చేపల్ని కాపాడిన తాబేలు ( పిల్లల కథ)
రచయిత:- లిఖిత్ కుమార్ గోదా ,ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
___________________
ఒక చెరువులో చాలా చేపలు, తాబేలు ఉండేవి. అందులో ఒక తాబేలుకి చేపలతో చెలిమి చేయడమంటే చాలా ఇష్టం కానీ ఆ చెరువులోని చేపలు ఆ తాబేలుతో స్నేహం చేసేవి కావు.
ఒకసారి కొన్ని కొంగలు చాలా దూరం నుంచి చేపల వేట కోసం ఆ చెరువు దగ్గరికి వచ్చాయి. ఆ చెరువు లో పుష్కలంగా చేపలు ఉండడంతో ఆ చెరువుకు వెలుపలున్న చెట్ల పైన తమ ఇల్లు నిర్మించుకున్నాయి.
వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే అధిక సంఖ్యలో కొంగలు చేపల్ని వేటాడటం వల్ల చేపల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దాంతో మిగిలిన చేపలన్ని దిగ్భ్రాంతికి లోనయ్యాయి.
వాటి దిగులును చూసిన తాబేలు, చేపలు తనతో స్నేహం చేయనప్పటికీ ఒక శ్రేయోభిలాషులా, స్నేహితునిలా చేపల గురించి విచారం చెందింది.
ఎలాగైనా చేపల్ని ఆ కొంగలు బారినుండి కాపాడి వాటితో నెయ్యం కట్టాలనుకుంది. ఒక ఉపాయం ఆలోచించింది.
మరుసటి రోజు చేపల అన్నింటికీ ఇష్టం లేకపోయినా వాటిని సమావేశపరిచి, తాబేలు"మన చెరువులో మీ చేపల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. కాబట్టి మిమ్మల్ని కొంగల భారి నుండి నేను కాపాడతాను. నేను చెప్పినట్టు చేయండి చాలు. మీలో అనుభవం ఉన్న చేపలు ఎక్కువ సేపు గాలి తీసుకోని నీటి పైకి వచ్చి తేలండి ఆ కొంగలు వచ్చే సమయానికి. నేను నా పథకం ప్రకారం ఈ చెరువుకి మనుషుల వల్ల కరోనా సోకిందని చెప్తాను. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారికి భయపడి ఆ కొంగలు పారిపోతాయి. ఇక వాటి బెడద నుండి మీరు సురక్షితలవుతారు. సమ్మతమేనా?"అంది.
చేపలు అన్నింటికీ తాబేలు ఉపాయం నుంచి మనస్ఫూర్తిగా సమ్మతించాయి.
మరుసటి రోజు కొంగలు వస్తుండగా చేపలకి పిలుపునిచ్చింది తాబేలు.
"దాదాపు ఒక యాభై చేపలు దాకా పైకి తేలుతున్నాయి.
అప్పుడు కొంగల్లో ఒకటి "మనకు ఈరోజు శ్రమ లేదు తమ్ముళ్ళు" అని చెరువులోకి రాబోయేంతలో తాబేలు మిక్కిలి దగ్గుకుంటూ "కొంగ మిత్రులారా! ఈ చెరువులోకి రాకండి. గత వారం రోజులుగా ఈ చెరువులోని జీవరాసులన్నీ దగ్గు, జ్వరం, జలుబు, తలనొప్పి తదుపరి రోగాలతో మరణిస్తున్నాయి. ఊపిరి ఆడడం లేదంట వేటికి కూడాను. మీరు వచ్చి ఒక వారం రోజులు అవుతుంది కదా, ఈ చెరువు దగ్గరకి కొంతమంది మనుషులు వచ్చి దాదాపు ఒక పక్షం రోజులు అవుతుంది. వారికి ఏదో కరోనా వైరస్ ఉందని వారు మాట్లాడుకుంటే విన్నాను. అది చాలా ప్రమాదకరమైన రోగమట. బహుశా నాకు కూడా ఆ రోగం సోకినట్టు ఉంది. బాగా దగ్గు జలుబు జ్వరం ఉన్నట్టే ఉంది. మీ మంచి కోసమే చెప్తున్నాను. దయచేసి ఈ చెరువు దగ్గరకి రాకండి. మీ ప్రాణాలు కాపాడుకోండి.అహ్హు..అహ్హూ"అని అని గట్టిగా దగ్గింది.
"అమ్మో! కరోనా వైరసా? ఇక ఈ చేపలు వద్దు. చెరువు వద్దు. ఆ తాబేలు మామయ్యని చూస్తే నిజంగానే వాళ్ళకి కరోనా వచ్చినట్టుంది. వెళ్లి క్వారంటైన్ లో కూర్చుందాం. పారిపోయీ ప్రాణాలు రక్షించుకుందాం పదండి"అని రెక్కలకు పని చెప్పాయి కొంగలన్నీ.
తమను కొంగల బారి నుండి కాపాడిన తాబేలుకు కృతజ్ఞతలు తెలిపి, అప్పటినుండి దానితో స్నేహం మొదలెట్టాయి చేపలన్ని.
🔱🔱🔱🔱🕊️🕊️🕊️28.07.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి