2, నవంబర్ 2020, సోమవారం

ప్రముఖ బాల సాహితీవేత్త గుడిపూడి రాధికా రాణి గారి పుస్తకం బాల కథంబం పై నేను సూర్య దినపత్రికలో రాసిన పుస్తక సమీక్ష (05)

 నైతికాల మకరందం.. రాధికా రాణి గారి బాల కథంబం (పుస్తక సమీక్ష)

బాల కథంబం పుస్తకం కవర్ పేజి



రచయిత్రి:- గుడిపూడి రాధికా రాణి గారు

నా పుస్తక సమీక్ష-5






సూర్య దినపత్రిక అక్షరం డెస్క్

పసిపిల్లలకు ఈ ప్రపంచంలో విలువైనవి, విశిష్టమైనవి, ఇష్టమైన సంపదలు ఏమన్నా ఉన్నాయీ అంటే అవి ఆలోచనా శక్తికి పదునుపెట్టి, మనసులో మంచి చెడుకు వ్యత్యాసం వివరించి, సద్గుణాల సమేతంగా సత్బాట వైపు నడిపించే బాలల కథలే అని కచ్చితంగా చెప్పాలి.

పిల్లల మనసులు ఐస్కాంతల్లాంటివి. వాటికి నైతికాలను నూరిపోసి, మెదడుకు పని చెప్పే కథలు కనిపిస్తే చటుక్కున అతుక్కు పోతాయి. చక్కగా ఇంట్లో అమ్మో, తాతయ్య నానమ్మలో, అమ్మమ్మ తాతయ్యలో, పాఠశాలలో ఉపాధ్యాయులో తేనెలొలుకు కథలు చెబుతూ ఉంటే అల్లరి బుడుగులు సైతం గప్చుప్ న కూర్చొని వారు చెప్పే కథల్లో విహరిస్తారు. కథల ఒడిలో వాలిపోతారు. కథల్లో వారికి వచ్చే సందేహాలను, బయట అంతుపట్టని విషయాలను కూడా త్వరగా నివృత్తి చేసుకోగలుగుతారు. అలా వారి మనసు, ఆలోచనా రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. మరి ఆ రాకెట్లా దూసుకుపోయేలా చేసే ఇంధనం.. మేలైన బాలల కథలే కదా!.

అలాంటి మానవీయ, స్ఫూర్తి నీయమైన, ఆలోచనాత్మక, సృజనాత్మక కథలకు నిలయమే గుడిపూడి రాధికా రాణి గారి బాల కథంబం బాలల కరదీపిక.
రచయిత్రి గుడిపూడి రాధికా రాణి గారు ప్రముఖ సాహితీవేత్త. బాలల కథలు, పజిల్స్ ,గజల్స్, కవిత్వాలు రాయడంలో, నిత్య నూతనంగా ఆవిర్భవిస్తున్న నూతన కవితా ప్రక్రియల్లో కలం పట్టడంలో వారిది అందెవేసిన చేయి. రాసిన ప్రతి వాక్యం నలుపాకమే అని చెప్పాలి. భాషా క్రీడాకారిణిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధులు. మేలైన బాల సాహిత్యం, ప్రౌఢ సాహిత్యం అందించడంలో సిద్ధహస్తులు.

ఈ పుస్తకంలోని కథలు ఒక్కసారి చదివామంటే చాలు. అల్లరి చేసే గడుగ్గాయులు కూడా సద్గుణులు అవుతారు. ఆలోచించగలుగుతారు. అంతేకాకుండా సమాజంలో వేటికి విలువ ఇచ్చి జీవించాలో, వేటికి ఇవ్వకూడదో కూడా ఇట్టే తెలుసుకుంటారు, నేర్చుకుంటారు.
పెద్దలు సైతం ఈ కథల్ని పాయసంలా స్వీకరించి,వారి ముందు జీవితంలో ఎటువంటి తప్పులు చేయడానికి ఇష్టపడరు. అటువంటి మేలైన మహత్తర సందేశం కలిగిన కథలివి.
పదేపదే విసుగు లేకుండా చదివించే కథలు. వీటికి అవార్డులతో తూకం వేస్తే అది పొరపాటే అని చెప్పాలి.
ఈ కరదీపిక లో మనల్ని తొలకరిగా పలకరించే "జేబులో జోరీగ" కథ నుండి "ఇరుకిల్లు" కథ వరకు, అన్ని మనల్ని పుష్పక విమానం లో కూర్చోబెట్టుకుని చక్కగా విహరింప చేస్తాయి."మనిషి కావాలి మనిషి"అన్నట్టు,"మనిషి లక్ష్యం మనీషి" అన్న సూక్తే లక్ష్యంగా ఇవి మనల్ని తీర్చిదిద్దుతాయి. నవ్విస్తాయి, నేర్పిస్తాయి ఈ కథలు.
 "జేబులో జోరీగ"కథలో రాఘవయ్య అనే పిసినారికి ఐదు రూపాయల నాణెం దొరకడం, అది మాట్లాడుతూ, రాఘవయ్యని ముప్పుతిప్పలు పెట్టడం, ఎంత దూరం విసిరేసిన తిరిగి తన జేబులోకి రావడం, చివరి ప్రయత్నంలో బిచ్చమెత్తుకునే ముసలమ్మకు ఐదు రూపాయల నాణెం దానం చేయగా, ఆ నాణెం ఏం మాట్లాడకపోవటంతో కథ ముగుస్తుంది.
ఈ కథ ముగింపులో,"ఆకలి వేయకపోయినా స్వార్థంతో తను కొనుక్కుందాం అనుకుంటే, వారించి, వాదించి, వేధించిన ఆ డబ్బే, ఆకలి తో బాధపడుతున్న వ్యక్తికి దానం చేయగానే శాంతించింది"అన్న ముగింపుతో గొప్ప అర్థాన్ని ఇచ్చి చాలా సృజనాత్మకంగా రచించారు రచయిత్రి  "చంద్రుడి కోపం, సూర్యుని తాపం" కథలు మనకెందుకు నెలరోజుల్లో నాలుగు సెలవులు (4 ఆదివారాలు), చంద్రుడు ఎందుకు ఒక రోజు సెలవు (అమావాస్య) తీసుకుంటాడో చాలా చక్కగా వర్ణించారు.
అలాగే ఒకప్పుడు చేదుగా చెరుకు, తీపిక కాకర ఉండి ఇప్పుడెందుకు చెరుకు తియ్యగా, కాకర చేదుగా ఉందో , ఒకప్పుడు పాముకి కాళ్లు ఉండి, ఇప్పుడు ఎందుకు పాకుతుందో జానపద కథలు లాగా కల్పితాత్మకంగా సృజించారు రచయిత్రి.

"పంచదార పిల్లి" కథలో, మంచితనానికి, దొంగతనానికి సమాజం స్పందించే తీరు"ఎలా ఉంటుందో విశ్లేషణాత్మకంగా వివరించిన కథ అందర్నీ ఆకట్టుకుంటుంది.

"కుదురు లేని కుంకుడు గింజ" కథ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి."కుదురుగా ఉంటే అందరూ ఇష్టపడతారు" అన్న నేపథ్యంతో కుంకుడు గింజకి , చింతగింజకి మధ్య జరిగిన కథ. మన పరిసరాల్లో నుంచే కథా వస్తువులు తీసుకుని కథలుగా లిఖించడం రచయిత్రి గుడిపూడి రాధికా రాణి గారి సృజనాత్మకతకు అద్దం పడుతుంది.

ఇందులో చెప్పుకోవాల్సిన కథ "కుండ కోరిక "కూడా. ఇది వాట్సాప్ లో రెండురాష్ట్రాలు చుట్టివచ్చిన రైలు లాంటిది. గొప్ప నీతి ఉన్న జీవితానికి సంబంధించిన కథ. కష్టాల కడలిని దాటుకుంటే పొందే సుఖాన్ని, భయపడితే పొందే శోకాన్ని చక్కగా వివరించిన కథ.
"పిసినారి బావ, కోడలు దానగుణం, "పిండి వంటల రహస్యం" కథలు ముందుచూపు నేర్పించే నిండైన బాలల కథలు.
"ఇరుకిల్లు" మధ్య బంధాలు ఎలా కొలువై ఉంటాయో, భవనాల్లో మానవీయ బంధాలు ఎలా దాక్కుంటాయో" వివరించిన వర్తమాన సమాజపు కథ.
ఈ ఇరవై రెండు కథల్లో కథలో భాగంగానే ముగింపులు నీతిని వివరించారు రచయిత్రి.
ఇలా ఎన్నో ఆసక్తికర శీర్షికలతో,నైతికాల కథలతో ముస్తాబైన ఈ బాల కథంబం కరదీపిక పిల్లల పాలిట ఓ గురువు, ఆస్వాదిస్తే మకరందం, పెద్దల పాలిట మార్గ నిర్దేశం, వర్ధమాన రచయితల పాలిట కామధేనువు, దిక్సూచి.ఇలాంటి కథలు మొత్తం పిల్లలు అందరూ చదివి ఆస్వాదించాలని ఆకాంక్షించాలి ప్రతి తల్లిదండ్రులు. రేపటి భావి భారత పౌరులు ఉత్తమంగా తయారు కావాలంటే చిన్నతనం నుండే ఈ "బాల కథంబం" వంటి కథలు చదవాలి. మనిషి నుండి మహర్షిగా జీవించాలి. బాలసాహిత్యంలో ఇటువంటి మనోరంజక కథల పొత్తాన్ని వెలువరించిన రాధికా రాణి గారికి అభినందనలు.

*పుస్తక సమీక్షకుడు*- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం
📗📘📙📗📘📙📗📘📙📗📘📙
నవంబర్ 2,2020

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...