7, జులై 2020, మంగళవారం

ఈరోజు (07/07/2020) మొలక న్యూస్ లో ప్రచురించిన నా 28వ బాలల కథ [చదువు ఇష్టం లేని చందు]. ప్రచురించిన సంపాదకులు శ్రీ వేదాంత సూరి తిరునగరి గారికి కృతజ్ఞతలు 🌹🌹🌹🌹.

కథ:- చదువు ఇష్టం లేని చందు
(మొలక న్యూస్)
రచయిత:- లిఖిత్ కుమార్ గోదా,
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్ .
(మొత్తం ప్రచురణ అయిన రచనలు:-60
మొలక న్యూస్ లో ప్రచురించిన రచనలు:-37)

___________________
స్కూల్ కి వెళ్లడం ఇష్టం లేని చందు ఊరికి, అడవికి మధ్యలో ఉన్న చింత చెట్టు దగ్గరకెళ్ళి, దాని కింద కూర్చుని బ్యాగులో తెచ్చుకున్న బిస్కెట్లు,చాక్లెట్లు తింటూ ఉండసాగాడు.
ఆ చింత చెట్టు మీద ఉన్న దెయ్యం చందూని చూసి, అతనికి చదువుకోవడం ఇష్టం లేదని, అందుకే అ(ఇ)క్కడికి వచ్చాడని గ్రహించింది.
చందూని ఎలాగైనా చదువు వైపు మొగ్గు చూపేలా చేయాలనుకున్నది. కొంచెం సేపు ఆలోచించింది.మెదడులో ఏదో ఒక పదునైన ఆలోచన తగలడంతో చటుక్కున క్రిందకు దూకి ఒక రైతు రూపాన్ని దాల్చి చందు బ్యాగు పట్టుకుని అతని ముందర నడుస్తుంది.
ఆ రైతు రూపంలో ఉన్న దెయ్యం, తన బాగు తీసుకెళ్లడం చూసి చందు "ఏ అంకుల్! ఎక్కడికి తీసుకెళ్తున్నారు నా బ్యాగ్ ని?" అని అడిగాడు.
"నీకు చదువు కూడా ఇష్టం లేదు కదా. అందుకే ఈ బ్యాగ్ ని మా ఇంటికి తీసుకెళ్లి, మా అమ్మకి ఇద్దామని" అన్నాడు.
"అయినా మీకు ఎందుకు? నా ఇష్టం. అది నా బ్యాగు మీరు ఎందుకు తీసుకెళ్తారు?" అడిగాడు చందు.

"నాకెందుకా! అయితే అస్సలు ఇవ్వను. నీకు దిక్కున్న చోట చెప్పుకో పో"అన్నాడు రైతు.
చందు తలదించుకుని,ప్రాధేయ పడుతూ "నా బ్యాగ్ నాకు ఇవ్వండి. ఇంటికి వెళితే అమ్మవాళ్ళు కొడతారు అంకుల్" అని అన్నాడు.
"ససేమిరా కుదరదు.నీ బ్యాగ్ నీకు కావాలంటే నేను ఒక ప్రశ్న వేస్తా. సరిగ్గా జవాబు చెబితే నీ బ్యాగ్ నీకు ఇచ్చేస్తా" అన్నాడు రైతు.
"ఓకే అంకుల్ అడగండి!" అన్నాడు చందు.
          "జీడి వారి కోడలు, వేడి వారి మరదలు, వైశాఖ మాసంలో ఇంటికి తిరిగి వస్తుంది. ఏమిటది?" 
అని అడిగాడు రైతు.
చందు కొంచెంసేపు ఆలోచించాడు. తమ తెలుగు టీచర్ ఒకసారి ఆ ప్రశ్న అడిగితే తన ఫ్రెండ్ సంతోష్ జవాబు చెప్పిన మాటలు గుర్తొచ్చి "మామిడిపండు అంకుల్ జవాబు" అన్నాడు చందు.
"సరిగ్గానే చెప్పావు. కానీ ఆ జవాబు నీకు ఎలా తెలుసు?" అడిగాడు రైతు.
చందు విషయం చెప్పాడు.
"మరి ఆ విషయం ఎలా తెలిసింది నీకు చదువుకోడానికి బడికి వెళితేనే కదా! పాఠశాల అనేది దేవాలయం లాంటిది. గురువులు అందులో దేవుళ్ళు వంటి వారు. బడిని ఆదరించి వెళ్లాలి కానీ, చీదరించుకోకూడదు.
బడికి వెళితే మనకు మంచి సాంగత్యమే కాదు, సర్వ సద్గుణాలు అబ్బుతాయి. అన్ని విషయాలు తెలుస్తాయి. అందరి పట్ల ఎలా నడుచుకోవాలో తెలుస్తోంది.అంతేకానీ బడికి వెళ్ళకుండా ఇలా తిరిగితే నీకు వచ్చే జ్ఞానం, వినయం, సంస్కారం శూన్యం. ఇంకెప్పుడూ ఇలా బడి మానేసి బయట తిరగకు.క్రమం తప్పకుండా బడికెళ్ళి జీవితంలో గొప్పవాడు అయ్యాక నాకు కనబడు. నేను ఇటువైపే ఉంటాను సరేనా. ఇందా నీ బ్యాగ్.."అని అందించాడు రైతు.
చందు ఆ రైతు మాటలో ఆంతర్యం తెలుసుకుని చదువుకుంటే కలిగే ప్రయోజనం ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఇట్టే మటుమాయం చేయొచ్చని తెలుసుకుని రైతు కి నమస్కరించి బడి వైపు అడుగులు వేశాడు‌.

కథను క్రింది లింక్లో చదవొచ్చు 👇👇👇
https://molakanews.page/YNJDRf.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...