22, నవంబర్ 2020, ఆదివారం

స్వర్గీయులు ప్రముఖ సాహితీవేత్త రెడ్డి నాగరాజు వేంపల్లి గారు రచించిన "పాల బుగ్గలు పసిడి మొగ్గలు" పుస్తకం పై నేను రాసిన పుస్తక సమీక్ష

 

నీతి కథల చిట్టడవి... రెడ్డి నాగరాజు"పాలబుగ్గలు పసిడి మొగ్గలు"(పుస్తక సమీక్ష)

పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.




    భిన్న సాహితీ ప్రక్రియలయిన కథ, కవిత్వం, నాటకం, వ్యాసం, విమర్శ, సమీక్ష వంటి అంశాలలో కొందరు సాహితీవేత్తలు ఏదో ఒక ప్రక్రియలో మాత్రమే రచనలు సాగించి లబ్దప్రతిష్టులు అవుతారు. అయితే వీరిలో కొంతమంది మాత్రం దాదాపు అన్ని ప్రక్రియలతో ప్రవేశం కలిగి సాహితీ ప్రియులను అలరించడం ద్వారా విశ్వవిఖ్యాతులవుతారు.
ఈ కోవలోకి వచ్చే వారు అక్కడక్కడా చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తారు. వీరిలో అన్ని సాహితీ ప్రక్రియలతోనూ సంబంధం కలిగి రచనలు చేస్తున్న సాహితీవేత్తగా వేంపల్లి రెడ్డి నాగరాజు గారిని పేర్కొనవచ్చు.


గత మూడు దశాబ్దాల కాలంగా పైన పేర్కొన్న అన్ని సాహితీ ప్రక్రియలలో పయనిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాలలోని సాహితీ ప్రియులను అలరిస్తున్న రచయితగా నాగరాజు గారిని పేర్కొనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.
తన కలాన్ని ఆకారం లో చిన్నదైనా ఒక ఎడారి రోజా చేసుకుని, గుత్తులు గుత్తులుగా సాహిత్యాన్ని పూయించాలనే ఆశ రెడ్డి నాగరాజు గారిది. తన సూక్ష్మ లిఖితాలతో ఎడారి లాంటి ఈ జగతిలో తనొక ప్రత్యేకం కావాలని కొత్త ఒరవడితో, వ్యూహాలతో మినీ కథలు, మినీ కవిత్వాలు వంటి రచనలు చేశారు.

 ప్రత్యేకించి బాల సాహితీవేత్తగా బాలల కోసం రాసే కథలలో గతంలో ఎవరూ చేయని వినూత్న ప్రయోగాలు చేయడం ద్వారా ఈ రచయిత తనదైన పేరును సొంతం చేసుకున్నారు. "రూపాయికి ఒక కథ" అంటూ దాదాపు లక్ష కాపీలు దాకా అమ్మారు. బాలసాహిత్యంలో ఈ-తరం బాలల కోసం "కొత్తబాట"ను నిర్మించారు. పిల్లల కోసం "బామ్మలు చెప్పని కథలు, బొమ్మలు చెప్పిన కథలు, గోరుముద్దలు, నవతరం బాలల నీతి కథలు"వంటి కథా సంపుటాలను వెలువరించారు. వీరు రాసిన బాలల కథలను ఆంగ్లంలోకి అనువదించి రెయిన్బో నామంతో ఒక పుస్తకాన్ని వెలువరించారు ప్రముఖ రచయిత్రి బి.ఎస్. పద్మావతి. అలా వారి కలం నుండి జాలువారిన కథాశిల్ప సంపుటి "పాల బుగ్గల -పసిడి మొగ్గలు".

ఈ పుస్తకం నేటితరం పిల్లలకు దొరికిన "అక్షరాల పాలపుంత" అనుకోవచ్చు. ఇందులోకి పిల్లని ఒక్కసారి చేర్చితే వారు నీతులతో దేహాన్ని శుద్ధి చేసుకోగలుగుతారు.
మొత్తం రెండు చేతులకి ఉన్న వేళ్లను కలిపితే ఇందులోని కథలు సంఖ్య. పుస్తకంలోని కథలు ఒక్కొక్కటి ఒక్కొక్క తరహాలో నడుస్తూ, పాతదానికి కొత్త రూపును చేర్చి, రసగుల్లల్లా కొత్త రుచులు చూపిస్తూ, పంచతంత్రాలను నవతంత్రాలుగా మార్చి నోరూరిస్తాయి.

యుక్తి కథలో మనకు తెలిసిన పంచతంత్ర కథ అయినా "ద్రాక్ష నక్క"ను తీసుకుని అందులో నక్క ద్రాక్షాల కోసం ఎదురు చూసే భాగం వరకు తీసుకుని తరువాత చమత్కార సృజనకు పదును పెట్టారు రచయిత. నక్క ద్రాక్ష పండ్ల కోసం చెట్టుక్రింద ఉండడం, ఒక కాకి చూసి ఏంటి ఎక్కడున్నావ్ అని అడగడం, పైన ఉన్న ద్రాక్ష పళ్లను పట్టుకుని ఊగితే స్వర్గం చూడవచ్చునని, అలా పులి స్వర్గం చూస్తాను స్నానం చేసి ఇప్పుడే వస్తాను అంటే ఇక్కడ కాపలా కాస్తున్నాను అని నక్క అనడం, నేను స్వర్గాన్ని చూస్తానని కాకి చెప్పడం, నక్క తొలుత కాదనడం, బ్రతిమాలగా ఒప్పుకోవడం, కాకి ద్రాక్షపండ్లను పట్టుకుని ఊగడం, అప్పుడు ద్రాక్ష పండ్లు రాలడం, నక్క ఆశ ఆకలి తీరడం, కాకి తిక్క కుదరడంతో కథ నవ్వులతో ముంచెత్తి కంచికి చేరుతుంది.
"శక్తి లేని చోట యుక్తితో ఎలా విజయం సాధించవచ్చు"నని చూపించిన కథ ఇది.

"నిజమైన గెలుపు" కథలో మనకు తెలిసిన కుందేలు తాబేలు కథనే తీసుకొని, అవి రెండు పోటీ పెట్టుకొని కుందేలు విశ్రాంతి తీసుకునే భాగందాకా తీసుకొని, తరువాత తాబేలు,కుందేలును నిద్రలేపి "గెలుపు దిశగా నడువు,విజయం సాధించాక కావాలంటే విశ్రాంతి తీసుకుందువు గాని" అని అనడంతో చదువరులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 
"పోటీదారులను ప్రోత్సహించడం కూడా గెలుపొందడంతో సమానం" అని నీతిని ఇచ్చే చక్కటి కథ.

ఏడుగురు రాజకుమారుల కథను "చేపల వేట" కథగా తీసుకొని పర్యావరణ హితాన్ని, చెట్లు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు నేర్పించారు రచయిత వేంపల్లి నాగరాజు గారు.

మనకు పంచతంత్రం నుంచి తెలిసిన "ఆవు పులి కథ" (పుణ్యవతి కథ)ను తీసుకొని ముందుచూపు ఎంత గొప్పదో వివరించారు.

ఇలా దశ ఆణిముత్యాలతో ముస్తాబైన ఈ కథా సంపుటి బాలల మదిలోకి చేరవలసిన మంచి పుస్తకం. పిల్లల కోసం కొత్త తరహాలో కథలు రాయడంలో రచయిత రెడ్డి నాగరాజు గారు సఫలీకృతులయ్యారు. బాలసాహిత్యంలో ఇదొక నిత్యనూతన ప్రయోగమని చెప్పుకోవచ్చు. ఇటువంటి మంచి పుస్తకాన్ని మన కళ్ళల్లోకి తీసుకొచ్చిన రచయిత వేంపల్లి రెడ్డి నాగరాజు గారికి అభినందనలు. ఇటువంటి బాలల కథలు పెద్దలే చదివి పిల్లలచేత చదివించి వారిని నవభారతం వైపు నడిపించే ప్రయత్నం చేయాలి. అప్పుడే రచయితల ఆశయాలు, లక్ష్యాలు నెరవేరుతాయి. జై బాలసాహిత్యం!!


పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్.
*నివాసం*:-బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507202.

ఫోన్:- 9949618101,7658980766


ప్రతులకు:- 
వేంపల్లి రెడ్డి నాగరాజు,
ఎల్.ఐ.సి.ఆఫ్ ఇండియా,
 రాయచోటి శాఖ, కడప (జిల్లా) - 516269
మొబైల్:- 7989928459,9985612167.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...