10, నవంబర్ 2020, మంగళవారం

నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు పుస్తకం పై నేను రాసిన పుస్తక సమీక్ష

 బాలల అక్షర సేద్యం... నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు(పుస్తక సమీక్ష)


పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.




హాయ్ నేస్తాలూ! ఎలా ఉన్నారు.నేను మీ మోనిస్.."లిఖిత్ కుమార్ గోదా"ని. నవంబర్ 14 న మన పండుగ సందర్భంగా మీకోసం మన నేస్తాలు రాసిన ఒక పుస్తకాన్ని పరిచయం చేయబోతున్నాను. పుస్తకం పేరేమిటో చెప్పనా? "నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు". మరి ఆ పుస్తకం విశేషాలేంటో చూద్దామా!

"అచ్చటికిచ్చటి కనుకోకుండా

 ఎచ్చటెచ్చటికో ఎగురుతుపోయే

 ఈలలు వేస్తూ ఎగురుతుపోయే

 పిట్టల్లారా!

పిల్లల్లారా!!..."



 "శైశవగీతి"లో మహాకవి శ్రీశ్రీ కల్లా కపటం ఎరుగని బాలల గురించి చెప్పిన కవిత ఇది. నిజమే పిల్లలు పక్షుల లాంటివారు. ఏ చోటకైనా, ఎక్కడికైనా కేరింతలు పెడుతూ విహరించగలరు. వారు ఉన్నచోటునే పూదోటగా మలచగలరు. ఆనంద లోకాన్ని సృజించగలరు. బాలలు తలచుకుంటే నిండు మనసుతో ఏ పనైనా ఇట్టే ఆకళింపు చేసుకుని, ప్రీతితో చేయగలుగుతారు. అలా వారి అభిలాషకు అక్షరాల రంగులద్ది చక్కని ,చిక్కని కథలు రాశారు నల్లగొండ జిల్లా బడి పిల్లలు. అలా మన తుంటరులు రాసిన కథలను ప్రముఖ పరిశోధకులు, సంపాదకురాలు శ్రీమతి ఉప్పల పద్మ గారు భగీరథ దీక్షతో పుస్తకంగా మనముందుకు తీసుకువచ్చారు.

ఈ పుస్తకంలోని కథల గురించి చెప్పుకునే ముందు ఈ పుస్తకానికి ప్రాణం పోసేలా చేసిన బాల వదాన్యుడు చిరంజీవి శ్రీ రిషి వర్షిల్ నెలకుర్తి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి.
పుస్తక పఠనం ఆవశ్యకత తెలిసి, తన వయసులోని ప్రతిభావంతులైన పిల్లల్ని ప్రోత్సహించాలనే సత్సంకల్పం కలిగి, రాబోయే నవతరం ఉత్తములుగా ఎదగాలనే లక్ష్యంతో, తాను సేకరించిన, సంపాదించిన డబ్బుతో ఈ పుస్తకాన్ని మన అరచేతిలోకి వచ్చేలా చేశాడు. చిన్నతనంలోనే దానగుణాన్ని ఇముడ్చుకున్న రిషీ వర్షిల్ నేటి తరానికి ఆదర్శప్రాయం. ఈ చిరంజీవి ని ఆదర్శంగా తీసుకుని సహాయం చేయదలుచుకున్న వారు ఎందరో ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. భావి తరాన్ని రంగవల్లులతో నింపాలి.

 నలభై ఐదు రత్నాలతో నిండిన ఈ పుస్తకం విజ్ఞాన కోశాగారం వంటిది. ప్రతి కథలో నీతిని, తాము చూసిన జీవితాలకు చక్కని అక్షర రూపాన్నిచ్చారు ఈ చిరంజీవులు. పిల్లలు ఎంత బాగా చేయి తిరిగిన రచయితల్లా కథలు రాశారో, అంతే బాగా చిత్రాలు గీశారు చిత్రకారులు. చిత్రకారుల బొమ్మలతోనే కథలు మనకు అర్థం అవుతూ ఉంటాయి.
ధీరావత్ భూమిక రాసిన" ఆడపిల్ల" కథ "ఆడపిల్లలపై ఇప్పటికీ జరుగుతున్న వివక్ష"పై రాసిన చక్కటి కథ. గంగ వాళ్ళ ఊర్లో ఒక దెయ్యం ఉండడం, ఆ దెయ్యం అందర్నీ భయపెడుతుందని ఊరి వాళ్ళు చెప్పుకుంటే గంగ వినడం, ఆ దెయ్యాన్ని చూడాలని ఒక రాత్రి కుతూహలంతో అడవికి వెళ్లి ఆ దెయ్యాన్ని కలవడం, ఆ దెయ్యం తానొక ఆడపిల్లనని. తన తల్లిదండ్రులకు ఇద్దరూ ఆడపిల్లలు కావడంతో చిన్నదైనా తనను చంపడంతో తాను దెయ్యం అయ్యానని చెప్పడం, ఆడపిల్లని ఎవరూ చంపకూడదనే సదుద్దేశంతో ఆ చుట్టుపక్కలే సంచరిస్తున్నాని చెప్పడం, ఆడపిల్లల్ని ఎవరిని చంపనివ్వకుండా నేను చూస్తాను అని గంగ హామీ ఇవ్వడం, గంగ ఊరి వారిని మార్చే ప్రయత్నం చేయడంతో కథ సుఖాంతమవుతుంది.

వట్టికోట గాయత్రి తన "అసలైన కొడుకు" కథలో. వర్తమాన సమాజాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేసింది. కన్నవారినే కాదనుకునే కొడుకులు ఉన్న ఈ రోజుల్లో , తనకేమీ కానీ రాజవ్వకు కుండపోత వర్షం పడుతున్నప్పుడు రమేష్ ఆశ్రయం ఇవ్వడం, తనను కాదన్న కొడుకులు తనకోసం, తన ఆస్తి కోసం వచ్చినా, రాజవ్వ మాత్రం రమేష్ ని తన నిజమైన కొడుకు గా భావించడం పాఠకుల కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తుంది.

"కొడుకైనా కూతురైనా ఒకటే" కథను తొమ్మిదో తరగతి విద్యార్థిని సుంకర ఉదయశ్రీ చాలా చక్కగా రచించింది.
"మట్టి గణపతి" కథలో పర్యావరణ హితాన్ని కోరి శ్రీవర్ధన్ మంచి కథను అందించాడు. నిజంగా ఇలాంటి మార్పులు పల్లె నుండి మొదలవడం ఆవశ్యకం.
"మార్పు" కథ భలే తమాషాగా సాగుతుంది. నిజంగా ఒక చెయ్యి తిరిగిన రచయితలా కథను లిఖించింది రమ్య చెల్లి. కథ చదువుతున్నంత సేపు కూడా పిసినారిని నిజంగా కళ్ళకు కట్టినట్లు చూపడం, వైద్యుడు పిసినారిని గ్రహించి తెలివిగా వ్యవహరించడం, ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడడం అందరి మనసులను దోచుకుంటోంది.

పాటి భానుజ "స్నేహం గొప్పతనం", శ్రీవిజ"ఐక్యమత్యమే మహాబలం", భవాని "భయం కలిపిన స్నేహం", మరికొన్ని కథలు స్నేహం గొప్పతనాన్ని చాటుతాయి.
"ప్రాయశ్చిత్తం" కథను రాసిన వైష్ణవి సమకాలీన జీవితానికి అద్దం పట్టేలా రచించింది.

శివమణి "తెలివితక్కువ పని" కథను ప్రశంసించకుండా ఉండలేం. అంత చక్కని కథ.

పావని "చిన్నప్పుడే" కథ, సాహితీ "గురుదక్షిణ" కథలు చదువరులను ఆహ్లాదపరుస్తాయి. మంచి నైతికాలను అందిస్తాయి.
"కోటిలింగాలు" కథ రాసిన శ్రీకర్ చాలా చురుకైన ఆలోచనతో అతి జాగ్రత్త ఉంటే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో వివరించాడు.

"నాన్నా తాగకు", "మారిన మనిషి" మద్యపాన వ్యసనమున్న తండ్రులను ఎలా మారుస్తారో వివరించిన కథలు.
ఇలా చెప్పుకోవాలే కానీ, అన్ని బాల రచయితలు తమ స్థాయికి మించి సృజనకు పెద్దపీట వేశారని చెప్పుకోవాలి. అక్కడక్కడ కొందరు బాల రచయితలకు హృదయాల నిండుగా అమలిన ప్రోత్సాహం అందిస్తే సాహిత్యంలో తిరుగులేకుండా ఎదగగలరని నా అభిప్రాయం.

తెలుగు బాల సాహిత్య పుటల్లో ఇంతటి మహత్తర కరదీపికను ఎంతో దీక్షతో, శ్రమపడి వెలువరించిన సంపాదకురాలు ఉప్పల పద్మ గారికి అభినందనలు. అలాగే నవతరం నూతన రచయితలు చక్కని కథలు రాసినందుకు ఇవే నా శుభాభినందనలు. అలాగే అందరూ ఆదరించదగ్గ నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు వయ్యిని మన హృదయ గ్రంథాలయం లో పొందు పరచుకునేలా చేసిన, పాఠశాల ఉపాధ్యాయులు , సహకరించిన తల్లిదండ్రులు, చిరంజీవి రిషి వర్షిల్ అభినందనీయులు. 

            ✍️  పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...