రచయిత:- లిఖిత్ కుమార్ గోదా,
9 July 2020, 12:00 am
'ఈ కరోనా వల్ల ఫంక్షన్లు ఏమీ జరగడం లేదు. లాక్‌డౌన్ వల్ల పనులు లేక అందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు. అందుకే మిషన్ నేర్చుకునే వాళ్లుగానీ, బట్టలు కుట్టించుకునే వాళ్లు గానీ మనింటికి రావడంలేదు. మీ నాన్న కూడా బయట పనికి వెళ్లడం లేదు. కాబట్టి మన దగ్గర ఉన్న డబ్బుతోనే మనం జాగ్రత్తగా ఉండాలి!'' అని వంట చేసుకుంటూ అన్నది టైలర్ పని చేసుకునే రాణి తన పిల్లలతో.
''అంటే అమ్మా! ఇక నువ్వు ఈ కరోనా తగ్గే వరకు ఖాళీగా ఉండటమేనా? మాకు స్టోన్‌వర్క్, డిజైన్ వర్క్ చేయడానికి పని లేనట్టేనా?'' అని అడిగాడు పదో తరగతి పూర్తయిన పెద్దోడు ఆకాష్.
''అవును రా!'' అన్నాడు తండ్రి వెంకటపతి ఇంట్లోకి కూరగాయలు తెస్తూనే.
''అయితే అమ్మా! నువ్వు ఎలాగూ ఖాళీ కాబట్టి చెల్లికి, నాకూ మిషన్ నేర్పించు. ఈ లాక్‌డౌన్ సమయంలో చెల్లి, నేను చక్కగా నేర్చుకుంటాం. ఎప్పుడైనా అత్యవసర సమయంలో నువ్వు క్లాత్ కట్ చేసి ఇస్తే మేము వాటిని కుడతాము. నీకు కూడా పని త్వరగా అయిపోతుంది. మేము కూడా నీకు సహాయం చేసినట్లూ ఉంటుంది.'' అన్నాడు ఆకాష్.
''చదువుకోండిరా అంటే మిషన్ నేర్చుకుంటాం అంటున్నారేంటిరా?'' అని కోపంతో అంది తల్లి. ''అలా కాదు అమ్మా'' చదువుని నిర్లక్ష్యం చెయ్యం. రోజులో రెండు గంటలు నేర్పించు. మిగిలిన టైం అంతా చదువుకుంటాం.'' అన్నాడు ఆకాష్. ''ఏం చెల్లి అంతేనా?'' అడిగాడు చెల్లి శ్రావణి వైపు చూస్తూ.
''అవునమ్మా పని నేర్చుకుంటే తప్పేంటి? ఏదైనా మన కోసమే కదా'' అంది శ్రావణి. ఇంటి పరిస్థితులను అర్థం చేసుకొని మాట్లాడుతున్న పిల్లలను చూసి రాణి కంటతడి పెడుతుంటే, ''పోనీలే రాణి! పిల్లలు అన్నది నిజమేగా! నేర్పించు. రేపు జీవితంలో ఉపయోగపడుతుంది'' అన్నాడు వెంకటపతి భార్యను ఓదార్చుతూ. అమ్మ ఆనందంతో పిల్లలిద్దరినీ గుండెలకు హత్తుకుంది...
- లిఖిత్ కుమార్ గోదా,
7658980766.
Dailyhunt
కథను క్రింది లింక్లో చదవొచ్చు 👇👇
http://dhunt.in/adKIJ?ss=wsp&s=pa
https://m.dailyhunt.in/news/india/telugu/prajasakti-epaper-prajasak/ammaku+toduga+-newsid-n197288684?listname=topicsList&index=0&topicIndex=0&mode=pwa
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి