస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాడు. ఒకరోజు నరేష్ తన కథల కవర్ను రాకేష్ కి ఇచ్చాడు పోస్ట్ చేయడానికి. రాకేష్ ముద్ర వేసినట్టే వేసి నరేష్ వెళ్ళగానే దాన్ని తన బ్యాగ్ లో వేసుకున్నాడు. ఇంటికి వెళ్లి ఆ కథల కవర్ ని చింపి కథలు చదివాడు. ఆ కథలు చాలా బాగున్నాయి. సమాజ హితాన్ని కోరుతున్నాయి ఆ కథలు. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా ఒక పోస్ట్ కవర్ తీసుకొని ఆ కథలన్నీ ఆ కవర్లో పెట్టి తన పేరుతో వేరే పత్రిక కి పంపించాడు. అవి ప్రచురించడమే కాక పత్రిక వారు రాకేష్ కి పారితోషికం కూడా ఇచ్చారు. అతనికి చాలా ఆనందం వేసింది. ఊరిలో ఆ కథలు చదివిన వారు రాకేష్ మీద అనుమానపడ్డారు. ఊరిలో అంతా అదే చర్చ సాగుతుంది. ఈ విషయం తెలియని నరేష్ తన కథల పడ్డాయని రోజు పేపర్లో చూసే వాడు. తన కథలు పడలేదని గమనించి పత్రిక వారిని సంప్రదించగా తమ పత్రికకి ఎటువంటి కథలు ఏమిరాలేదని వాళ్ళు చెప్పారు.తన మిత్రుడు శశి నరేష్ దగ్గరికి వచ్చి రాకేష్ పత్రికలో రాసిన కథలు చూపించాడు. అవి తన కథలే అని నిశ్చయించుకున్న నరేష్ రాకేష్ తనను మోసం చేశాడని గమనించాడు.రాకేష్ కి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు రాత్రి కొన్ని చెడు విషయాల పై కథలు ఆర్టికల్స్ రాసి మరుసటి రోజు రాకేష్కిచ్చి "రాకేష్ అన్నయ్యా! ఇవి చాలా జాగ్రత్త. ఇందులో చాలా మంచి కథలు ఉన్నాయి. నా కథలన్నీ జాగ్రత్తగా పంపించు" అని చెప్పాడు. నరేష్ కి తను చేసిన మోసం ఇంకా తెలియదులే అని అనుకున్నాడు రాకేష్. నరేష్ ఇంకా ఎలాంటి మంచి కథలు రాశాడో అని వాటిని చదవకుండానే ఒక కవర్లో పెట్టి తన పేరుతో పోస్ట్ చేశాడు. ఒక వారం తర్వాత రాకేశ్ ఇల్లు ఎక్కడ అని అందర్నీ విచారిస్తూ రాకేష్ ఇంటికి చేరుకున్నాడు ఓ జర్నలిస్టు.అందరూ రాకేష్ ఏ మంచి కథలు రాశాడో అని ఇంటిముందు గుంపు గూడారు. వచ్చిన వ్యక్తి రాకేష్ ని "ఏమిటయ్యా ఈ కథలు, ఆర్టికల్సు. వీడటిని చూస్తే ఎవరైనా జీవిస్తారా? అసలు నువ్వు మనిషివేనా? ఎట్లాంటి రచనలు చేసావో తెలుసా నీకు.?"అని తిట్టసాగాడు"అసలు సంగతి ఏంటండి?" అనే గుంపులో ఒకరు అడిగారు. "అతను రాసింది దొంగతనం ఎలా చేయాలి?, మనిషిని ఎలా చంపాలి? దేశాన్ని చెడు వైపు మార్చడం ఎలా? అనే విషయాలపై కథలు ఆర్టికల్స్ రాశాడు"అని చెప్పాడు ఆ వ్యక్తి. ఆ జర్నలిస్టు మాటలు విన్నాక అయోమయంగా ఉన్న రాకేష్ కి అప్పుడు అర్థమైంది."ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అని .ఒకరి టాలెంట్ ని మనది గా చేసుకొని మోసం చేస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటుందో"నని. అందరూ తననే తిడుతూ ఉంటే తలెత్తుకో లేకపోయాడు రాకేష్. ఇక ఎవరిని మోసం చేయకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఏదేమైనా నరేష్ తనకు తగిన శాస్తి చేశాడని అనుకున్నాడు. ఇక ఎప్పుడూ నరేష్ కథల్ని దొంగలించ లేదు. నరేష్ కథల్ని దగ్గరుండి పంపించాడు రాకేష్. ఇక ఎలాంటి అడ్డు గోడలు లేకపోవడంతో నరేష్ గొప్ప రచయితగా పేరు గాంచి ఎన్నో మహత్తర మైన రచనలు ప్రపంచానికి అందించి ఎన్నో బహుమతులు పొందాడు.
May 2, 2020 • T. VEDANTA SURY • Story

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...