30, మే 2020, శనివారం

నా మొదటి పుస్తక సమీక్ష జక్కాపూర్ బడి పిల్లలు రాసిన కవితల సంకలనం "మధుర పద్మాలు"పై.(ఈ పుస్తక సమీక్ష (11/06/2020) నేటినిజం దినపత్రికలో ప్రచురితం.

పుస్తక సమీక్ష-1

శీర్షిక:- చైతన్య దీపాలు..ఈ మధుర పద్మాలు
పుస్తక సమీక్షకుడు :- లిఖిత్ కుమార్ గోదా 
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
    ప్రతిభకు వయసు పరిమితి లేదని పెద్దల మాట. బడిలో చదువుకునే దశలో కేవలం చదువుకోవడం, పరీక్షల్లో మార్కుల కోసం పోటీ పడటం, స్నేహం చేయడం, ఆడుకోవడమే ఇప్పటి విద్యార్థులకు తెలిసిన విషయం. కానీ ఇంత చిన్న వయసులోనే కలాలతో స్నేహం చేస్తూ సమాజ శ్రేయోభిలాషులు గా మారి ప్రస్తుతం వాళ్ళు మానవ జీవనాన్ని దర్శిస్తూ, తమ ఆలోచనలని కవితలుగా మార్చి సమాజంపై తమ ప్రభావం ఎట్టిదో, చిట్టి కలాలతో బయల్దేరి తమ అభిమతాన్ని వ్యక్తపరుస్తున్నారు జక్కాపూర్ బడి పిల్లలు.
    తేనె పట్టు కావాలంటే తేనెటీగ సుమాల పై వాలి వాటిని సేకరించి ఒక చెట్టు కొమ్మపై చేర్చాలి. ఆ సేకరించిన తేనె మనందరికీ ఎంతో ఆరోగ్యకరం శ్రేయస్కరం. అలాగే తేనె దాదాపు వెయ్యి సంవత్సరాల వరకు నిలవ ఉండగలదు. అట్లాగే ఈ ప్రపంచం ఉన్నంతవరకూ ఎక్స్పైర్ లేకుండా నిలిచే కవిత్వమే ఈ “మధుర పద్మాలు” కవితాసంకలనం.
      మాన్యులు, సాహిత్యకారులు, పాఠశాల గురువులు శ్రీ భైతి దుర్గయ్య గారు తాను కలలు కనే నవ సమాజం కోసం తేనేటీగలా మారి, సుమాల ఉద్యానవనం లాంటి జక్కాపూర్ బడిలో అందమైన సుమాల వంటి విద్యార్థులలో అక్షరం దాల్చిన కవితల్ని సేకరించి మనకి తేనెపట్టు లాంటి ఈ కవితా సంకలనం రేపటి భారతదేశ శ్రేయస్సు కోరి అందించారని సంశయం లేకుండా చెప్పవచ్చు. తెలుగు భాష అవునత్వం ఉట్టిపడేలా తమ రచనలు కొనసాగించిన ఈ బాలలందరికీ ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే.
ఇక ఈ నవ కవితాసంకలనం లోకి వెళితే బాల కవులు తమ సృజనకు, ప్రతిభకు పెద్దపీట వేశారని చెప్పాలి. అక్షర సంపద ధారాళంగా ప్రదర్శిస్తూ ఈ సమాజానికి మేలైన కవితలు అందించారు ఈ బాలబాలికలు. వారిలో దాగున్న గురుభక్తిని, తల్లిదండ్రులపై ప్రేమని, స్నేహం పై విలువని, పర్యావరణం పై బాధ్యతని, దేశానికి చేయాల్సిన సేవని చిట్టి కవితలతో వర్ణిస్తూ మిఠాయి లాంటి కవితలు రాశారు ఈ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే..



మధుర పద్మాలు సంపాదకులు శ్రీ భైతి దుర్గం గారు



(11-06-2020)
_____________________      
           మనల్ని లోకానికి పరిచయం చేసేది అమ్మ. మమతకి, సహనానికి మారుపేరు అమ్మ. కానీ అలాంటి అమ్మని బాధ పడితే ఏం జరుగుతుందో గురజాల అలేఖ్య తన “దూరం” కవితలో -
             “అమ్మను బాధ పెడితే
               ప్రేమ దూరం అవుతుంది”
 అని సత్యవాక్కు పలికింది.
అలాగే చాలామంది బాల కవులు అమ్మ నాన్న ని కవితా వస్తువుగా తీసుకొని ఎవరికి వారే భిన్న ఆత్మ కంగా అమ్మ పెట్టే పాలబువ్వ లాగా, నాన్న నోటికి అందించే మిఠాయి లాగా అందమైన కవితలతో రంజింప చేశారు. తమ తల్లిదండ్రుల పై వారికి ఎంత ప్రేమ ఉందో తమ కవితల్లోన తెలియపరిచారు.

      తోకల కావ్య రాసిన కవితలో -
       “బడి మన దేవాలయం
        గురువు మన పూజారి” -
అంటూ కవితను ప్రారంభించింది. ఆ కవితను చదువుతుంటేనే మనకు అర్థం అవుతుంది ఆ బాల బాలికల ఎదలో ఆ బడి సంస్కారాన్ని ఎంత లోతుల్లో నాటిందోనని. 
తమ వెలలేని ప్రేమకు రూపాన్ని ఇచ్చిన గురువులు దుర్గయ్య గారికి తమ వంతు ప్రేమతో, గురుభక్తితో, గురువుపై విశ్వాసంతో ఆ గురువునే ఉదాహరణగా తీసుకొని కమ్మని కవితల వర్షం కురిపించారు అనడంలో అతిశయోక్తి లేదు.

క్రీడలకు దూరమై శారీరక బలాన్ని రోగనిరోధక శక్తిని కోల్పోతున్నారు నేటి బాలలు. వీడియో గేమ్ల పిచ్చి పట్టి పుస్తకాలను సైతం పక్కన పెట్టేశారు. పబ్జి , ఫ్రీ ఫైర్ అంటూ ఎన్నో క్రూరాత్మక, హింసాత్మకమైన వీడియో గేములు ఆడుతూ తమ మస్తిష్కంలో కోపాన్ని, క్రోధాన్ని, ద్వేషాన్ని జ్వలించు కొంటున్నారు.
పబ్జి, ఫ్రీ ఫైర్ వంటి ఆటలు వలన, పుస్తకాలను దూరం పెట్టడం వల్ల పిల్లలు ఏం కోల్పోతున్నారో, ఏం పొందుతున్నారు సమాజానికి గుర్తుచేస్తూ నిరుగొండ అఖిల్ తన పబ్జీ కవితలో ఇలా రాసుకొచ్చాడు -
       “పబ్జి ఎందుకు?
         చాలా పుస్తకాలు ఉండగా
         చదువుకుని అవుదాం గొప్పవాళ్ళం!” - అంటూ అటు సెల్ ఫోన్ వాడకం, సెల్ ఫోన్ ఆటల్ని నిలుపుకొని, పుస్తకాలు పట్టు“కొమ్మ” నాడు. “సెల్ఫోన్ వద్దు పుస్తకాలే ముద్దు” అని చెప్పకనే చెప్పాడు ఈ బాలమేధావి.

       ఓటు విలువ ఎంతటి మహత్తర మార్పును తెస్తుంది తమ కవితల ద్వారా వెల్లడించారు తమ్ముళ్లు ఎర్రం అంకిత్ రెడ్డి, కరికె నితీష్ కుమార్. ఓటు గురించి వీరు రాసిన ప్రతి అక్షరం నేటి పెద్దల నుండి రేపటి పిల్లల దాకా చర్చాంశనియం.
మనిషి జీవితంలో చెట్లు మహోన్నత స్థానం కలిగి ఉంటాయి. చెట్టుకి మనిషికి వ్యత్యాసం తెలుపుతూ కరికె నితీష్ కుమార్ తన “పుణ్యకార్యం” కవితలో -
          “మనిషికి లేనిది పరోపకారము
            చెట్టుకు ఉంది ఆ లక్షణం” - అని ఒక్క వాక్యంలో తన కవిత్వం అంతా అర్థవంతంగా చెప్పేశాడు. నేటి మనిషికి ఎదుటి వ్యక్తికి పరోపకారం చేద్దాం అనే సదుద్దేశంతో లేకపోవడం కవితా వస్తువుగా తీసుకున్న ఈ బాల కవి రేపు మహోన్నత కవితలు రాయగలడని ఆకాంక్షిస్తున్నాను.
మారుతున్న ఈ ఆధునిక కాలంలో సైకిల్ విశిష్టత తగ్గిపోయింది. ఇప్పుడు పదేళ్ళు పిల్లలు సైతం బైకులు నడుపుతూ చక్కర్లు కొడుతున్నారు. కానీ సైకిల్ విశిష్టత కవిత ద్వారా ఇలా చెప్తుంది తేజస్విని చెల్లి -
            “రెండు చక్రాల బండి
              మనకు ఎంతో మేలైన బండి
             గొప్పనైన బండ్లు చేయలేని పని
             ఒక్క సైకిల్ మాత్రమే చేస్తుంది” .
అంటూ సైకిల్ మనకు అందించే ఆరోగ్యాన్ని, చేర్చే గమ్యాన్ని ఇట్టే చెప్పేసింది.
పర్యావరణం పై ప్రేమతో పర్యావరణాన్ని రక్షించుకోవాలని చెబుతూనే, మన పండుగలు సైతం సంస్కార రహితంగా జరుపుకో కుండా, శాస్త్రయుక్తంగా జరుపుకోవాలని తమ కవితల ద్వారా అద్దం పట్టారు జయంత్, రాగల చంద్రలేఖ, దుర్గం స్నేహ. వీరిని అభినందించకుండా ఉండలేము.
 “మహా ఉద్యమం” అంటూ స్వచ్ఛభారత్ పై కవిత రాసిన సూర్య శ్రేయ మనకు మన బాధ్యతను తెలియపరిచింది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనకు ఏ రోగాలు అంటవని, అప్పుడే దేశం మహోన్నతంగా స్వచ్ఛంగా ఉండగలదని తెలియపరిచింది.

బొప్ప సాత్విక తన “అన్న చెల్లెల బంధం” కవితలో
          “ఇలవేల్పు నీవే
           నాకు రక్షణ నిచ్చేది నీవే
           నీ రుణం తీర్చగలనా?”
అంటూ రాసిన కవితలో అన్నా చెల్లెల అనుబంధాన్ని ఉట్టి పడేలా చేసింది.
      చిన్న వయసులోనే సమాజంపై ఇంతటి సామాజిక స్పృహ, అవగాహన కలిగి ఉన్న మన తమ్ముళ్ళు చెల్లెళ్ళు చూస్తే రేపు నవ్యభారతం తయారవుతుందని గుండెల మీద చేయి వేసి చెప్పగలను.
బాలలందరూ భగీరథ దీక్షను చేపట్టి ప్రతి ఒక్కరూ ఉపమన్యుడులా పట్టుదలతో పదునైన కవితలు రాశారు. ఇంతటి గొప్ప కార్యానికి సహకరించిన శ్రీ భైతి దుర్గయ్య గారిని ప్రశంసించకుండా ఉండలేము.
అలాగే ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఒక ఉపాధ్యాయుడు సాహిత్యం పై మక్కువ కలిగి విద్యార్థులకు తెలుగు సాహిత్యం పై మక్కువ కలిగేలా చేసి మధుర పద్మాల వంటి ఎన్నో బాల సంకలనాలు తీసుకొస్తే రేపు తెలుగు సాహిత్యానికి లోటు ఉండదు. రేపు తెలుగు భాష కనుమరుగు అవుతుంది అన్న బాధ మనకు ఉండదు.
తమ అభిలాషను కొనసాగిస్తూ రేపటి ప్రజల్లో కూడా చైతన్య దీపాన్ని వెలిగిస్తారు అని' గురువులకు, తల్లిదండ్రులకు, ఊరికి, దేశానికి మహోన్నత కీర్తిని సంపాదించి తీసుకొస్తారు అని ఆశిస్తూ
మీ లిఖిత్ కుమార్ గోదా
మీలాంటి ఓ బాల కవి.

__________________________
ఈ నా మొదటి పుస్తక సమీక్ష ప్రచురించిన నేటి నిజం దిన పత్రిక సంపాదకులు శ్రీ దేవదాసు గారికి, ప్రచురించడానికి సహకరించిన మధుర పద్మాలు పుస్తక సంపాదకులు శ్రీ దుర్గం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
👉👉క్రింది లింకుల్లో పుస్తక సమీక్ష చదవండి 👇👇👇👇https://drive.google.com/file/d/154Jg117c9-fu6HNHSvU9PMlgPy6Rt7Qq/view?usp=drivesdk 
(నేటి నిజం దినపత్రిక)
లేదా
https://drive.google.com/file/d/14yJ5GnoZLICskmDOF38YCuYfAlT4RBF8/view?usp=drivesdk
(మధుర పద్మాలు)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...