29, నవంబర్ 2020, ఆదివారం

హరివిల్లు నూతన లఘు కవితా ప్రక్రియ సృష్టికర్త శ్రీ మామిడి రమేష్ గారి తొలి హరివిల్లు పుస్తకం"అక్షర జలపాతాలు" పుస్తకంలో నేను రాసిన ముందు మాటలు...

  •  కదిలించే కవనాలు... "హరివిల్లు"ల అక్షర జలపాతాలు



తరి
ముందుకు నడుస్తున్న కొద్దీ తెలుగు సాహితీవనంలో కొత్త కొత్త మొలకలు, మొక్కలు ఉద్భవిస్తూ కవన పరిమళాలను, కిరణాలను వెదజల్లుతున్నాయి.
తెలుగు భాషా ఘనతను సుస్థిరంగా నిలపాలనే ఆశయంతో, కవిత్వాన్ని సాధారణ జనుల రసన వద్దకు తీసుకెళ్లి, కవిత్వంపై మక్కువ కలిగేలా చేసి, పాఠకులు సైతం కవి కావాలనే ఉద్దేశంతో, కవులు తమ సృజనకు పదును పెట్టి నూతన కవితా ప్రక్రియలకు పురుడు పోస్తున్నారు. "అచ్చంగా తెలుగు" ఇంపును, నుడికారాలను, అతి తక్కువ పాదాల్లో, మాత్రాఛందస్సును, అంత్య ప్రాస నియమం పాటించడం, అలంకారాలను కవిత్వంలో చొప్పించి చిక్కగా, తేనె చుక్కగా అందరూ రాయాలనే నూతన కవితా ప్రక్రియలకు శ్రీకారం చుడుతున్నారు రూపకర్తలు.
అలాంటి కొద్దిమంది కవుల్లో హరివిల్లు కవితా రూపకర్త శ్రీ మామిడి రమేష్ గారిని ఒకరని చెప్పుకోవచ్చు.

ఈమధ్యే రూపుదిద్దుకున్న కైతికాలు, మణిపూసలు, చిమ్నీలు, మెరుపులు వంటి నూతన కవితా ప్రక్రియల రుచిని చూసిన రమేష్ గారు తమ వంతు తెలుగు కవిత్వం కోసం, బడిలో చదువుకునే విద్యార్థుల నుండి, తెలుగు సాహిత్యం మీద అభిమానం ఉన్న ప్రతి వ్యక్తి కోసం ఈ హరివిల్లు ప్రక్రియను రూపొందించారు అని నా అభిమతం. అతి తక్కువ కాలంలోనే వాట్సప్ వేదికగా అన్ని వయసుల వాళ్లు కలిపి దాదాపు రోజుకు రెండు వందల మందికి పైగానే ఈ సమూహంలో హరివిల్లు కవిత్వం కురిపిస్తున్నారు. అతికష్టమైనా, ఎంతో శ్రద్ధతో వాళ్లల్లో విజేతలను ఎన్నుకుంటున్నారు నిర్వాహకులు.

ఈ "అక్షర జలపాతాలు" లోని హరివిల్లు కవనాలు ప్రతి ఒక్క చదువరిని కవిత్వంతో తడిపేస్తాయి. 160 హరివిల్లులతో అలంకరించిన ఈ వయ్యి సంపూర్ణంగా జనాదరణ పొందుతుందని ఆకాంక్షిస్తున్నాను. నాకున్న వీలునుబట్టి ఇందులోనే చిక్కని కవిత్వాన్ని మీ మదికి చేరవేసే యత్నం చేస్తాను.

" సహనశీలి మగువ
  సమరభేరి మగువ
  ఇంటి వెలుగు మగువ
  ఇలన కాంతి మగువ"(16)-
అంటూ లక్ష్మీబాయి, రుద్రమదేవి వంటి మగువలు చేసిన పోరును, మగువలకు ఉన్న గొప్ప లక్షణాలను, ఒక్క హరివిల్లు లో పొందుపరిచారు.
" చలికి వణికి నపుడు
  చెద్దరగును అమ్మ
  అలసిపోయినపుడు
  ఊయలగును అమ్మ"(30)
- అంటూ అమ్మ అవ్యాజమైన ప్రేమ గురించి గొప్పగా వివరించారు.44వ హరివిల్లులో అటు కలియుగంలో జరుగుతున్న నిజాన్ని తెలియపరచి, అమ్మ దివ్యమైన గొప్పతనాన్ని చాటి చెప్పారు.
"
  
  మాట చెలిమినిచ్చు
  మాట కలిమినిచ్చు
  మాట సమత నిచ్చు
  మాట మమత నిచ్చు"(67)
 మాట ఎంత మహత్తరమైన కార్యాలను చేయగలదో, ఎంతటి ప్రేమానురాగాలను కురిపించగలదో వివరించారు.

" మాతృ భాష లోని
  మకరందం వీడకు
  పరుల భాష యొక్క
  పంచన చేరకు!"(84)
అంటూ మాతృభాషలోని ప్రేమానురాగాలను భోధిస్తూనే, పరుల భాష చెంత చేరకు అని, పరభాష నేర్చుకోవడం వరకేనని చదువరులకు చెబుతున్నారు.

నాన్న ఆప్యాయత, గురువు విశిష్టత, చెలిమి, చెట్టు విశిష్టతలు వెల్లడించారు కవి అపురూపంగా.

"నొసటి రాత రాయు
అసలు బ్రహ్మ ఓటు
  బతుకు బాగు చేయు
  బల సూత్రం ఓటు!"(102)
- అంటూ ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూనే, రాజకీయవేత్తలు ఎంత జిత్తులమారులో,కుటిల బుద్ధిగలవారో,కుంటి సాకులు వినిపిస్తారో తరువాతి హరివిల్లు కవితల్లో చూపించారు.

దేశానికి అమ్మై అన్నం అందించే రైతన్న గురించి-
" మెతుకులిచ్చు వాడు
  చతికెలపడే నేడు
  అతీగతీ లేక
  చితికి చేరెను చూడు!" (113)
అంటూ తన కవి హృదయ వేదనను కవిత్వకరించారు కవి.

"మనిషి పైన చేసే
 మారణ హేలల దాడి
 మందుగిందు లేని
 కరోనా మాయలేడి"-(119)


ప్రస్తుతం మూడవ ప్రపంచ యుద్ధంగా మారిన కరోనా మహమ్మారి పై తన క(ల)రవాలాన్ని సంధించారు.

ఆస్వాదించాలే కానీ ఇందులోని నూట అరవై కవితలు ప్రతి పాఠక ప్రియుడిని తేనె టీగలా మార్చి "హరివిల్లుల మకరందాన్ని" రుచి చూపించగలవు.
మానవత్వం,సమాజ హితం, నడకను, ఆలోచనా శక్తిని, విలువల్ని, విచక్షణని, మానవీయ బంధాలు ఇలా మానవ జీవితంలో ఆవశ్యమైన ప్రతి విషయాన్ని తీసుకుని అతి తక్కువ పదాలతో, పాదాలతో చక్కని కవిత్వాన్ని రాసి పాఠక లోకానికి అందించడంలో కవి సఫలీకృతులయ్యారు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కవి రమేష్ గారు మున్ముందు నిత్య నూతనమైన హరివిల్లుల కవిత్వాన్ని తెలుగు పాఠకు ప్రియుల అరచేతుల్లోకి తీసుకెళ్లి వారి హృదయ గ్రంథాలయంలో జీవించ గలరని ఆకాంక్షిస్తున్నాను. ఇటువంటి మనోరంజక పుస్తకాన్ని వెలువరించిన రమేష్ గారికి అభినందనలు.

✍️ లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ,

మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల,బోనకల్.

బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507202
ఫోన్:- 9949618101

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...