28, ఏప్రిల్ 2020, మంగళవారం

మొలక న్యూస్ లో వచ్చిన నా 22వ బాలల కథ: గొప్పలు చెప్పకు.

గొప్పలు చెప్పకు (బాలల కథ)
 రచన: లిఖిత్ కుమార్ గోదా--



"అన్నయ్యా ఎనిమిది అవుతుంది కదా ! నేను అంట్లు తోముతాను. నువ్వు నా ముందు మంచం వాల్చుకుని కూర్చుని ఏదో ముచ్చట్లు చెప్పవా.అమ్మ వాళ్లు పక్కూరు వెళ్లారు కదా త్వరగా పని ముగించుకొని స్నానం చేసి అన్నం తిని నిద్రపోదాం" అని అంట్లు తోమసాగాడు శ్రవణ్.
          ఆర్య మంచం వేసుకుని కూర్చుంటూ "ఛా! నువ్వు ఎంత తిరిగి వాడివేం. నన్ను చూడు ఎంత ధైర్యం గా ఉంటానో. ఇంత పిరికి వాడివి, దద్దమ్మ అయితే ఎలా బాగుపడతావ్. ఛీ!నిన్ను నా తమ్ముడు అని చెప్పుకోవడానికి నాకు ఎంతో సిగ్గుగా ఉంది" అని చిరాగ్గా అన్నాడు.
          "నువ్వు ఏమైనా అనుకో అన్నయ్యా. నాకు మాత్రం భయమేస్తుంది" అన్నాడు శ్రవణ్.
          "ఎందుకు భయం. దెయ్యాల ఏమైనా వస్తాయనా?"అని అడిగాడు ఆర్య .
       "దెయ్యాలు కాదు పిశాచాలు కాదు. ఈ రాత్రి సమయాన ఏమైనా పాములు తేళ్లు వచ్చి కరిస్తే చనిపోతాం కదా. అదే నా భయం"అన్నాడు శ్రవణ్.
             "తమ్ముడూ.పాములు, తేళ్లు ఏం చేస్తే మనల్ని. దమ్ముంటే ఏ పామునైనా తేలునైనా నా ముందుకు రమ్మను. పాము అయితే నా ఒంటిచేత్తో నలిపి నలిపి చంపేస్తా. తేలు నైతే కాలు కింద పెట్టి వాటి ఆనవాళ్లు కూడా లేకుండా చేస్తా"అన్నాడు ఆర్య ఎచ్చుపోతూ.
    ఇంతలో స్టోర్ రూమ్ నుండి ఎలుకల శబ్దం వస్తుంది‌‌. దాన్ని విని శ్రవణ్"అన్నయ్యా! స్టోర్ రూమ్ లోకి పాము ఏమైనా వచ్చి ఉంటుంది అందుకే చూడు ఎలుకలు ఎలా అరుస్తున్నాయొ" అన్నాడు భయంతో కాస్త.
        "తమ్ముడు! నేను ఇప్పుడే చెప్పాను కదా. పాము వస్తే ఒంటిచేత్తో చంపేస్తానని. అదంతా నీ అపోహ. పాము లేదు ఏమీ లేదు. ఎలుకలు అటు ఇటు తిరుగుతున్నాయి అంతే"అన్నాడు మరింత గర్వంగా.
         అదే తరుణంలో ఒక భారీ ఆకారం గల పాము అనూహ్యంగా స్టోర్ రూమ్ డోర్ నుండి పాక్కుంటూ వస్తుంది. దాన్ని గమనించిన శ్రావణ్"అన్నయ్యా పా.. పా.. పాము."అరిచాడు గట్టిగా. 
      వీడు నన్ను ఆట పట్టిస్తున్నాడు అనుకోని మంచం మీదనే కూర్చున్నాడు ఆర్య.శ్రవణ్ మళ్లీ గట్టిగా "పాము అన్నయ్య పారిపో" అన్నాడు. వెనుక ఏదో శబ్దం రావడంతో వెనక్కి తిరిగి చూశాడు ఆర్య. అంతే గుండెలు గుబేలుమన్నాయి.ఒక్క సారిగా ఒక భారీ సర్పాన్ని చూసేసరికి అతనికి నోట మాట రాలేదు. ఒక్కసారిగా అతనిలోని భయంతో "అమ్మో"అని అరిచి ఒక్క దూకులో వాకిలికి చేరుకున్నాడు. బయటనుండి చచ్చేంత భయంతో పామును చూడసాగాడు. శ్రవణ్ వెళ్లి దగ్గరలో ఉన్న గదిలో ఓ కర్ర తీసుకుని దాక్కున్నాడు. ఆ పాము వస్తే ఎలాగైనా ఆ కర్రతో కొట్టాలి అని.పాము పాక్కుంటూ ఇంటి ముందర ఉన్న పూలమొక్కలు దగ్గరికి వెళ్ళింది. అవి మొత్త దగ్గరే ఉన్నాయి. ఆర్య ఆ పాముని గమనించసాగాడు. మొత్త చాలా దగ్గరగా ఉంది అతనికి. ఆ పాము తన తల బయట పెట్టింది. అప్పుడు తన తల కళ్ళు బంగారంలా మెరిసిపోయింది. పాము తలని చూసి హడలిపోయిన ఆర్య గట్టిగా అరిచి వాకిలి నుండి రోడ్డుకేసి పరుగులు తీశాడు. పాము ఆర్య అరుపుకి ఉలిక్కిపడి ఇంటి పక్కనే ఉన్న పొదల్లోకి తొందరగా జారుకుంది. భయంతో ఇంట్లోకి వస్తున్న అన్న ను చూసి "అన్నయ్య త్వరగా రా" అని పిలిచాడు శ్రవణ్. ఇంట్లోకి రాగానే శ్రవణ్ చేతిలోని కర్రని చూశాడు. "ఇప్పటిదాకా నేను గొప్పలు చెప్పుకున్నాను. కానీ నిజంగా పాము వస్తే మాత్రం పరుగులు పెట్టాను. కొంచెం ధైర్యంగానైనా చిన్న కర్ర కూడా పెట్టుకోలేదు. నా తమ్ముడు ఇందాకటిదాకా అధైర్యవంతుడు అనుకున్నాను. కానీ తమ్ముడు మాత్రం ధైర్యం తెచ్చుకొని కనీసం ఒక కర్రనైన పట్టుకున్నాడు ఒకవేళ పాము వస్తే కొట్టడానికి.పాము వస్తే ఒంటిచేత్తో చంపేస్తానన్న నేనే నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అర్థం అవుతుంది ఎవరు ధైర్యవంతులు ఎవరు పిరికివారు. గొప్పలకు పోయి ఇప్పుడు నా తమ్ముడి దగ్గర నవ్వుల పాలు కావాల్సి వచ్చింది. గొప్పలు చెప్పుకుంటే తిప్పలు తప్పవు. ఇంకెప్పుడు గొప్పలు పోకూడదు"అని మనసులో అనుకున్నాడు ఆర్య.: 
రచన: లిఖిత్ కుమార్ గోదా
April 28, 2020 • T. VEDANTA SURY • Story

25, ఏప్రిల్ 2020, శనివారం

మొలక ఆన్ లైన్ మేగజైన్ లో ప్రచురించిన నా మొదటి స్వేచ్ఛానువాదం కథ "కట్టెలు కొట్టుకునే వాడు గొప్ప వాడు అయ్యాడు"

కట్టెలు కొట్టుకునే వాడు గొప్ప వాడు అయ్యాడు 
(అనువాద కథ)
 స్వేచ్ఛానువాదం: లిఖిత్ కుమార్ గోదా 
------------------------------------- 
ఒకసారి ఓ గొప్ప విద్యావేత్త, గ్రీస్ దేశ నివాసి, ఒక సంతలో నడుస్తున్నాడు. ఆయన గొప్ప చదువులు చదివిన వాడు మరియు గొప్ప విద్యావేత్త, తత్వవేత్త. ఆయన కేవలం ఒక గ్రీకు దేశంలోనే కాదు ప్రపంచ ప్రసిద్ధుడు. ఆయన పేరే డెమోక్రిటస్. ఆ రోజుల్లో, నేటికి వ్యతిరేకంగా కేవలం కొద్ది మంది ప్రజలు విద్యావంతులు. ఆ రోజుల్లో చదువుకున్న వారు ఎంతో గొప్పగా, విలాసవంతంగా జీవించేవారు.సాధారణ ప్రజలు నిరక్షరాస్యులు, విద్యావంతులను ఎంతో గొప్పగా గౌరవించే వారు, ఆదరించేవారు. అలాంటి గౌరవించదగ్గ విద్యావంతులలో డెమోక్రిటస్ ఒకరు. ఆ అంగడి దాటుతుంటే ఆయన కొంత దూరం నుండి వస్తున్న ఒక బాలుణ్ణి చూశాడు. ఆ బాలుని తల మీద ఓ కట్టెలమోపు మరియు అతని భుజాల మీద గొడ్డలి ఉన్నాయి. డెమోక్రిటస్ ఆ బాలుడు అతని వద్దకు వచ్చే దాకా వేచి ఉన్నాడు. ఆయన కట్టెలమోపు తలమీద పెట్టుకొని మోస్తూ నడుస్తున్న ఆ బాలుని చూసి ఆశ్చర్య చకితుడయ్యాడు. ఆ బాలుడు ఆయన వద్దకు రాగానే "బాబు! ఈ కట్టెలమోపు తో నువ్వు ఎక్కడికి వెళుతున్నావు?" అని ప్రశ్నించాడు. వెంటనే ఆ బాలుడు "నేను అంగడికి వెళ్తున్నాను అండి"అని బదులిచ్చాడు వినయంగా. "ఈ కట్టెలమోపు చాలా బాగా, చక్కగా కట్టి ఉంది దీన్ని మీ అమ్మ కట్టి పంపిందా?" అని అడిగాడు. దానికి ఆ బాలుడు దుఃఖస్వరంతో "నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. నేను దీన్ని స్వయంగా కట్టుకున్నాను."అని బదులిచ్చాడు. డెమోక్రిటస్ కాస్త బాధ పడిన తరువాత ఆశ్చర్యచకితుడయ్యాడు. ఎందుకంటే అంత చిన్న బాలుడు ఎంతో చక్కని పద్ధతిలో ఆ కట్టెల మోపును కట్టడం ఆయన నమ్మలేకపోయాడు"నీకు నీ తల్లిదండ్రులు లేరు అన్నావు. మరి నిన్ను ఎవరు పోషిస్తున్నారు" అని అడిగాడు. ఆ బాలుడు తన గొడ్డలి వైపు చూపుతూ "ఇదే నా తోటి మిత్రుడు మరియు ఇదే నన్ను పోషిస్తుంది.నేను అడవిలోనే కట్టలు ఈ గొడ్డలి సహాయంతో కొట్టుకుని అంగడి లో అన్ని డబ్బు సంపాదిస్తాను. ఆ డబ్బుతో నా కడుపుకి సరిపడా ఆహారం లభిస్తుంది" అని బదులిచ్చాడు. ఈ మాటలు విని డెమోక్రిటస్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆ బాలుని మీద జాలి పడుతూ "ఇంకేం పనులు నువ్వు చేస్తావు?"అని అడిగాడు. కట్టెలమోపు నేలపై పెడుతూ ఆ బాలుడు ఎంతో ఉత్తేజపరితంగా ఇలా అన్నాడు"నేను చదువుకుంటాను కూడా. నేను గొప్పగా నిజాయితీగా విద్యను అభ్యసించి ఏదో ఒకరోజు డెమోక్రిటస్ గార్లలా విద్యావంతుడుని అవుతాను. అప్పుడు అందరు నన్ను ప్రేమిస్తారు, ఆదరిస్తారు" కూడా అని బదులిచ్చాడు. డెమోక్రిటస్ ఆ బాలుడికి చదువుపై ఉన్న ప్రేమకు ముగ్ధుడయ్యాడు."సరే ఈ కట్టెలమోపు నువ్వే కట్టాను అంటున్నావు.నాకోసం ఓసారి ఈ మోపుని విప్పి మళ్ళీ కట్టగలుగుతావా? నేను కూడా నమ్ముతాను ఒకవేళ నువ్వు చెప్పేది నిజమో అబద్దమో."అన్నాడు ఆ బాలుడు డెమోక్రిటస్మాటలకు ఒప్పుకుంటూ ఆ మోపును విప్పి మళ్ళీ ఆ కట్టెలను ఒక క్రమపద్ధతిలో ఉంచి కట్టాడు.డెమోక్రిటస్ ఎంతో ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఆ బాలుడు క్రిందటి సారి కట్టినదాని కంటే ఈసారి ఎంతో బాగుంది దానిపైన. "ఈ బాలుడు ఎంతో గొప్ప మేధాశక్తిని కలిగి ఉన్నాడు. ఇతడికి ఒక్క అవకాశం ఇస్తే జీవితంలో ఉన్నతుడు కాగలడు."అని ఆలోచించి ఆ బాలుణ్ణి తన వెంట తీసుకొని వెళ్లి అతనికి తిండికి కావాల్సిన సదుపాయాలు మరియు చదువుకు సంబంధించిన సదుపాయాలు చూసుకున్నాడు. ఆ రోజు నుండి ఆ బాలుడు ఎన్నడు ఆలోచించలేదు అడవి నుండి కట్టెలు కొట్టి డబ్బులు సంపాదించాలని. ఆ బాలుడు అతని చదువు పై పూర్తి దృష్టి సారించాడు. ఆ కట్టెలు కొట్టుకునే బాలుడు నిజాయితీగా చదువుకొని ఈ ప్రపంచంలోనే గొప్ప విద్యావేత్త, గణిత శాస్త్రవేత్త అయ్యాడు. ఆయన "ఫాదర్ ఆఫ్ జియోమెట్రి" గా ప్రసిద్ధుడు. ఆయన ఎవరో కాదు పైతాగరస్. "పైథాగరస్ థెరోం" వంటి అమూల్యమైన సంపదను ప్రపంచానికి అందించాడు.
April 25, 2020 • T. VEDANTA SURY • Story

23, ఏప్రిల్ 2020, గురువారం

నా తొలి కవిత ప్రచురణ గణేష్ దినపత్రికలో...


నేటి గణేశ్ దిన పత్రిక లో వచ్చిన నా తొలి కవిత ప్రచురణ "చువ్వింగం కి బాత్". చదవగలరు. పత్రిక సంపాదకులు శ్రీ కొత్తూరు సత్యం గారికి ధన్యవాదాలు.
__________________________
చువ్వింగ్ కి బాత్..

నా పేరు ఆర్బిట్,
చేస్తాను మీ నోటిలోని క్రిముల్ని ఫటాఫట్,
నన్ను నమిలితే చాలు,
మీరు పళ్లు తోమినట్లే,
నేను మీ నోటిలోన ఉంటే
నోటి దుర్వాసన మీ చెంత లేనట్లే,
నా వల్ల నన్ను నమలడం వల్ల
అవుతుంది మీ పంటికి మంచి ఎక్సర్సైజ్
అవుతాయి మీ నోటిలోని క్రిములు ఎక్సపైర్..
నన్ను చీవింగ్ చేస్తూ ఉంటే
మీ డైజషన్ త్వరగా అయినట్లే,
నా నుండి మీరు గ్రహించే సందేశం
"మంచివారు సమాజంలో ని
చెడును పాలద్రోలడానికి
అస్సలు వెనుకాడరు.
సమాజంకై, దాని అభివృద్ధి కై
తాము పంటిక్రిందపడి నలుగుతూనే ఉంటారు.
తాము నలిగైనా సమాజాన్ని
మారుస్తారు మెరుగుపరుస్తారు...

రచన:లిఖిత్ కుమార్ గోదా
-------------------------------




||క్వారంటైన్ రైటింగ్స్ -1 | {తరణం దినపత్రిక లో ప్రచురించిన కవిత}|

||క్వారెంటైన్ రైటింగ్స్ -1||
||కవిత-1||
రచన:లిఖిత్ కుమార్ గోదా.
https://drive.google.com/file/d/1Aia0ADtuZad4vdt935pHvOr2T-IF1pOv/view?usp=drivesdk


ప్రచురించిన 57వ రచన. తరణం దినపత్రికలో 3వ కవితా ప్రచురణ ‌🌀🌀🌀🌸🌸🌺🌺🌺🌺
 

📙📘📙📙పుస్తకం...📙📙📘📙
[తరణం దినపత్రికలో ప్రచురితమైన కవిత (30/06/2020)]

పుస్తకం,
మనిషి నుండి మనీషిలా
రుషి నుండి మహర్షి లా మర్చే
ఓ టానిక్..

పుస్తకం,
వ్యక్తి నుండి వ్యవస్థ దాకా
అమ్మ నుండి అనంత విశ్వం దాకా
తెలుసుకునేలా చేసే
ఓ దృశ్యసూచిని..

పుస్తకం,
అడుగంటిన ఆత్మావేదనను
ఎదలో దాగిన మురికిని తొలిగించే
ఓ డిటర్జెంట్..

పుస్తకం,
దయనీయంగా సాగే బ్రతుకులను
కంటికి కనబడని సమాజ నడకని
క్షుణ్ణంగా చూపించే
ఓ మైక్రో స్కోప్.

పుస్తకం,
మనిషి మస్తిష్కంలో పాతుకుపోయి
నిరంతరం ఎదుగుతూ ఉండే
ఓ మొక్క..

పుస్తకం,
ప్రతి మనిషీ దాచుకునే
జ్ఞాపకాల కోట
ప్రతి మనిషినీ దోచుకునే
సిరిసుమాల తోట..

పుస్తకం,
వెనుక తరాల గురించి వెల్లడించింది
ముందు తరాల గురించి ముచ్చటించింది
మనల్ని పయనించేలా చెసే
ఓ టైం మెషీన్..

పుస్తకం,
సంబరంలోనైనా బాధల్లో నయినా మనతో తోడుండే
ఓ నేస్తం..

||23/04/2020||
క్రింది లింక్లో కవితని చదవొచ్చు 👇👇👇👇👇
https://tharanam.net/పుస్తకం-రచనలిఖిత్-కుమార/



మొలక ఆన్లైన్ మాగజైన్(23/04/2020) లో వచ్చిన నా 21వ బాలల కథ:చెడ్డవారితో స్నేహం ప్రమాదం

చెడ్డవారితో స్నేహం ప్రమాదం (కథ )
రచన: లిఖిత్ కుమార్ గోదా 
                హమీద్ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ప్రశాంతంగా ఉండే వాడు. క్రమశిక్షణ బాగా అలవర్చుకున్నాడు. మంచి చెడు తెలిసినవాడు. చాలా జ్ఞానం ఉన్న వాడు.వాళ్ల తల్లిదండ్రులు కూడా ఎంతో వినయంగా ఏ లోటూ లేకుండా పెంచారు. ఒకరోజు హమీద్ క్రికెట్ ఆడడానికి గ్రౌండ్ కి వెళ్ళాడు. అక్కడ ఒక క్యాచ్ పట్టలేదని హమీద్ టీం కెప్టెన్ గఫూర్ అతనిని తిట్టాడు. హమీద్ తప్పు తనదేనని ఆగిపోయాడు. మరోసారి బ్యాటింగ్కు దిగినప్పుడు నాన్ స్ట్రైకింగ్ లో ఉన్నది గఫూర్. స్ట్రైకింగ్ లో ఉన్న హమీద్ డిఫెన్స్ పెట్టాడు. గఫూర్ బాల్ నీ దగ్గరే ఉంచుకుని ముందుకు వచ్చి రనౌట్ అయ్యాడు.



"నేను రన్కి వస్తే రన్కి రావాలని తెలియదా" అని దుర్భాషలాడుతూ కొట్టాడు హమీద్ ని అమీర్ కి కోపం వచ్చినా అతను చేయి చేసుకోకుండా 'నీలాంటి చెడ్డవాడు తో ఆడటం నాది బుద్ధి తక్కువ' అని పక్కకు వెళ్ళిపోయాడు. గఫూర్ ఆవేశంతో హమీద్ వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులతో"ఆంటీ అంకుల్! మీ అబ్బాయి క్రికెట్ ఆటలో నేను రన్కి రాలేదని దుర్భాషలాడుతూ నన్ను కొట్టాడు. చూడండి దెబ్బలు ఎలా తగిలాయో.రక్తం ఎలా వస్తుందో.?"అని హమీద్ పై చాడీలు చెప్పాడు. హమీద్ ఇంతలో ఇంటికి రానే వచ్చాడు. గఫూర్ వాళ్ళ ఇంట్లో ఉండడం చూసాడు. హమీద్ ఇంట్లోకి రావడం చూస్తూనే అతని తండ్రి "ఏంటి హమీద్ గఫూర్ ని దుర్భాషలాడి కొట్టావట. ఎనిమిదవ తరగతి చదువుతున్నాను లే అనే గర్వమా. పెద్ద మొనగాడివి అనుకుంటున్నావా?ఈ వయసులో నీకు ఎంత పొగరు ఎందుకు? అని బెల్ట్ తీసుకొని వాతలు పడేలా కొట్టాడు. హమీద్ "డాడీ నేను ఈ పని చేయలేదు డాడీ నన్ను నమ్ము డాడీ"అని బతిమాలుతున్నాడు. అయినా వాళ్ళ నాన్న కొట్టడం ఆపలేదు. గఫూర్ కి అవి ప్రోత్సాహం కలిగి ఇంటికి వెళ్ళిపోయాడు. హమీద్ రోదిస్తూనే ఇంట్లోకి వెళ్లిపోయాడు. కొంత సమయం అయ్యాక వాళ్ళమ్మ హమీద్కి అన్నం పెట్టుకు వచ్చింది."తిను నాన్న! అన్నం తిను. అన్నం తిని చాలా సమయమైంది. తినకపోతే నీ ఆరోగ్యం చెడిపోతుంది" అని బతిమాలింది. "నే తిననమ్మా"అని గట్టిగా రోదించాడు. "ఎందుకు?"అని ప్రశ్నించింది వాళ్ళ అమ్మ. "ఎందుకంటే నేను ఈ చెడ్డ పనులు చేశాను అంటే మీరు నమ్ముతారా?నేను ఇప్పుడు దాకా ఎవరినీ కొట్టలేదు దుర్భాషలాడిన అది లేదు.చెప్పుడు మాటలు విని నాన్నగారు నన్ను కొట్టారు. అంటే నాపై మీ పెంపకం పై మీకు నమ్మకం లేదా?" అని ప్రశ్నించాడు."బేటా. అలా ఏం కాదు. నువ్వు ఈ పనులు చేసే అంటే మేం ఎవరం నమ్మం. నువ్వేంటో మాకు తెలుసు. కానీ చేయని నేరం నీపై మోపి నిన్ను నాన్న కొట్టింది కోపం తో కాదు ఆప్యాయతతో. కారణం నువ్వు స్నేహం చేసింది చెడ్డవాడైన గఫూర్తో . అతను చాడీలు చెప్పాడని మాకు తెలుసు. చూశావుగా నీపై ఎలా నేరమోపాడు. అతను చెడ్డవాడని తెలిసి నిన్ను కొట్టాడు నాన్న. నిజానికి నేను కొట్టింది నీకు తప్పు చూపాలని నీలో మార్పు రావాలని. ఇక నుండైనా చెడ్డవారితో స్నేహం చేయడం ఆపేయ్. ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు తెలుసుకో వారి వారి బిహేవియర్ ను బట్టి. సరేనా"అని చెప్పింది వాళ్ళ అమ్మ. "అమ్మా చెడ్డవారితో స్నేహం ప్రమాదం అని చెప్పి నా కళ్ళు తెరిపించారు. ఇకనుండి చెడ్డ వాళ్లతోతో స్నేహం చేయను మంచి వారితోనే చేస్తా. ఎవరు మంచి వారు ఎవరు చెడ్డ వారు తెలుసుకుంటా అప్పుడే వారితో స్నేహం చేస్తా.". అంటూ కళ్ళు తుడుచుకుని అమ్మచేతి గోరుముద్దలు తిన్నాడు.-రచన: లిఖిత్ కుమార్ గోదా
April 23, 2020 • T. VEDANTA SURY • Story


22, ఏప్రిల్ 2020, బుధవారం

మొలక ఆన్లైన్ మేగజైన్(22/04/2020) లో ప్రచురించిన నా 21వ బాలల కథ రుక్మి గొప్పలు

రుక్మి గొప్పలు
రచన :లిఖిత్ కుమార్ గోదా:-
_______________________________________
ఇది మహాభారతంలోని కథ. 
భీష్మక మహారాజు కుమారుడు రుక్మి. అతడు మహా పరాక్రమవంతుడు. శ్రీకృష్ణుడి భార్య అయిన రుక్మిణి సోదరుడు. ఇంద్రుడికి ప్రాణస్నేహితుడు.గంధమాదన పర్వతం మీద ఉన్న ధ్రువుడు అనే కింపురుషుడి అనుగ్రహం వల్ల లోకంలో శ్రేష్టమైన మూడు ధనస్సు లో ఒకటైన "విజయం" అనే దివ్య ధనుస్సును సంపాదించాడు.కురు పాండవ సంగ్రామం కురుక్షేత్రం జరగబోతుందని తెలిసి ఒక అక్షౌహిణి సేనతో పాండు కుమారుల దగ్గరికి వెళ్ళాడు భీష్మక పుత్రుడు. పాండవులు అతన్ని సాదరంగా ఆహ్వానించి గౌరవించారు. సకల సౌకర్యాలు కల్పించారు . అతిధి సత్కారాలు అందుకున్నాక రుక్మి, పాండవులు ఇతర అతిథులు వింటూ ఉండంగా పార్ధున్ని పిలిచి "అర్జునా! రాబోయే కురుక్షేత్ర సంగ్రామం గురించి దిగులు చెందుతున్నారు అనుకుంటాను. నీకు భయం వద్దు. ఎందుకంటే "విజయధరుడు" అతి పరాక్రమవంతుడైన రుక్మి నీకు అండగా ఉంటాడు. నా అండదండల వల్ల నీకు కచ్చితంగా విజయం సిద్ధిస్తుంది.నన్ను మించిన పరాక్రమవంతుడు ఈ మూడు లోకాలలో లేడు కదా. పైగా నా దగ్గర తేజోమయమైన ధనస్సు ఉంది.దానితో ద్రోణ, భీష్మ, కృపాచార్య కౌరవులను క్షణాల్లో మట్టి కరిపిస్తాను. హస్తినాపుర రాజ్యాన్ని నీ వశం చేస్తాను. సరేనా!"అని అన్నాడు గొప్పలు చెప్పుకుంటూ. అర్జునుడు చిరునవ్వు నవ్వి "భీష్మక పుత్ర, విజయ ధనస్సు ధార, రుక్మి! మాకు సహాయం చేస్తానని ముందుకు వచ్చినందుకు నీకు మా ధన్యవాదాలు. అయితే మా బావ అయిన ద్వారకాధిపతి శ్రీకృష్ణుడు మాకు ఎల్లవేళలా సాయం గా ఉంటాడు అన్న సంగతి మాత్రం మర్చిపోకు. ఆ పరమాత్ముడి సాయం మా చెంత ఉంటే మాకు ఇంకెవరి అండదండలు అవసరం లేదు. పైగా నా చేతిలో గాండీవం ఉంది రుక్మి.సాక్షాత్తూ స్వర్గాధిపతియైన దేవేంద్రుని వజ్రాయుధం ధరించి వచ్చిన కూడా నేను భయపడను."అని బదులిచ్చాడు పార్ధుడు రుక్మితో. ఈ మాటలు విన్న రుక్మికి కోపం కట్టలు తెంచుకుంది.ఆ వెంటనే పాండవులు వద్ద కోపంగానే సెలవు తీసుకుని సుయోధనుడి దగ్గరికి వెళ్ళాడు."దుర్యోధనా!రాబోయే కురు పాండవ యుద్ధం లో నేను మీ పక్షాన ఉండి యుద్ధం చేస్తాను. నేను అతి పరాక్రమవంతుడును, విజయదారుడను, ఖచ్చితంగా మీ విషయానికి తోడు పడతాను. మనవిరువురం చేయి చేయి కలిపి పాండవుల పొగరును అణుద్దాం. నా చాపంతో వాళ్ళందర్నీ యమపురికి చేరుస్తాను. నా ప్రతాపం చూపిస్తాను"అని పలికాడు. అయితే సుయోధనుడు కూడా అభిమానం కలవాడు. అతడు కూడా "రుక్మి! నీ సహాయం నాకు అక్కర్లేదు" అని సున్నితంగా పలికాడు. రుక్మి సిగ్గుపడ్డాడు.దుర్యోధనుడు కూడా తిరస్కరించే వచ్చిన దారిని తన నగరానికి తిరిగి వెళ్ళాడు. కనుక నాతోటి మిత్రులారా! రుక్మి కథ వలన మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం సరికాదు. తన శక్తియుక్తుల్ని అధికంగా ఊహించుకోవడం, ఎదుటివారి తెలివితేటల్ని, శక్తిని తక్కువగా అంచనా వేయడం ఎవరికీ మంచిది కాదు. అది మనల్ని నలుగురిలో నవ్వుల పాలు చేస్తుంది. రుక్మిణికి తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడం అలవాటు మొదటి నుంచీ ఉంది. అందుకే చాలా సార్లు పరాభవాలు పొందాడు. రచన: లిఖిత్ కుమార్ గోదా(చిన్ని), ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా.
April 22, 2020 • T. VEDANTA SURY • Story

మొలక ఆన్లైన్ మ్యాగజైన్(21/04/2020) ప్రచురించిన 20వ కథ మంచి పని


మంచి పని (బాలల కథ)
రచన:లిఖిత్ కుమార్ గోదా


           _______________________

       "ఈ ఎండలు ఏంట్రా బాబు ఎన్ని ఐస్ క్రీములు తిన్నా , ఫ్రిజ్ లోంచి గడ్డకట్టిన మంచినీళ్లు తాగిన , ఏసీ రూముల్లో కూర్చున్న తగ్గట్లేదు. వాటికి తోడి చెమట"చిరాగ్గా అన్నాడు గుణశేఖర్.
        "ఇదంతా మనం చేసుకున్న పుణ్యమే మరి . చెట్లు నరకడం తప్ప మొక్కలు నాటడం లేదు. అంతేకాకుండా నేలని, నీరుని ,గాలిని ,ఏ ఒక్క దానిని వదలకుండా పర్యావరణాన్ని మొత్తం కలుషితం చేశాం. దానికి తగ్గట్టుగానే పరిణామాలను అనుభవిస్తున్నాం."అన్నాడు సంతోష్.
     "ఈ ఎండ తీవ్రత ని వయసులో ఉన్న మనమే తట్టుకోలేకపోతున్నాను . పాపం మరి ఆ వృద్ధుల పరిస్థితి ఏమిటి "విసనకర్రతో గాలిని విసురుకుంటూ చెమటను తుడుచుకుంటూ పూరిగుడిసెలో అవస్థలు పడుతున్న ముసలి వాళ్లను చూపిస్తూ మిత్రులందరితో అన్నాడు లిఖిత్.
    "పాపం వాళ్ళని చూస్తే జాలేస్తుంది "అన్నాడు శ్రీకాంత్.
     "ఈ సమస్యకు ఏదైనా ఉపాయం కనిపెట్టాలి" అన్నాడు నితిన్.
    ఫ్రెండ్స్ మాటలు అన్నీ వింటున్న నవీన్ కొంచెం సేపు ఆలోచించి"ఫ్రెండ్స్! మనందరి ఇళ్లల్లో అనర్థం గా పడి ఉన్న ప్లాస్టిక్ బాటిల్ లు ఉన్నాయి కదా"అన్నాడు.

నవీన్ సామాజిక మాధ్యమాలని బాగా అనుసరిస్తాడు.

"ఆ అవును ఉండే ఉంటాయి. అయినా ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్ గోల ఎందుకు "అని అడిగాడు అఖిల్.
"చెప్తా. మొన్నీమధ్య యూట్యూబ్లో ఒక వీడియో చూసా. అలాగే పత్రికల్లో చదివాను. కొన్ని దేశాలలో ప్లాస్టిక్ బాటిల్ లు కార్డు బోర్డు లేదా అట్టపెట్టెఉపయోగించి మిని కూలర్ ని తయారు చేసుకుంటున్నారు. మనము ఒక సారి ప్రయత్నిద్దాం ఈ పని. మనం అందరం కలిసి మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ బాటిల్ లు అలాగే మనం దాచుకున్న డబ్బుతో షాపుల్లో కార్డు బోర్డుల కొనుక్కొచ్చి మనం కూడా ప్లాస్టిక్ అనే వ్యర్థంతో అర్ధాన్ని సృష్టిద్దాం. మన ఊరి యొక్క పేద జనాల నవ్వులను చూద్దాం"బదులిచ్చాడు నవీన్.
"ఆ సరే రా ఇప్పుడు ఆ పని పూర్తి చేద్దాం" అన్నాడు నితిన్.
మిత్రులు అందరూ కలిసి తమ తమ ఇళ్లల్లో ఉన్న ప్లాస్టిక్ బాటిల్ లు అలాగే తాము పోగు చేసుకున్న డబ్బు తో కార్డు బోర్డులు కొచ్చారు.

  ముందుగా నవీన్ కార్డు బోర్డు కి వరుస క్రమంలో దూరం దూరంగా బొక్కలు చేసి తరువాత వాటి లను సగం వరకు కోసి మూతలు తీసి ఆ బాటిళ్లను కార్డుబోర్డు కి అమర్చాడు. మిత్రులందరూ కూడా నవీన్ చేసినట్టే చేశారు.

"బాబాయ్! మొత్తానికి అయితే ఈ ప్లాస్టిక్ బాటిలు అట్టముక్కల తో ఈ వస్తువులు చేశాం. కానీ ఇది ఎలా పనిచేస్తుంది"అడిగాడు సాయి ప్రదీప్.
    "చెప్తాను ఒకసారి మీ నోరు తెరిచి మీ అరచేయి కొంచెం దూరం నుంచి ' హా' అని ఊదండి."అని చెప్పాడు నవీన్.
మిత్రులందరూ నవీన్ చెప్పినట్టే చేశారు.

"మీ అరచేతికి వేడిగాలి ఏమైనా తగిలిందా"అడిగాడు నవీన్ మిత్రులని.

"ఆ తగిలింది "బదులిచ్చాడు లిఖిత్.
    "ఇప్పుడు మీరు మీ మూతిని సున్నా (0 )ఆకారంలో ఉంచి అరచేయిని అప్పట్లోనే ఇందాక పెట్టిన దూరంలోనే ఉంచి ఊదండి."

ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు చేసిన చర్య లో తమ అరచేతికి చల్లటిగాలి తగిలినట్టు అనిపించింది. అది నవీన్ తో చెప్పారు.

   "అయితే ఏంటి నవీన్ ?"అని అడిగాడు మహేష్.
     "పరిణామం పెరిగే కొద్దీ వేడిగాలి తగ్గుతుంది. చల్లగాలి పెరుగుతుంది. ఈ బాటిళ్ల మిని కూలర్ ని మన ఇంటి కిటికీలకు అమర్చుకున్నామనుకో బయట నుంచి వచ్చే వేడి గాలి ఈ బాటిల్ లో నుంచి ప్రయాణించి చల్ల గాలిని ఇస్తుంది. ఇలాంటి ఉపాయం వలన గాలి లో ఉష్ణోగ్రత 5 డిగ్రీలు నుండి 15 డిగ్రీలు తగ్గుతుంది. విద్యుత్ ఆదా అవుతుంది ఉపయోగపడుతుంది."అని చక్కగా వివరించాడు నవీన్. ఫ్రెండ్స్ అందరికీ ఆ ఐడియా బాగా నచ్చింది. ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్లి గ్రామ ప్రజలకు ఈ విషయం తెలపగా అందరినీ అభినందించి తర్వాత ఊరి జనం తో అందరితో అలాంటివి చేయించి వృద్ధుల ఇంట్లోనే కాక కూలర్లు లేని వారికి కూడా అందజేశారు. అందరూ మిత్రులందరినీ అభినందించారు.
________________________________
కథారచన: లిఖిత్ కుమార్ గోదా
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం.
బనిగండ్లపాడు గ్రామం, ఎరుపాలెం మండలం, ఖమ్మం జిల్లా.-507202.

17, ఏప్రిల్ 2020, శుక్రవారం

మొలక ఆన్లైన్ పత్రిక లో వచ్చిన నా 19 వ బాలల కథ :ప్రాణం నిలిపిన అబద్దం

ప్రాణం నిలిపిన అబద్దం
రచన:లిఖిత్ కుమార్ గోదా (చిన్ని)



       --------------------------------------
మొలక అనే అడవిలో ఒక పాము ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ డేగల స్థావరం కి చేరుకుంది. ఒక సారి ఆగి ఆలోచించింది తాను డేగల స్థావరానికి వచ్చానని. భయంతో అరచేతిలో ప్రాణం పెట్టుకుని పరుగులు పెడుతున్న మనిషిలా పాకుతూ వెళుతుంది. పాము తన దారిలో ఉండంగా అటుపైన ఒక డేగ తమ స్థావరం వైపు వెళ్తుంది. పాము మిక్కిలి వేగంతో పాకులాడడం చూసి డేగ కి ఆకలి తీరినట్టు గా అనిపించింది. వెంటనే మెరుపువేగంతో వెళ్తున్న ఆ పామును తన రెండు కాళ్లతో పట్టుకుని పైకి దూసుకుపోతుంది. డేగ కి చిక్కిన భయంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందింది పాము.
“ఆపదలో ఆపద్భాందవుడు ధైర్యమే” అనే మాట గుర్తొచ్చి కొంచెం ధైర్యం తెచ్చుకుని “మిత్రమా! నన్ను ఎక్కడికి తీసుకు వెళ్తున్నావ్?” అని అడిగింది.
    “ఎక్కడికి ఏమిటి! నిన్ను చంపి తినడానికి”
       నవ్వుతూ “అవునా నాకు నిన్ను చూస్తే నవ్వొస్తుంది”

      “ నవ్వా! ఎందుకు?”

 “కాకపోతే ఏంటి. నీకో విషయం తెలుసా! నేను సహజంగా సాధారణ పాముని అయినా నాకు ఒక వరం ఉంది. ఒకవేళ ఏ ప్రాణి అయినా నన్ను చంపి తింటే అప్పుడు నా మాంసం విషంగా మారి ఆ ప్రాణి చచ్చిపోతుంది . అయినా నాకు మళ్ళీ ప్రాణం వస్తుంది. ఇలా నా చేతిలో చనిపోయిన డేగలు ఎన్నో అందులోనూ ఒకటి. మరి కాస్త సమయం లో నీ ప్రాణం పోవడం చూసి నాకు నవ్వు వచ్చింది అంతే. నువ్వు వెర్రిదానివి కదా!”
“ఓసి పిచ్చి పామా! నేను కాదే వెర్రి దాన్ని నువ్వు. నువ్వు నీకు ఉన్న వరం గురించి అది తీసే పరిణామాల గురించి నాకు చెప్పకపోతే నేను నిన్ను తినేదాన్ని. నేను చనిపోయేదాన్ని. నీకు మరలా ప్రాణం వచ్చేది. నువ్వు ఆ విషయం చెప్పడం వల్ల తెలివిగా నేను నా ప్రాణాన్ని కాపాడుకో గలిగాను. హ హ హ..” అని నవ్వుకుంటూ పామునీ నేలపైకి దించి తన తెలివికి మురిసిపోతూ ఎగురుకుంటూ గాల్లోకి వెళ్ళింది. ఆపత్కాలంలో అబద్ధం చెప్పడం అంటే ఇదేనేమో. అందుకే పెద్దలు ఆపత్కాలంలో నే అబద్ధం చెప్పమని అన్నారేమో అని అనుకుంది పాము.
“ఇలాంటివి డేగ ను ఎన్నడూ చూడలేదు అనుకుని తన ప్రాణాలు కాపాడుకున్నందుకు ఆనందించింది పాము.

✍🏻✍🏻✍🏻 రచన : లిఖిత్ కుమార్ గోదా (చిన్ని)

16, ఏప్రిల్ 2020, గురువారం

నా 18వ బాలల కథ.

తిండిబోతు దెయ్యం..తెలివైన రాజు(బాలల కథ)
రచన:లిఖిత్ కుమార్ గోదా




   

         వామకుంట్ల అనే మారుమూల గ్రామం దాటితే ఒక అడవి ఉంది. ఆ అడవికి మాన్ సింగ్ అనే సింహం రాజు. జంతువుల అన్నింటిని న్యాయంగా పరిపాలిస్తూ అందరి మన్ననలు పొందాడు. అడివి నెప్పుడు సంరక్షించడంలో కీలక నిర్ణయం తీసుకునే వాడు మాన్ సింగ్.

ఒకసారి ఒక దెయ్యం తన చుట్టాలింటికి నుండి ఇంటికి అడివి మీదుగా వెళ్ళ సాగింది. అది తిండిబోతు దెయ్యం. అది ఎగురుతూ వెళ్లే సమయంలో అడవిలో అన్ని జంతువులూ కమ్మగా వంటలు వండు కుంటూ ఉన్నాయి. అది అసలే తిండిబోతు దెయ్యం కదా! అందుకే నోరూరి, నేతి గారెలు చేసుకుంటున్న నక్క ఇంట్లోకి దూరి “ఓయి నక్క బావ గుమగుమలాడే నేతి గారెలు చేసుకుంటున్నట్లున్నావు. రుచి చూస్తా ఆగు!” అని నేతిగారెలన్నీ ఒక్కసారిగా నోట్లో వేసుకుని వికారంగా నములుతూ “అబ్బా నక్క బావా! చాలా చక్కగా చేశావు ఎంతో రుచిగా ఉన్నాయి ” అని వికటంగా నవ్వుకుంటూ ఎగిరిపోయింది. నక్క తను చేసుకున్న నేతి గారెలు దెయ్యం తినడం చూసి తిండిబోతు దెయ్యం కి భయపడి రాజు మాన్ సింగ్ కి ఫిర్యాదు చేయడానికి అని బయలుదేరింది. దారిలో నక్కకి నెమలి, ఏనుగు, లేడీ కూడా కనిపించి తమ ఇంట్లోకి తిండిపోతు దెయ్యం వచ్చి తమ వంటకాలు తినేసింది అని ఈ విషయం రాజు కి ఫిర్యాదు చేయడానికి వెళుతున్నాం అని చెప్పగా తాను కూడా అదే పనిలో వెళుతున్నానని చెప్పి , అన్ని కలిసికట్టుగా రాజు మాన్ సింగ్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాయి.
    
     రాజు మాన్సింగ్ కి ఏనుగు ఇంకో విషయం చెప్పింది.

 “మహారాజ! ఆ తిండిపోతు దెయ్యం మన అడవిలోనే, మీ ఇంటికి దగ్గరలోనే ఉన్న మర్రి చెట్టు పై నివాసం ఉంటానని ప్రతిరోజు భోజనాన్ని, వంటకాల్ని తినేస్తా అని నాతో చెప్పింది” అని చెప్పింది.
మాన్సింగ్ కి ఏం చేయాలో అంతు పట్టడం లేదు. రోజురోజుకీ తిండిబోతు దెయ్యం బెడద చాలా ఎక్కువైంది. ఆ తిండిపోతు దెయ్యం వల్ల జంతువులు అన్ని చాలా ఇబ్బందులు పడుతున్నాయి. తిండిపోతు దెయ్యం ని ఎలా అడివి నుండి తరిమి కొట్టాలని ఒక పథకాన్ని ఆలోచించాడు రాజు మాన్సింగ్.
వెంటనే జంతువుల అన్నింటిని సభకు హాజరు కావాల్సిందిగా చాటింపు వేయించింది.

 జంతువులన్నీ వచ్చాక “నా ప్రియమైన వన జీవుల రా! గత కొన్ని రోజులుగా తిండిపోతు దెయ్యం సమస్య వచ్చింది. ఆ తిండిబోతు దెయ్యం వల్ల మన అడవిలోని జంతువులన్నీ బాగా ఆకలికి మాడి చాలా బాధ పడ్డాయి. ఆ దెయ్యాన్ని తరిమి కొట్టడానికి నేను ఒక ఉపాయం ఆలోచించాను. అదేంటంటే ఈరోజు అన్ని జంతువులు విపరీతమైన కారం తో వంటకాలు చేయండి. ఈ రాత్రి అందరం కలిసి అడవి పండుగ అని చెప్పి దెయ్యానికి ఈ భోజనం పెట్టి అడవి నుండి తరిమి కొట్టే ప్రయత్నం చేద్దాం” అని చెప్పింది. జంతువులన్నీ కూడా రాజాజ్ఞను సమ్మతించి మాన్ సింగ్ చెప్పినట్లుగా కారం తో వండిన వంటకాలు తయారు చేసి సాయంత్రం లోపు అన్ని జంతువులు వండుకొని రాజు మాన్ సింగ్ తో కలిసి బాణాసంచా పేలుస్తూ మర్రి చెట్టు దగ్గర కెళ్ళి
“ఓ భూత రాజా! ఒక్కసారి కిందకి రా” అని మాన్ సింగ్. 
 తిండిబోతు దెయ్యం క్రిందకి దిగి “ఏంటి సింహం బాబాయ్ సంగతి” అని అడిగింది.
“భూత రాజా! నువ్వు మా అడవికి అతిథి అనుకో. ఈరోజు మా అడివి పండుగ కాబట్టి మా వన పరివారం సంకల్పించిన ఈ విందు ను తిని మమ్మల్ని సంతృప్తిపరచగలవు. రా వచ్చి తిను” అని సాదరంగా ఆహ్వానించాడు మాన్సింగ్.
జంతువుల హడావుడి చూస్తే నమ్మబుధ్ధైంది తిండిబోతు దెయ్యానికి.

     ముందు కనులవిందుగా భోజనం ఉండటం చూసి తిండిబోతు దెయ్యం ఆనందించి “అవునా రాజా! సంతోషం” అని చెప్పి ఒక్కసారిగా భోజనాన్ని గుటుక్కు గుటుక్కున తినేసింది.
భోజనాలు వంటకాలు అంతా కారం తో చేయడంతో తిండిబోతు దెయ్యం కి కడుపులో బాగా మండి ఆ మంట భరించలేక పరుగులు పెట్టి నీటి కోసం వెతుకుతూ వెతుకుతూ అడివి నుండి వెళ్ళిపోయింది. జంతువులన్నీ రాజు మాన్సింగ్ తెలివికి అందించాయి. తిండిబోతు దెయ్యం పీడ విరగడవడంతో అన్ని సంబరపడిపోయాయి. మరెన్నడూ తిండిపోతు దెయ్యం ఆ అడవి వైపు చూడలేదు.

 కథారచన: లిఖిత్ కుమార్ గోదా
Molaka online magazine

నా 17వ బాలల కథ

స్వేచ్ఛ కోరిన రచయిత
రచన: లిఖిత్ కుమార్ గోదా

వేదాంత్ ఓ కథ రచయిత. చక్కని పిల్లల కథలు రాస్తూ అందరి మన్ననలు పొందేవాడు. తాను రాసే ప్రతి అక్షరాన్ని అనుసరించడం వేదాంత్ కి అలవాటు. ఒక కథను రాయాలనుకున్నాడంటే అది తన వ్యక్తిత్వాన్ని బట్టి తనకు ఆ గుణం, లక్షణం, మాటతీరు ఉంటేనే ఆ కథను చక్కగా అల్ల గలుగుతాడు. ఒక సారి తను రాసిన కథను బాలల కథల పోటీకి పంపగా అది ప్రధమ బహుమతిని పొందింది. బహుమాన ప్రధానోత్సవానికి హాజరయి, బహుమతి అందుకుని మిగతా రచయితలు, కవుల తో ముచ్చటించి తిరిగి కారులో పయనమయ్యాడు. కొంతమంది రచయితలు ఆయనతోపాటు ఉన్నారు. తోటి రచయితలు తమ కథల గురించి చర్చించుకుంటూ ఉన్నారు. వేదాంత్ కూడా తన కథల గురించి ముచ్చటిస్తూ ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న ఓ చిలకల వ్యాపారి నీ చూసి డ్రైవర్ తో “ డ్రైవర్ గారు కారును ఆపండి” అని అడిగాడు. డ్రైవర్ "సరే సార్" అంటూ ఆ చిలకల వ్యాపారి దగ్గర ఆపాడు. వేదాంత కారు దిగి చిలకల వ్యాపారి వద్దకు వెళ్లి “ఈ చిలకలు అమ్ముతారా!” అని అడిగాడు. “ అవునండి” బదులిచ్చాడు చిలకల వ్యాపారి. “ మొత్తం ఎన్ని చిలుకలు ఉన్నాయి?” అని అడిగాడు వేదాంత్. “ మొత్తం పన్నెండు ఉన్నాయి సార్” అన్నాడు చిలకల వ్యాపారి.



 “అన్నిటినీ కలిపి ఎంతకి ఇస్తారు” అని అడిగాడు వేదాంత్. “ అన్ని కొంటారా?” అని అడిగాడు చిలుకల వ్యాపారి. “ అవునండి బదులిచ్చాడు” వేదాంత్. “ ఒక చిలక వంద రూపాయలు అండి. మొత్తం పన్నెండు ఉన్నాయి కాబట్టి మొత్తం పన్నెండు వందలు అవుతాయి. అందులో మొత్తం అన్ని చిలుకల్ని తీసుకుంటా అన్నారు కాబట్టి రెండొందల తగ్గించి వెయ్యి రూపాయలు ఇచ్చి తీసుకోండి” అన్నాడు చిలకల వ్యాపారి. సరేనని చెప్పి పర్స్ లోంచి వెయ్యి రూపాయలు తీసి ఇచ్చి చిలకల వ్యాపారం నుండి చిలకల తీసుకుని తీసుకున్నాడు. కార్ లో ఉన్న కవి భూషణ్ “వేదాంత్! జంతు ప్రేమికుడు లా ఉన్నావ్ ఇంట్లో ఏమన్న పెంచుకుందాం అనుకుంటున్నావా?” అని ప్రశ్నించాడు “భూషణ్ అన్నా! అదేం కాదు. వీటిని వదిలేయడానికి" అని చెప్పి చిలుకలు అన్నింటిని పంజరం లోంచి బయటకు తీసి వదిలేశాడు తరువాత వచ్చి కారులో కూర్చున్నాడు వేదాంత్. “అదేంటి వేదాంత్! వెయ్యి రూపాయలు పెట్టి కొన్న చిలుకల్ని ఇంటికి తెచ్చుకోకుండా అలా వదిలేసావ్ ఏం?” అని అడిగాడు నవ్వుకుంటూ సూర్య. “ అదేం లేదండి! నేను పోయిన వారంలో మూన్ అనే పత్రికలో "స్వేచ్ఛ" అనే కథ రాశాను. అందులో 'ప్రతి జీవి స్వేచ్ఛ కోరుకుంటుంది'అన్న నీతిని రాశాను. దానికి నాకు పారితోషికం 500 వచ్చాయి. నాకు తీసుకున్న రూపాయికి, రాసిన అక్షరానికి న్యాయం చేయడం అలవాటు అందుకే ఆ చిలకలు అలా పంజరంలో ఉండడం చూసి వాటికి ఇలా స్వేచ్ఛను కల్పించాను. అయినా ఇది మంచి పనే కదా” అని వివరించాడు వేదాంత్. “అవునవును రాసిన అక్షరాన్ని ప్రచారం తప్ప ఆచరించ లేకుండా ఉన్న రచయితలు, కవులు మాలాగా చాలామంది ఉన్నారు. నువ్వు నిజంగా “ నిజమైన రచయిత ”వి రాసిన ప్రతి అక్షరాన్ని, కథని, కవితను ముందు మనము నమ్మి, ఆచరించి చెప్పాలని, మంచి చెప్పే వాడు మంచివాడు అయితేనే ఆ మాట నిలుస్తుందని, అందరూ వింటారని మాకు తెలిసొచ్చేలా మాకు ఒక రకంగా గాంధీ కథను గుర్తు చేసి మా కళ్ళు తెరిపించి మా మార్పుకు కారణం అయిన నీకు కృతజ్ఞతలు” అని అన్నాడు శేషేంద్ర. అందరూ వేదాంత్ నీ అభినందించారు. అందరూ కారులో తిరుగు ప్రయాణమయ్యారు. కథారచన: లిఖిత్ కుమార్ గోదా
April 12, 2020 • T. VEDANTA SURY • Story





11, ఏప్రిల్ 2020, శనివారం

నా 16వ బాలల కథ🦁🦁🦁 "ముందు పని..తరువాతే అందం"🦁🦁🦁 08/04/2020 మొలక ఆన్లైన్ మాగజైన్ లో ప్రచురితమైనది.

🦁🦁ముందు పని..తరువాతే అందం🦁🦁(బాలల కథ )

రచన: లిఖిత్ కుమార్ గోదా




        మొలక అనే చిట్టి అడవికి రాజు షేర్ సింగ్ అనే సింహం. అతనికి ఇద్దరు కవల మగ సింహాలు. ఒక సింహం పేరు కేశవ సింగ్ ఇంకో సింహం పేరు మాధవ్ సింగ్. షేర్ సింగ్ కి వయసు పైబడటం తో అడవికి రాజును ఎవరిని చేయాలా అని సందేహించసాగాడు. తన సందేహాన్ని మహామంత్రి టైగర్ ఖాన్ అనే పులికి విన్నవించాడు. టైగర్ ఖాన్ బాగా ఆలోచించి “మహారాజా! మీరు యువరాజుల లో ఉత్తముడి కోసం చూస్తున్నారు. రాజంటే పనికి ఎక్కువ విలువ ఇవ్వాలి. అంతేకాని అందాల కు లోబడి అడవికి చేటు చేయకూడదు. అందుకే యువరాజులు ఎవరికి పని మీద శ్రద్ధ ఎక్కువ ఉంది, ఎవరికి అందాల మీద ఎక్కువ మక్కువ ఉందో తెలుసుకోవడానికి రేపు ఒక పరీక్ష పెడదాం. అదేంటంటే ఇద్దరిని బంగారు చేపలు ఉన్న చెరువు వద్దకు వెళ్లి బంగారు కలువ పూలు తీసుకురమ్మని అండి. మార్గమధ్యలో అందమైన బొమ్మలు, నెమలి నాట్యాలు ఏర్పాటు చేయండి. ఎవరైతే అందాలను పట్టించుకోకుండా పని మీద శ్రద్ధ పెడుతూ కలువపూలు ముందుగా అడవిలోని రాజ్యసభకు తీసుకువస్తారో వారిని రాజుగా నియమించి మిగిలిన ఇంకొకరిని సైన్య అధ్యక్షుడిగా నియమించుదాం. ఇది నా మాట మహారాజా" అని చెప్పాడు.


షేర్ సింగ్ మహామంత్రి మాటలు అంగీకరిస్తూ మరుసటి రోజు అతను చెప్పినట్లు చేశాడు.

యువరాజు ఇద్దరికీ విషయం చెప్పి వారిని పోటీకి సిద్ధం కండి అని చెప్పాడు. యువరాజు లిద్దరు సంసిద్ధమయ్యారు. పోటీ ప్రారంభమైంది. కేశవ సింగ్, మాధవ్ సింగ్ ఇద్దరూ పరుగులు పెడుతున్నారు. మార్గమధ్యలో షేర్ సింగ్ ఏర్పాటు చేసిన నెమలి నాట్యం, అందమైన బొమ్మలు ఇద్దరూ చూశారు. కాకపోతే అవి కేశవ సింగ్ కళ్ళను ఆకర్షించాయి. అందమైన వర్ణాలు, నాట్యాలు కనబడిన ప్రతి చోటా తీక్షణంగా చూడసాగాడు కేశవ సింగ్.

                మాధవ్ సింగ్ ఇవేవి పట్టించుకోకుండా తన దారిలో తాను లీనమై బంగారు చేపల చెరువు దగ్గరకు వెళ్లి బంగారు కలువను తెంపుకొని ఇంకా మార్గమధ్యలోనే ఉన్న కేశవ సింగ్ ను చూసుకుంటూ రాజ సభకు చేరుకున్నాడు.

అందాలను తిలకిస్తూ వచ్చిన కేశవ్ సింగ్ చాలా ఆలస్యంగా బంగారు కలువ తెంపుకొని రాజ్య సభకు చేరుకున్నాడు.

                కేశవ సింగ్ రాజ్యసభ కు చేరుకున్న తర్వాత మంత్రి టైగర్ ఖాన్ “ మనకు కాబోయే మహారాజు మాధవ్ సింగ్ ” అని ప్రకటించాడు.తన ఆలస్యం, అందానికి లొంగిపోయే తత్వం వలన రాజ పదవిని వదులుకోవాల్సి వచ్చింది కేశవ సింగ్ కి.అందుకే సైనధ్యక్షుడిగా నియమితుడయ్యాడు కేశవ సింగ్.

అందుకే పెద్దలంటారు “ ముందు పని.. తరువాత అంద”మని.

👍 👍 డ్యూటీ ఫస్ట్... బ్యూటీ నెక్స్ట్.. 👍 👍

                              🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁

5, ఏప్రిల్ 2020, ఆదివారం

నా 15వ కథ చిట్టి చేప సమయస్ఫూర్తి బాలల కధ

నేటి మొలక న్యూస్ లో నా 15వ కథ  ''చిట్టి చేప సమయస్ఫూర్తి ''(బాలల కథ ) 


వేసవి సెలవులు కావడంతో చిన్నారి పొన్నారి బాలలంత తమ వీధిలోన ఉన్న పరంధామయ్య తాతయ్య దగ్గరికి వెళ్ళారు. పరంధామయ్య తాత విశ్రాంతి తెలుగు ఉపాధ్యాయుడు.వీధిలోని పిల్లలంతా కాలక్షేపం కోసం, ట్యూషన్ కోసం ఆయన ఇంటికి వచ్చే వాళ్ళు. పరంధామయ్య తాతయ్యకి పిల్లలు అంటే చాలా మక్కువ.పిల్లలు అంతా ఒక వానర మూకల తన ఇంటికి రావడంతో పరంధామయ్య తాత సంతోషించి అందరినీ తన ఇంటి అరుగు మీద కూర్చోమన్నాడు. తాను ఒక కుర్చీ పై ఆశీనుడయ్యాడు. ఆయన భార్య చేత అందరికీ మిఠాయిలు పంచాడు. గందరగోళంగా ఉన్న తరుణంలో మూక మధ్యలో ఉన్న మూడేళ్ల భరత్"తాత గాలు! ఒక చిట్టి కథ చెప్పలు!"అని తాను వచ్చీరాని మాటలతో ముద్దు గా అడిగాడు."అవునవును తాతగారు !ఖచ్చితంగా ఒక కథ చెప్పాల్సిందే" అంటూ పిల్లలందరూ హర్షధ్వానాలు చేశారు. పరంధామయ్యగారు చిరునవ్వు నవ్వి" సరే! పిల్లలు నిశ్శబ్దంగా వినండి నేను ఇప్పుడు మీకు చెప్పబోయే కథ పేరు "చిట్టి చేప సమయస్ఫూర్తి". అనగనగా కృష్ణాపురం ఊరు దగ్గర ఒక చెరువు ఉండేది. ఒకరోజు ఒక బెస్తవాడు చేపలు పట్టడానికి అని ఆ చెరువు లో కి వెళ్ళి వల వేసాడు. కానీ చేపలు వలలో పడలేదు. కానీ అతని మనోధైర్యం వదలకుండా చాలాసార్లు ప్రయత్నించాడు. చిట్టి చివరికి అతని వల లో ఒక చిట్టి చేపపిల్ల పడింది.ఆ చిట్టి చేపపిల్ల ఆ బెస్తవా డికి దొరికేసరికి కంటనీరు పెట్టింది. ఏడుస్తూ " నన్ను వదిలేయ్"అని వేడుకుంది. "నిన్ను వదలడం ససేమిరా కుదరదు" అన్నాడు బెస్తవాడు. బెస్తవాడు ఆ చేప పిల్లని ఒక బుట్టలో వేసుకున్నాడు. దిగులుగా ఏడుస్తున్న ఆ చిట్టి చేప పిల్లకు మెరుపులాంటి ఒక ఆలోచన తట్టింది. వెంటనే బెస్త వాడితో"ఓ బెస్త వాడ! పాపం పొద్దున్నుంచి శ్రమ పెడుతున్నట్టు ఉన్నావు. నీ పట్టుదల చూస్తే నాకు ముచ్చట వేస్తుంది . నీకు చేపలే కదా కావాల్సింది. నన్ను వదిలేస్తే నీకు పెద్ద పెద్ద చేపల్ని పట్టిస్తాను. అప్పుడు నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్లొచ్చు. నన్ను నమ్ము"అంది. బెస్తవాడికి లోన ఆశ పుట్టి "నిజంగా పట్టిస్తావా?అబద్ధం చెప్పడం లేదు కదా" అని చిట్టి చేపతో అన్నాడు." నిజంగా నన్ను నమ్ము "అంది." సరే మరి నేను నమ్మి నిన్ను చెరువులోకి వదిలేస్తున్నాను నాకు పెద్ద చేపలు పట్టించు" అని చేప పిల్లని వదిలేశాడు. "త్వరగా వాటిని పట్టించు నేను ఇంటికి పోవాలి "అన్నాడు బెస్తవాడు తుర్రుమంటున్న ఆ చిట్టి చేప పిల్లబెస్తవాడితో "అబ్బా ఇంకా ఏమన్నా పట్టించ వద్దు. నేను నీ నుండి తప్పించుకోవాలని అలా అన్నాను .నేను నీకు అబద్ధం చెప్పాను.నా ప్రాణం కాపాడుకోవడానికి. మోస పోయావు గా. అయినా నా వాళ్ళను నేనెందుకు పట్టిస్తాను" అని నవ్వుతూ తుర్రుమంది. అని కథ చెప్పడం ముగించాడు పరంధామయ్య తాతయ్య.చూశారా పిల్లలు సమయస్ఫూర్తి ఆపదలో ఎలా ఉపయోగపడుతుందో మీరు కూడా సమయస్పూర్తి కలిగి మీ జీవితంలో ఆపదల నుంచి తప్పించుకోవాలి .అలాగే అవసరమైనప్పుడే అబద్ధం ఆడాాలి. అని సలహా ఇచ్చాడు. పిల్లలందరూ హర్షధ్వానాలు చేసి ఇంటికి వెళ్లారు. 

రచన:లిఖిత్ కుమార్ గోదా
 ఇంటర్ ఫస్టియర్ MJPTBCWR కళాశాల,బోనకల్
April 5, 2020 • T. VEDANTA SURY • Story

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...