10, అక్టోబర్ 2020, శనివారం

మణిపూసల కవి భూషణకు అర్హత సాధించాను. వడిచర్ల సత్యం గారి అడిగినందుకు, అసలు రాయలేను అనుకున్న ప్రక్రియలో 💯 రాయడం చాలా చాలా ఆనందంగా ఉంది.

 *మణిపూసల కుటుంబ సభ్యులకు వినమ్ర నమస్కారాలు!*
నా పేరు *లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం* _మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్_ లో విద్యనభ్యసిస్తున్నాను.

💯💯💯💯💯

నాకు మణిపూసల కవితా ప్రక్రియ తెలుసు కానీ సంవత్సరం క్రితం మెలుకువలు తెలియదు. కానీ గురువులు శ్రీ వడిచర్ల సత్యం గారు నాకు మేలు కూడా నేర్పించి మణిపూసల రాయమన్నారు. నా వంతు ప్రయత్నం గా 40 రోజుల లో అంటే ఆగస్టు 31న మణిపూసలు రాయడం ప్రారంభించి సరిగ్గా ఇవాల్టికి వంద మణిపూసలు పూర్తి చేశాను అని తెలియజేయుటకు సంతోషిస్తున్నాను.

🌻🌻🌻🌻🌻🌻🌻


*మణిపూసలు*

మణిపూసలు నూతన కవితా ప్రక్రియ
సృష్టికర్త:- వడిచర్ల సత్యం గారు
మణిపూసల కవి :- లిఖిత్ కుమార్ గోదా

చిరునవ్వులకు రేడు
జనులందరూ వేడు
రాజశేఖరుడతడే
నిర్మూలించెను చెడు. (01)

పులివెందులలో జననం
ప్రజాసేవనే మననం
రామరాజ్యం పాలన
జనులు పొందెను పావనం. (02)

తెలుగు రాజకీయ తంత్ర
ప్రజలకై చేసెను యాత్ర
ప్రజా గోడు తీర్చుటలో
పోషించె కీలక పాత్ర!(03)

బ్రహ్మ వాక్కు అతని మాట
స్వర్గమయె నడిచిన బాట
నిండు మనసుతో ఆడెను
ప్రజల కొరకు వాదులాట!(04)

మార్మోగెనులే సదస్సు
వెలిగిపోయెను తేజస్సు
తపో దీక్షతో రేడే
తెచ్చెను తెలుగుకు ఉషస్సు!(05)


(విశ్వనాథ సత్యనారాయణ గారి జన్మదినం (సెప్టెంబర్ 10) సందర్భంగా)

నందమూరు జననం
అలరించెను కవనం
విశ్వనాథ కవిసామ్రాట్
కీర్తి పొందె గగనం.(06)

     * * * * *
జ్ఞానపీఠ్ పురస్కారం
తెలుగు జాతి మణిహారం
వివిధ ప్రక్రియల్లో
చేసెనతడు సంచారం.(07)

     * * * * 

తెలుగు భాష ప్రియుడతడు
సంస్కృతాంగ్లమున ఘనుడు
వేయిపడగలు మోహనమే
తెలుగు వారి పూజ్యుడతడు.(08)

     * * * *

కావ్యాలెన్నో రాసెను
విమర్శలెన్నో చేసెను
విశ్వనాథ మాన్యుడే
తెలుగుకు వన్నెను తెచ్చెను.(09)

   * * * *

కిన్నెరసాని పాటలు
కనువిందైన తోటలు
విశ్వనాథుల అక్షరపాణి
సృజించె పూల మాలలు.(10)

************

ఖలుడు వీడడు కుటిలం
అతని మార్చుట జటిలం
కారణం తెలుసునా
మనసు ఉండదు పదిలం! (11)

పుస్తకమో పాలపుంత
తీర్చును మదిలో చింత
మిక్కిలి పఠనం చేసి
మారుదాం మనమో వింత! (12)

మిత్రుడు మనకొక నీడ
తొలిగించు రిపుల పీడ
మిత్రుడే మన బలము
ఉండకు అతన్ని వీడ. (13)

పెద్దలను సేవించు
పిన్నలను ప్రేమించు
అందరినీ ఆదరించి
లోకాన్ని శాసించు! (14)

వీడాలి కపట బుద్ధి
కావాలి చిత్తశుద్ధి
చిగురించిన ఆశలతో
వెలుగును మానవ వృద్ధి. (15)


తెలగాణయే మురిసే
కవన సమరం మెరిసే
కాళోజీ యోధునికి
నిజాం నవాబు జడిసే!(16)

నిండుగ నిరాడంబరుడు
తెలగాణ వైతాళికుడు
రజాకార్ల నెదిరించిన
అపర పోరాట యోధుడు!(17)

వ్యంగ్య కథా రచయిత
అస్త్రం అతని కవిత
కాళోజీ చూపెనులే
తెలంగాణకు భవిత!(18)

వివక్షనెదిరించిన కవి
ప్రజలను మేల్కొలిపిన రవి
లూయీ అరగాన్ గా
శ్రీశ్రీ పొగిడిన జనకవి.(19)

వినెలే ప్రజార్తనాదం
సంధించెనతని వాదం
తెలగాణేతరుల కనెను
కాళోజి సింహనాదం!(20)


భగత్ సింగ్ (మణిపూసలు)
మణిపూసల కవి:- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.




భారతీయ సింహమతడు
బంగాలో పుట్టెనతడు
భగత్ సింగ్ వీరుడే
కుష్వంత్ సింగ్ కు కుమారుడు!(21)

భారతమాత పుత్రుడు
భయమే లేని వీరుడు
లక్ష్యం స్వాతంత్ర్యమే
ఎదురే లేని ధీరుడు!(22)

బాంబుల వాన కురిసే
అసెంబ్లీయే జడిసే
విప్లవ వీరున్ని చూసి
దేశమంతా మురిసే!(23)

అనంతం దేశభక్తి
అపారం అతడి యుక్తి
తెల్ల దొరలు చూసెను
విప్లవ వీరుని శక్తి!(24)


స్వరాజ్యంకై పోరాడె
ఉరితాడునే ముద్దాడె
భగత్ సింగ్ త్యాగం చూసి
ప్రజలు పోరుకు కదలాడె!(25)

ప్రజలందరు కిక్కర్లు
రోడ్లన్నీ వంకర్లు
కుర్రకారు బైకులపై
కొడుతుండే చక్కర్లు!(26)

మనిషికి తప్పదు పోరు
మానవత్వాన్ని కోరు
మంచి మనుజులెపుడూ
మహిలో వృధాగ పోరు!(27)

చూపుములే మమకారం
చేయుములే సహకారం
విలువిచ్చే మనుషులపై
చూపకులే అధికారం!(28)

జాతిపిత మహాత్మాగాంధీ (మణిపూసలు)

పోర్బందర్లో పుట్టెను
పుతలీబాయి తరించెను
చిట్టి గాంధీని చూసి
కరంచంద్ కళ్లు మురిసెను!(29)

సత్యబాటలో నడిచెను
అబధ్ధమాడుట మానెను
చిన్నతనమునే మదిలో
సద్గుణాలు మలుచుకొనెను!(30)

దేశం మెచ్చిన వీరుడు
ఆయుధముట్టని ధీరుడు
సత్యం,అహింసలనే
సంధించిన పరాక్రముడు!(31)

బోసి నవ్వుల తాత
రాసెను చక్కని రాత
మహాత్ముని కథ తెలుసుకుని
చాటుము అతని ఘనత!(32)

సత్యశోధన ఆత్మకథ
ఆదర్శం ఆయని కథ
అలుపే లేని నడకతో
సృజించెను నూతన గాథ!(33)

భారతావని జాతిపిత
చూపెలే చక్కటి భవిత
మహాత్మున్ని పూజించి
రాస్తి మణిపూసల కవిత!(34)


మమకారం కురిపించు
దేవతలను తలపించు
మమతలు కలబోసి
గోరుముద్ద తినిపించు!(35)

ప్రేమతో లాలించు
కరుణతో పాలించు
అమూల్యమగు పసిపాపల
చిరునవ్వు లాసించు!(36)

అందరి మాటలు వినాలి
చెడును పక్కన పెట్టాలి
పాలు- నీళ్లు వేరు చేయు
హంసలాగా బ్రతకాలి!(37)

కోయిలమ్మ కూసెను
మావి చిగురు పూసెను
ఉగాది షడ్రుచులతో
తెలుగు నేల మురిసెను!(38)

తల్లి ఎడద లాలన
కవి హృదయం వేదన
లక్ష్యం లేని ఖలునికి
తప్పదులే రోదన!(39)

మిత్రుని లాగా మెలుగును
కన్నతల్లిలా చూడును
స్థైర్యం కోల్పోగా
నాన్నై వెన్నంటుండును!(40)

చదువులో పడకుము క్షోభ
చదువుకుంటేనే శోభ
ఉన్నత చదువులు చదివి
పెంచాలే దేశ శోభ!(41)

19/09/2020 మణిపూసలు

బాలలు మరిచె గీర్వాణి 
పట్టె కరమున చరవాణి
మాయదారి మాయన పడి
వృథా అవుతున్నది తరుణి!(42)

మణిపూసల కవిత్వాలు
మదిని దోచే లిఖితాలు
మనసు పెట్టి చదువగా
మారు నరుల జీవితాలు!(43)

పంచు మనుషులకు ధైర్యం
చాటుము నీ ఔదార్యం
సాయము చేయు మనిషికి
కల్గు నిండు సౌందర్యం!(44)

మనిషికి ఉండొద్దు కుళ్లు
చేయునది పరులకు పుళ్లు
కుళ్లు ను వీడకుంటే
మిగిలించు రసనకు ముళ్లు!(45)

మర్యాదకు ఆధారం
చేయాలి నమస్కారం
చిరస్థాయిగా నిలుచును
భారతీయ సంస్కారం!(46)

రామేశ్వరమున జననం
చదువు తోవలో పయనం
అబ్దుల్ కలాం అతడే
భారత మాతకు నయనం!(47)

మనీషి పాటించు హితము
అతనికి ఆశలే మితము
అన్యాయాలెదురవగా
తను పాడు చరమగీతము!(48)

మహాత్మానే తన బిరుదు
అలాంటి మహనీయులరుదు
జగత్ పూజ్యున్ని స్మరించి
ప్రపంచ శాంతిని కోరుదు!(49)

పఠించు పంచతంత్రం
విద్యార్తులకు మంత్రం
మనసులో పదిలమవగా
వీడును మన కుతంత్రం!(50)

ప్రతిభతో ఇవ్వు పోటీ
ఆశలుండొద్దు కోటీ
ద్వేషించు వారిని
ఎదలు గెలువు పేర్మి తోటి!(51)

తల్లేను తొలి పరిచయం
మమతలు పండే (చే) హృదయం
తల్లిని సేవించగా
మనకదే భానోదయం!(52)

విద్యా దాత మన గురువు
అంధకారమున భానువు
అంకిత భావం నిండుగ
కలిగి ఉన్న జ్ఞాన తరువు!(53)

మహత్తరమైన జ్ఞానము
విద్యార్థులకున్ దానము
కలల భరత మాత పుత్ర 
అంతరిక్షముకు పయనము!(54)

స్వచ్చభారత్ నాశించె
సువర్ణమైన మది నిలిచె
ఫలితమేమీ కోరకా
స్వరాజ్యాన్నే అందించె!(55)

24/09/2020

గురువు మన విద్యా ఉదధి
ముందుండి నడుపు సారధి
అమలినమైన పేర్మితో
భవిత నిర్మించు వారధి!(56)

సజ్జనులకుండదు అహం
ఉండదు ఆశల దాహం
కల్లాకపటమెరుగకే
చేయు పరులతో స్నేహం!(57)

ఆపదలోనను ప్రకృతి
నరులొందాలి జాగృతి
భూమి పచ్చ గున్నప్పుడె
మానవ జన్మకు సుకృతి!(58)

పొత్తముతో మన స్నేహం
పులకరించు మన దేహం!
ప్రీతి పొంది చదువగా
అవసరముండదె లేహం!(59)

అమరమాయన చరణాలు
అమోఘము ఆయన కలలు
కలాం బోధనలు విని
స్ఫూర్తి పొందండి బాలలు!(60)

తల పట్టుకుని కూర్చోకు
తల వంచుకుని నిల్చోకు
తల పొగరుగా మాట్లాడి
తల ఒంపులు తెచ్చుకోకు!(61)

మధుర జ్ఞాపకాల మడి
తొలకరి కన్నీటి తడి
విద్య వర్షమున తడవగ
నేర్తు జీవన సవ్వడి!(62)

ఓ కరోన మహమ్మారి
చేస్తివి జగతిను ఎడారి
ప్రజల ప్రాణాలు తీయక
వదిలిపోవె మాయదారి!(63)

గాన గాంధర్వ శ్రీ పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారి మరణం సహించక రాసిన మణిపూసల కవితలు 👇👇

పాట మూగబోయెను
స్వరం చిన్నబోయెను
బాలు మరణం సహించక
ఎదలు శోకమాయెను!(64)

బహు భాషల్లోన పాడి
అయ్యెను పాటకు నాడీ
గాన గాంధర్వ వినుమా
నువు లేక మది కంటతడి!(65)

సంగీతమున చాణిక్య
భారతావని మాణిక్య
గానామృతముతో బాలు
తెచ్చెను తెలుగుకు అభిఖ్య!(66)

సప్త స్వరాలే జననం
అపారమాయన జ్ఞానం
నటనలోన అజేయుడే
పాటల తల్లికి నయనం!(67)

అతని గళమే ఆరోహి
సంగీత శిఖరధిరోహి
భరత మాత పుత్రునికి 
కర్కశ కాలమే ద్రోహి!(68)



మిత్రులు కారు అందరూ
సద్గుణులు ఉండు కొందరు
మోనిస్ ని ఎన్నుకుంటే
చూపు దారిలో లాంతరు!(69)

మిత్రులు కారు అందరూ
సద్గుణులు ఉండు కొందరు
మోనిస్ ని ఎన్నుకుంటే
చూపు దారిలో లాంతరు!(70)

తెలుగు భాషా బహు రక్తి
తెలుగు పైన చూపు భక్తి
తెలుగు పైన మమకారం
చూపెను చేకూరు శక్తి!(71)

వీడితే అహంకారం
పెరుగును నీ సంస్కారం
మనిషి మంచిగున్నపుడే
భువి చేయు నమస్కారం!(72)

పరులను దూషించకు
పరధనమాశించకు
పరుల ప్రతిభనోర్వక
పరులను వాదించకు!(73)

గిలిగింతలు పెట్టించు
చిరునవ్వులు పండించు
మిక్కిలి పఠించగా
నైతికాలు మదికిచ్చు!(74)

సరదాగా ఆటలాడు
గొంతు విప్పి పాట పాడు
సృజన వెలికితీయగా
జగతే నిన్ను ముద్దాడు (75)


"అక్షరారోహి"ని తలిచి
మణిపూసల కవిత మలిచి
జమలాపురి పాదమందు
పెట్టితి భక్తితో (పేర్మితో) కొలిచి!(76)

ఆత్మీయతతో పిలుపు
నిను మనీషిగా నిలుపు
జగతి స్నేహితుడవగా
నీ చేతిలోనె గెలుపు!(77)

మంచిది కాదు కోపం
అదియే నీకు లోపం
కోపాన్ని దహించుకో
మాయమవు నీ లోపం!!(78)

ప్రశ్నించుటే కవిత్వం
మదిన ఘోషే కవిత్వం
సుఖం మరిచిన ముఖాలను
నవ్వించుటే కవిత్వం!(79)

భారతీయుల మహాన్
చేయండి సావదాన్
బహదూర్ శాస్త్రి పల్కెను
జై జవాన్ జై కిసాన్!(80)

అక్షరాలను నాటెదను
పుస్తకాలు పెంచెదను
కవిత్వంతో జగతిలో
పచ్చదనమును నింపెదను!(81)


అక్షరాలు పూస్తాయి
కవితలనవి కాస్తాయి
చదువరి గుండెలోనున్న
వేదనను తీరుస్తాయి!(82)

తమ్ములు పూలను తెచ్చిరి
చెల్లెళ్ళు పూలు పేర్చిరి
మా తల్లి బతుకమ్మనుచు
అక్కలు పండుగ చేసిరి(83)

కవిత్వాలలో మణి
సాహిత్యమున రాణి
మణిపూసలు రచించి
తన్మయమొందె పాణి!(84)

సద్గుణాలు మదిన మలిచె
నిరతము విద్యనే కొలిచె
పేపరేస్తూ ధనమును
తన చదువుకుపయోగించె!(85)
అబ్దుల్ కలాం మహాశయా (మణిపూసలు) | https://www.harshanews.com/2020/10/blog-post_15.html?m=1 

మనసులో బాధను మరువు
చక్కగా నవ్వును పిలువు
తీయని పలకరింపుతో
విజేతవై భువిని గెలువు!(86)

సత్యము పలికిన ధైర్యము
సత్యమే నీకు అభయము
సత్యమేవ జయతే
నమ్మితే జయం తథ్యము!(87)

మాట మర్మం తెలుసుకో
బుద్ధిని బట్టి మసులుకో
చెడును మదిలో తుంచి
మంచి తనాన్ని నిలుపుకో!(88)

ఏసీ గదివ్వదు హాయి
అందున మది బండ రాయి
ప్రకృతిలో పయనించగా
మనిషికి దొరుకులే హాయి!(89)

ప్రకృతిలోనను విహరించు
పైరు గాలిని సేవించు
ఆయురారోగ్యాలతో
మనిషి వోలెను జీవించు!(90)

వివేకమునే నాటుకుని
వినమ్రతనే చాటుకుని
విజేతవై వెలుగాలే
విషవలయాలు దాటుకుని!(91)

కదలాలోయ్ ఓ నేత
చదువుల తల్లి సమేత
అంధకారం తొలిగించు
జగతినేలే విజేత!(92)

మంచి చెడుల జీవశాల
సంతోషపు పర్ణశాల
జీవితాన్ని నేర్పేది
అదియే మన కళాశాల!(93)

చదువుకున్నోనికి విలువ
దైవ సన్నిధికే కలువ
తెలుసుకుంటే సత్యమిది
అమ్మ చేతిలోని చలువ!(94)

ఆడిన మాటను తప్పక
కల్లలనెప్పుడు చెప్పక
మహనీయునివై బ్రతుకు
నిజాయితీనే వీడక!(95)

అమ్మ కన్నులే కమలం
అమ్మ ఒడే కోమలం
అమ్మ మనసును తెలుసుకో
అమ్మేగా మనకు బలం!(96)

మాఘ మాసం వచ్చింది
సంక్రాంతినే తెచ్చింది
చలి మంటలతో ఉదయం
చిరునవ్వులై పూచింది!(97)

మదిలో బాధ మొలిచింది
పెరిగి అది చెట్టయ్యింది
చూస్తూ చూస్తూ నాకే
కవితల ఫలమునిచ్చింది!(98)

అమ్మ బాగా తిట్టింది
మనసుకు నొప్పి కలిగింది
కన్నీరెట్టి బుజ్జాయే
మాట్లాడనని అలిగింది!(99)


కనులు తెరిచి చూశాను
"మణిపూసలు" రాశాను
రాసిన "లిఖితాలు" చదివి
మనసులోన మురిశాను!(100)

అతివాదిని కాను నేను
అల్లరోడ్ని కాను నేను
మనసులోని కవిత్వాన్ని
రాసుకున్న కవిని నేను!(101)


✍️ *అక్షరారోహి* _(లిఖిత్ కుమార్ గోదా)_,
 ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...