30, మే 2020, శనివారం

నేను రాసిన 25వ బాలల కథ "మోసకారి మొసలి స్నేహం"

25వ బాలల కథ:-

"మోసకారి మొసలి స్నేహం"

రచన:- లిఖిత్ కుమార్ గోదా.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ విద్యార్థి, 
మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్, ఖమ్మం జిల్లా - 507204
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 
మార్తాండ అనే అడవిలో భైరవి అనే పెద్ద కొలను ఉండేది. అందులో ఎప్పటినుండో నివాసముంటున్న మిక్కీ అనే ఒక ముసలి మొసలి చిన్న చిన్న చేపలని తింటూ జీవనం గడిపేది.
   మొసలికి వయసు పైబడటం తో చేపల్ని వేటాడలేక కడుపు మాడ్చుకునేది.
ఒకసారి మిక్కీ నీళ్ళల్లో ఉండలేక ఒడ్డు మీదకి వచ్చింది. కొలను వైపు అలానే చూస్తూ ఉంది.
అప్పుడు నిక్కీ అనే కొంగ చేపలని వేటాడడానికి వచ్చింది ఆ కొలను దగ్గరికి. మిక్కీ చేపలు పట్టడం చూసింది నిక్కీ. బ్రహ్మ విద్య తెలిసినట్టు చేపల పట్టుకొని తింటుంది నిక్కీ.
నిక్కీ భోజనం అయిపోగానే మిక్కీ నిక్కీని పిలిచి “హాయ్ నేస్తమా! నాపేరు మిక్కీ. నేనొక ముసలి మొసలిని. నేను ముసలిదానిని కదా. వేటాడలేక పోతున్నాను. కొంచెం దయ ఉంచి కొన్ని చేపలు పట్టి నాకు ఇవ్వవూ. బాగా ఆకలిగా ఉంది.” అని చెప్పింది నిక్కీతో.
నిక్కీ మిక్కీ బాధ చూడలేక జాలి కలిగి దయతో కొన్ని చేపలు వేటాడి మిక్కీ ఆకలి తీర్చింది.
నిక్కీ మిక్కీకి సహాయం చేసినందుకు మిక్కీ నిక్కీతో “నేస్తమా కృతజ్ఞతలు! నా ఆకలి తీర్చావు. నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను నాతో జత కడతావా.” అని అడిగింది నిక్కీని.
“తప్పకుండా మిత్రమా! ఈరోజు నుంచి మనం స్నేహితులం” అంది నిక్కీ.
“కాకపోతే మిత్రమా నువ్వు రోజు నాకు సహాయం చేయాలి! చేస్తావా?” అని అడిగింది మిక్కీ.
“ఏంటది మిత్రమా చెప్పు?” అనంది.
“మనమిద్దరం ఒక ఒప్పందం చేసుకుందాం. నేను ఎలాగో ముసలిదాన్ని. బ్రతికినా ఇంకొన్నాళ్లు. నేను బ్రతికినన్నాళ్లు నువ్వు నాకు ఆహారం అందించావే అనుకో నా దగ్గర ఉన్న బంగారం నీకు ఇస్తాను. అప్పుడు నువ్వు సంతోషంగా గడపవచ్చు. ఓకేనా" అన్నది మిక్కీ.
నిక్కీకి బంగారం మీద ఉన్న ఆశతో సరేనని ఒప్పుకున్నది.

అలా చాలా కాలం గడిచిన తర్వాత ఒకసారి మనుషులు పర్యావరణానికి చేసిన నష్టం కారణంగా ఆ సంవత్సరం వర్షాలు పడక కొలను ఎండిపోయే స్థితికి వచ్చేసింది. కొలను లో చేపలు కూడా దొరక్కపోవడంతో నిక్కీ మిక్కీ కి ఆహారం అందించలేకపోయింది.
అయితే మిక్కీ ఒక పథకాన్ని ఆలోచించింది. తన దగ్గర ఉన్న బంగారం తో రోజుకొక కొంగ కి ఆశ చూపించి దాన్ని పట్టి తింటే తాను ఇంకొంతకాలం బ్రతుకుతా అని అనుకున్నది. తన ఆకలి కోసం మిత్రులు లేడు శత్రువు లేడు అన్నట్టుగా ఆలోచించింది మిక్కీ.
రెండు రోజుల నుండి ఆహారం లేక సతమతమైన మిక్కీ నిక్కీ కొలను దగ్గరికి రావడం గమనించింది.
మొసలి కన్నీరు కారుస్తూ నిక్కీ తో “మిత్రమా! కొలను ఎండిపో వస్తుంది . చేపలు ఎట్లాగు లేవు. నీకు నాకు ఇద్దరికి ఆహారం లేదు. బహుశా ఇక నువ్వు వేరే చోటకి వెళ్లాల్సి వస్తుందేమో. ఇక నేను అస్తమించాల్సిన తరుణం ఆసన్నమైంది ఏమో. మన స్నేహ బంధం తెగిపోతుంది ఏమో. నువ్వు మన స్నేహానికి చాలా విలువ ఇచ్చి నాకు సేవ చేశావు. నీకు మొదట మాట ఇచ్చాను కదా నీకు బంగారం ఇస్తానని ఇదిగో ఈ సంచిలో ఉంది వచ్చి తీసుకో” అని బంగారం ఉన్న సంచిని చూపించింది మొసలి.
బంగారం మీద ఆశతో నిక్కీ సంచి దగ్గరికి రాగానే ఒక్కసారిగా మిక్కీ నిక్కీ మీదకి దూకింది. “ఏంటిది మిక్కీ!నీకు సహాయం చేసినందుకు ఇదా నువ్వు నాకు చేసే న్యాయం. అయినా మొసలివని అనిపించావు. నీ మొసలి కన్నీరు కార్చి ఈ ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చావు. దుష్టులకు పోనీలే పాపం అని సహాయం చేస్తే అది తిరిగి సహాయకుడికే అపకారం చేస్తారని నిరూపించావు.” అని తనువు చాలించింది నిక్కీ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...