10, నవంబర్ 2020, మంగళవారం

ప్రముఖ సాహితీవేత్త వేంపల్లి రెడ్డి నాగరాజు రచించిన గోరుముద్దలు కథల సంపుటి పై నేను రాసిన పుస్తక సమీక్ష

లేత మనసులకు నూతన నేస్తాలు... రెడ్డి నాగరాజు "గోరుముద్దలు"






బాలసాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు మొలకెత్తినా పిల్లలకు విలువలు, నీతిని, చైతన్యాన్ని నేర్పేది మటుకు కమ్మని కథలే. వయసురీత్యా పెద్దలైనా, పిల్లల్లో జాగృతి కోరి, భావి తరానికి బలమైన పునాది వేయాలని అంకితభావంతో , పిల్లల వయస్సుకు దిగొచ్చి, వారికి అర్థవంతంగా, వారు మాట్లాడుకునే భాషలోనే, కథను అందరిలా(కొందరు రచయితలు) చెబుతున్నట్లుగా కాకుండా, కథను కళ్లముందు చూపిస్తూ జరుగుతున్నట్లు రాయడం, ఆ కథల్లో చదువరి బాలలే ఉన్నట్లుగా రాయడం, పరిస్థితుల రీత్యా సమకాలీన జీవనానికి అద్దం పట్టేలా కథలు అల్లడం బాల సాహితీవేత్తలకు కత్తి మీద సాము లాంటిది.


కానీ పరిశుభ్రమైన, పరిపూర్ణమైన సమాజం ఖచ్చితంగా వెలుగులోకి తీసుకురావాలనే సత్సంకల్పం ఉన్న రచయితలకు మాత్రం పైనున్న మాటలు "వెన్నతో పెట్టిన విద్య"ని చెప్పాలి.


రచయిత వేంపల్లి రెడ్డి నాగరాజు గారు వృత్తిరీత్యా ఎల్ఐసి ఉద్యోగి అయినప్పటికీ, సాహిత్యానికి తరగని విజ్ఞాన, నీతుల కోశాన్ని అందించాలనే సులోచనతో కథా,కవిత,ఇతర సాహిత్య ప్రక్రియల్లో తమ ఎనలేని అక్షర సేద్యాన్ని, సంపదను అందిస్తున్నారు.తన కలం నుండి వెలలేని సాహిత్యాన్ని ఇస్తున్నప్పటికీ ఇంకా ఏదో అందించాలనే తాపత్రయం. ముఖ్యంగా పిల్లల జీవితం మలినం లేని సమాజంలో తిరుగాడలనే లక్ష్యంతో బాల సాహిత్యంలో కూడా నూతన ఒరవడి ఆలోచనలతో, ప్రయోగాలతో నిరంతరం కృషి చేస్తున్నారు.


  గత ముప్పయేళ్ల సాహిత్య అనుభవం ఉండటం చేత ప్రౌఢ సాహిత్యములో రాణిస్తూనే, ఇటు

బాలసాహిత్యంలో ఇప్పటికే చిన్నారి పొన్నారుల కోసం "బామ్మలు చెప్పని కమ్మని కథలు, బొమ్మలు చెప్పిన కమ్మని కథలు, పాల బుగ్గల- పసిడి మొగ్గలు" వంటి బాల సాహిత్య పోషణ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.రూపాయికే కథలు అంటూ బాలల కథలున్ధ ఫ్లిప్ బుక్ లు దాదాపు లక్షకు పైగా అమ్ముడుపోయాయి.ప్రౌఢ సాహిత్యంలో వీరు రాసిన రచనలపై కొందరు పి.హెచ్ డీ లు చేస్తున్నారు.

      ప్రస్తుతం గోరు ముద్దలు కథల పుస్తకం వెలువరించారు. బాలల మనసులకు నీతుల కిరణాన్ని ప్రసరింపజేయడమే కాకుండా, పాతదనం నుండి కొత్తదనాన్ని ఎలా సృష్టించుకోవచ్చో తెలియపరిచారు.నేటి వర్ధమాన సాహితీవేత్తలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నారు.


బాగా ప్రాచుర్యం ఉన్న పంచతంత్ర కథలు, పేదరాశి పెద్దమ్మ కథలనే తీసుకొని కొత్త తరహాలో సమకాలీన జీవితానికి అనుగుణంగా కథలు లిఖించారు.

ఇందులో ఉన్న 11 బాలల కథలు నవతరానికి దొరికిన ఆణిముత్యాలు అని చెప్పుకోవచ్చు.


ఈ గోరుముద్ద వయ్యి లోని మొదటి కథ "దేవత అనుగ్రహం" . ఇందులో ఒక వ్యక్తి కట్టెలు కొట్టుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. ఒకరోజు చెట్టెక్కి పెద్ద కొమ్మలను నరుకుతూ ఉండగా తన చేతిలోని గొడ్డలి జారీ వాగులో పడిపోతుంది. తన తాతల కాలంలో వాగులోని దేవత తన తాత గొడ్డలి ని పైకి తీసుకు వచ్చిన విషయం గుర్తుకు రావడం, ఎంతసేపు వేచి చూసినా దేవత ప్రత్యక్షమవ్వకుండా గొడ్డలిని ఇవ్వకపోవడంతో అసహనం చెంది ఆ వ్యక్తి గట్టిగా అరవడం, అటుగా పోతున్న ఓ కోతి ఆ వ్యక్తి అరుపులు విని, అతనితో"నువ్వు చెట్లు నరకడం వలన దేవత ప్రత్యక్షమవడం లేదు. ఎందుకంటే చెట్లను నరికి, వనాలను నాశనం చేసేవారు అంటే దేవతకు చాలా కోపం. ఇప్పుడు కట్టెలు అవసరం లేకుండా గ్యాస్ పై, సోలార్ కుక్కర్ లల్లో వంట వండుకునే సౌలభ్యం ఉంది. పర్యావరణానికి హాని తలపెట్టకుండా పట్టణానికి వెళ్ళి గోబర్ గ్యాస్, సోలార్ పవర్ ల ఏజెన్సీ ప్రారంభిస్తే దేవత నిన్ను అనుగ్రహిస్తుంది"అని బదులివ్వడం, ఆ కట్టెలు కొట్టుకునే వ్యక్తి లో మార్పు రావడంతో చక్కని ముగింపునిచ్చారు రచయిత.


"కాకి-కడవ" కథలో , మండువేసవిలో బాగా దాహంగా ఉన్న ఓ కాకి ఓ కడవలోకి తొంగి చూస్తే నీళ్లు ఉంటాయి. అయినా ఆ కాకి నీళ్ళు త్రాగడానికి మరో వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఇది గమనించిన మరో కాకి మన తాతల కాలంలో మాదిరి కడవ అడుగున కాక నిండుగా నీళ్ళున్నాయి. పైగా గులకరాళ్లు వేసాము కూడా లేకనే నీళ్లు అందుబాటులో ఉన్నాయి కదా! మరి నీళ్లు తాగకుండా నే వెళ్ళిపోతున్నావ్ ఎందుకు అని ప్రశ్నిస్తుంది. ఆ కడవలో నీళ్లు మలినంగా ఉన్నందున త్రాగడానికి తను ఆసక్తి చూపడం లేదని, ఒకవేళ త్రాగితే ఎన్నో జబ్బులతో బాధ పడాల్సి వస్తుందని, మొదటి కాకి రెండో కాకికి చెబుతుంది.

తద్వారా రచయిత ఈ కథలో పిల్లలకి త్రాగడానికి ఎప్పుడూ పరిశుభ్రమైన నీటికే ప్రాధాన్యం ఇవ్వమని సూచిస్తున్నాడు. ఏదైనా పని చేసే ముందు తొందరపడి చేయకూడదని, కొంచెం ఆలోచించి చేస్తే మంచిదని ప్రయోగించిన చక్కని నీతి కథ.


మనకు తాతల కాలం నుండి తెలిసిన "పిల్లి మెడలో గంట" కథను నవతరానికి కొత్త సువాసన వచ్చేలా లిఖించారు. పెద్ద సంఖ్యలో ఉన్న రైతు ఇంట్లో ఎలుకలను, చప్పుడు చేయకుండా రోజుకు ఒక దాన్ని పిల్లి తినేయడం, రోజురోజుకు తమ సంఖ్య దిగిపోవడం, పట్టణంలోని కళాశాలలో చదువుతున్న చిట్టెలుక సెలవులకు ఇంటికి వచ్చి విషయం తెలుసుకోవడం, రైతు కొడుకు పట్టణం నుండి వచ్చిన సెంట్ బాటిల్ ను అటక పై కూర్చొని పిల్లి పై గుమ్మరీయడం వలన ఆ పిల్లి దేహం నుంచి వచ్చే పరిమళం ద్వారా ఎలుకలు ప్రమాదాన్ని ముందే గ్రహించి తప్పించుకోవడంతో కధ ముగుస్తుంది. చదువుకుంటే ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా పరిష్కరించుకోవచ్చునని నీతులు ఇమిడ్చి రాసిన కథ.

"మూర్ఖత్వం" కథలో 'మనకు హాని చేయని ఏ ప్రాణికైనా మనం హాని తలపెట్టకూడదని, అలా కాదని అల్లరి చేష్టలతో పర జీవులకు హాని తలపెడితే ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో' చక్కగా వివరించిన బాలకథ.


ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కథలన్నీ మానవ జీవితానికి చక్కని సందేశాత్మక రచనా ప్రయోగాలు. కథలన్నింటినీ సృజనాత్మకంగా రచించిన రచయిత రెడ్డి నాగరాజు గారి ప్రతిభను అభినందించకుండా ఉండలేం. తన మేధాశక్తికి పదునుపెట్టి పిల్లల కోసం చక్కని బాల కథలు రాశారు. వారి ఈ శ్రమ పిల్లల వరకు చేరితే అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు. వారికే కాదు ఏ బాల సాహితీవేత్త కైనా.

రేపు మన కళ్ళు శుభ్రంగా ఉండి, దేశాన్ని నవ్యంగా రూపొందించాలంటే ఇటువంటి పొత్తాలను పిల్లలు చదవడం ఆవశ్యం. తల్లిదండ్రులు లేత మనసులకు ఇటువంటి కథలు చేరవేయడానికి ప్రేరేపించాలి. అప్పుడే నవభారతం నిర్మితమవుతుంది. జై బాలసాహిత్యం!!


పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్.

బనిగండ్లపాడు గ్రామం ఎర్రుపాలెం మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం-507202.


ప్రతులకు:- 

వేంపల్లి రెడ్డి నాగరాజు,

ఎల్.ఐ.సి.ఆఫ్ ఇండియా,

 రాయచోటి శాఖ, కడప (జిల్లా) - 516269

మొబైల్:- 7989928459,9985612167.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...