9, జూన్ 2021, బుధవారం

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం

••••••••••••••

నా ఏడో ఏటా,
మా నాన్నకి మధుమేహం వచ్చి
మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు,
అమ్మ మా బతుకు మొక్కలను
తన భుజాల పెరట్లో పెంచుకోవడం మొదలెట్టింది.

మా బతుకు మొక్కలను పరమాన్నాలతో పండించడానికి, 
అమ్మ కుట్టు మిషన్ తో దోస్తీ కట్టింది.

అప్పటి నుంచి
మా ఇంట్లో
అమ్మ నాన్నై బరువు మోయడం,
నాన్న అమ్మై ఇంటిని కాయడం,
మా ఇద్దరి జీవితాలు 
కొత్త అవతారంతో వెలిగాయి..

అందరి బాధ్యతాయుత తల్లిలాగే
అమ్మకి కూడా సూర్యోదయం కంటే ముందే
కనురెప్పల తలుపులు తెరుచుకుంటాయి..

తలంటు స్నానం చేసుకొని
తులసమ్మని పూజించడం అమ్మ రోజు విధి.

దర్జీ అయిన అమ్మకి,
కత్తెర, సూది, దారం ,కొలతలు టేపు
దేహంలో అవయవాలు.
కుట్టు మిషన్ శరీరం..

నాట్లు వేసేటప్పుడు భూదేవిని 
మొక్కుకునే హాలికునిలాగా,
పొద్దున్నే కుట్టు మిషన్ ఎక్కగానే,
"మాకు అన్నం పెట్టే తల్లి..
నీకు వందనాలు" అంటూ
కుట్టు మిషన్ ని ఆరాధ్యదైవంగా, 
పంట పండించుకునే పైరులా భావిస్తుంటే,
అమ్మ నుంచి
"పని గౌరవం" మా గుండెల్లో మొలుస్తుంది.

డీజు ముక్కల సహాయం తీసుకోదసలు,
అమ్మకి తన కుడిచేతి బొటనవేలి గోరే,
తన మార్కర్...

ఉలి శిల్పి చేతిలో ఎలా ప్రేమతో ఒదిగి పోతుందో, 
అమ్మ చేతిలో కత్తెర కూడా అంతే..
చేతి కత్తిర అమ్మకు గాజుబొమ్మ లాంటిది.
కింద పడిపోకుండా ఎంత జాగ్రత్త పడుతుందో..

ఎప్పుడూ మొండివైఖరిగా వ్యవహరించే
మా అన్నదమ్ముల్లాంటి సూది దారాలను చూసినా,
అమ్మకు విసుగసలు రాదు ఎందుకో..?
తనకు మేమంటే ఎంత లాలనో,
తన కుట్టు మిషనన్నా, సూది దారాలన్నా అంతే..
అమ్మ సహనం సూది దారాల గొడవ
సద్దుమణిగేలా చేసినప్పుడే
నాకు బోధపడుతుంది...

హెడ్ చక్రానికి, స్టాండ్ చక్రానికి
తాడు నాగలి తొడిగి,
దుస్తులను సాగుచేస్తూ
అమ్మ "కుట్టు ఎవుసం" చేస్తుంది..

కొలతల అంశం తీసుకోకుండా
ప్రేమతో సూదికి దారానికి స్నేహం కలిపి
యంత్రం కన్నా మిన్నగా ఆ కాళ్లు చేతులు,
క్షుణ్ణంగా ఆ చూపులు వేగంతో,
మోడల్ డ్రెస్సులను, జాకెట్లను కుట్టేసి
అందంగా ఒంటిని కప్పేస్తాయి.

పొద్దున్నుంచి సాయంత్రం వరకు
కూర్చొని పనిచేసే అమ్మని చూస్తే,
తపస్సులా అనిపిస్తుంది 
అమ్మ పని తీరు..
రాత్రి పూటే,
అన్నం మెతుకులు, మంచినీళ్లు
అమ్మ ముఖాన్ని చూసేది..
పొద్దంతా బట్టలోళ్ళు అమ్మను 
తినేస్తూ, తాగేస్తారు కదా..

శుభకార్యాలప్పుడు
బ్లౌజుల సదనానికి
రాత్రి ఆకాశంలో నుండి
రంగు రంగుల చంకీలు కోసుకొచ్చి,
లైటింగ్ అమర్చుతుంది.
అప్పుడప్పుడు అమ్మ వెంట
నేను,తమ్ముడు చంకీలను అమర్చే వాళ్ళం..
ఎప్పుడూ
అది మా జీవితాలలో
మిగిలిపోయే ఆత్మీయ అనుభూతి..

ఎండాకాలంలో
విరగ కాసిన మామిడి పళ్ళలా
మా ఇళ్లు చెట్టు నిండా,
గదుల కొమ్మలకి,
బట్టల మామిడి పళ్ళు ఉంటుంటాయి..
మా జీవితాలు విరగపండి,
పువ్వులా విరబూసేది కూడా అప్పుడే మరి..

పండుగైన, పబ్బమైనా
పెళ్లిళ్లైనా, పేరంటాలైనా
ఊరంతా అమ్మ కుట్టిన హరివిల్లులు ధరించి,
మురిసిపోతుంది.
కానీ అమ్మకి,
మా బ్రతుకు మొక్కల బాధ్యత యాదొచ్చి
ముక్క చీరలను ముత్యాలుగా చే(చూ)సుకుంటుంది..

నా బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువులు చదవాలని,
నలుగురిలో గొప్పగా నవ్వుతూ ఉండాలని,
మనసులో అనుకొని,
వాళ్లని వీళ్ళని చూసి,
వాళ్లు వీళ్లు చెప్పింది ఆలకించి,
అమ్మ తన కుట్టు ఎవుసాన్ని,
రాత్రి కూడా పండించడం మొదలెట్టింది.
అప్పుడు నాకు పదేళ్లు..
ఒకో రాత్రి అలసటొస్తే,
కుట్టు మిషనే అమ్మ నిద్రించే
నవ్వారు మంచం అవుతుంటుంది..

కొన్ని కళ్లకు అమ్మ కాయకష్టం,
అత్యాశ లాగా అర్థమవుతుంది కానీ,
ఆ అత్యాశ లో ఎంత గొప్ప బాధ్యత దాగుందో
అది మా ముగ్గురికే ఎరుక..

నిన్నటి వరకు అమ్మ మాకోసం "కేవలం దర్జీ",
ఈరోజు,
టైలరింగ్ మాస్టర్ అయ్యింది.

మాకు
అమ్మ, అమ్మ మాత్రమే కాదు
బాధ్యతలు చూసే
నాన్న కూడా..

లిఖిత్ కుమార్ గోదా., ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.

18/12/2020.

8, డిసెంబర్ 2020, మంగళవారం

లిఖిత్ కవనాలు

లిఖిత్ కవనాలు 


కపోతాలు

కవిత్వాలయ్యాయి..

శాంతిని అన్వేషిస్తూ..

🌻

కొత్త చెట్లు

పుట్టుకొస్తున్నాయి..

కవిత్వాల కొత్త పరిమళం జగితికి చేరవేయడానికి!

🌻

రాతలతో (రచనలు) పత్రికలు.,

కొన్ని నిండుతాయి,

కొన్ని ఎండుతాయి,

కొన్ని మండుతాయి...

🌻

30, నవంబర్ 2020, సోమవారం

సాహితీ సాగరం ఫేస్బుక్ గ్రూప్ కవితాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన కవితా ప్రక్రియ పదబాణీ-3 విజేతలలో నేను ఒకడిని..

 సాహితీ సాగరం ఫేస్బుక్ గ్రూప్ కవితాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన కవితా ప్రక్రియ పదబాణీ-3 కవితా పోటీలో నన్ను కూడా విజేతగా నిలిపినందుకు నిర్వాహకులకు మరియు అడ్మిన్ గార్లకు ధన్యవాదాలు.. 

ఫలితాలు...
#పదబాణీలు
రూపకర్త:- చెన్నా సాయి రమణి గారు

 # కవిత్వం #

కన్నుల్లో
కన్నీరే
కరుణే
కోవెల్లో
కోనేరే
కైతౌను
(కవిత్వం)

💥💥దీపాల దీపావళి💥💥

దుష్టుల్ని
దహించే
ధైర్యంగా
దివంతా
దీపాల
దండిగా
(దివ్యంగా).

🌿🌿🌿🌿🌿
✍️ లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.
బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా-507202
ఫోన్:- 9949618101

#బాటసారులకు నమస్కారం 🙏.

#పదబాణీ -3వ కవితాపోటీని విజయవంతం చేసిన ప్రతి బాటసారికీ ప్రత్యేకంగా ధన్యవాదములు🌹🎉.

#నూతన విధానమైననూ మీరందించిన ప్రోత్సాహం, కార్యక్రమాన్ని నడపడానికి కావాల్సిన అభిమానం అందజేసిందనడంలో ఎలాంటి సందేహం లేనే లేదు. 
ఈ ప్రయత్నాన్ని ఇలాగే విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. 
ఇక 
#విభిన్న కోణాలలో మీరందించిన
#పదబాణీలలో 
#మాకు ఉన్న పరిమిత పరిజ్ఞానంతో క్రింద కనబరిచిన పదబాణీలను #విజేతలను ఎన్నుకోవటం జరిగింది 
నిజం చెప్పాలి అంటే అందరూ అద్భుతంగా రాసారు 
విజేతలను ఎన్నుకోవాలి కాబట్టి ప్రకటిస్తున్నాము .
చిన్న చిన్న పొరపాట్లు చేయటం వల్ల #కొద్దిమంది విజేతలుగా నిలవలేకపోయారు. 
ఇక విజేతల వివరాలకు వస్తే 

#పదబాణీల విజేతలు.. 
పదబాణి -3విజేతలు

1)లిఖిత్ కుమార్ గోదా గారు 
2)అప్పాశ్రీ గారు 
3)పిల్లి హజరత్తయ్య గారు 
4)కమలశ్రీ గారు 
5)విష్ణుప్రియ గారు 
6)డా. మరుదాడు అహల్యాదేవి గారు 
7)ఆనిరాజ్ కూచిపూడి గారు 

#సమీక్షలు 

#లిఖిత్ కుమార్ గోదా గారు 



కన్నుల్లో కన్నీరు గురించి చెబుతూనే కోవెల కోనేరు పవిత్రం లాంటిది కవిత్వమంటూ కవిత్వ స్వచ్చదనాన్ని తమదైన మాటలలో తెలిపారు. అభినందనలండి  

#అప్పాశ్రీ గారు 

బాలలు బ్రతుకు బీటబారితే భారత భవిష్యత్ ప్రశ్నర్థకమే సుమా అంటూనే తరువాత ఏంటి అని సమాజాన్ని ప్రశ్నిస్తూ.. ఆలోచనలో పడేసిన విధానం బాగుందండి. అభినందనలండి  

#పిల్లి హాజరత్తయ్య గారు 

చెడును, చీకటిని చెరిపే శక్తి చైతన్యంలో దాగుందని.. అందరిలో కదిలే చైతన్యంతోనే చీకటిని చెరిపేయచ్చునని హిత బోధ చేస్తూ.. చిత్రమే అంటూ ఆలోచనలో పడేసే తీరు బాగుందండి. అభినందనలండి 

#కమలశ్రీ గారు 

నారాణి నాహృదయ నివాసమే అంటూ నీకోసం నీలాల నింగికి నిచ్చెన వేస్తా అంటూ చెప్పే విధానం బాగుందండి. అభినందనలు 

#విష్ణుప్రియ గారు 

వేకువ విరబోయటం వనితకు వరమవుతుందని ఆ వరం ముంగిట వచ్చి వాలుతుందని అనటం బాగుందండి. అభినందనలండి 

#డా. మరుదాడు అహల్యాదేవి గారు 

సర్వేజనా సుఖినోభవంతు అనే భావనతో 
కరుణను కురిపిస్తూ కృపా దృష్టితో కాపాడమని జగతిని కాపాడె జగజ్జననైన కామాక్షిమాత కు విన్నవించుకునే విధానం బాగుందండి. అభినందనలండి 

#ఆనిరాజ్ కూచిపూడి గారు 

బేధభావాలను విడిచి జీవితాన్ని సాగించు అంటూనే బ్రదిమి బుడగ లాంటిదని వైషమ్యాలు విడిచి ఎఱుకతో ఆనందంగా జీవించమని చెప్పే విధానం బాగుందండి. అభినందనలండి 

#నియమాలు అనుసరించి చక్కని భావాలను కూర్చి చేర్చి పదార్చన చెయ్యండి విజేతలుగా నిలవండి. 

మీ ఆత్మీయ సోదరి 

కుమారి చెన్నా సాయిరమణి 

కవితాలయం 

ధన్యవాదములు 🙏🙏🙏

కవికులం ఫేస్బుక్ గ్రూపు వారు నిర్వహించిన నానీల పోటీ (21 వ పోటీ) కోసం నేను రాసిన నానీలు

👉👉 అంగవైకల్యం👈👈


1)అంగవైకల్యం
దేహానికే ...!
సు(ఆ)లోచనలకు కాదు
కదా నేస్తమా!

2)సంకల్ప బలం
అంగవైకల్యంతో నైనా
అనూరుడిని, 
ఓ మిల్టన్ని చేస్తుంది..

3)నల్గురికి నువ్వే
ఆదర్శం
ఆత్మశుద్ధి నింపుకో
అంగవైకల్యం మర్చిపో..!

4)అంగవైకల్యం అని
జాలిచూపకు
చేతనైతే
ప్రోత్సహించు...!

5)శారీరకంగా
అంగవైకల్యమే
ఆత్మస్థైర్యం లో
అన్నింటా మిన్న...!

లిఖిత్ కుమార్ గోదా., ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.

29, నవంబర్ 2020, ఆదివారం

ఉట్నూర్ సాహితీ వేదిక ఆధ్వర్యంలో వెలువరించిన బాలల హక్కుల పరిరక్షణ అనే అంశంపై నేను రాసిన మినీ కవిత...

 ఉట్నూర్ సాహితీ వేదిక ఆధ్వర్యంలో వెలువరించిన బాలల హక్కుల పరిరక్షణ అనే అంశంపై నేను రాసిన మినీ కవిత...

సహకరించిన ఆత్మీయులు శ్రీ ఆత్రం మోతిరామ్ అన్నయకి, జాదవ్ బంకట్ లాల్ గారికి,ఇతర కార్య నిర్వాహకులకు నా మనః పూర్వక కృతజ్ఞతలు మరియు అభినందనలు...

గమనిక:నియమాలను పరిశీలించగలరు

*ఉ.సా.వే ద్వైమాసిక(అక్టోబర్-నవంబర్) సాహితీ అంతర్జాల సంచిక:*

*● మినీ కవితలు ఆహ్వానం:●*

*అంశం:బాలల హక్కుల పరిరక్షణ-మన కర్తవ్యాలు*

*నియమాలు:-*
★ *మినీ కవిత 10 వరుసలు మాత్రమే ఉండాలి.*

*●మీ మినీ కవిత పంపే విధానం:*

*1.కవిత శీర్షిక:* ××××××××××××××××××××××
*2.కవిత (10 వరుసలు)* 
1.×××××××××××××××××××××
2.×××××××××××××××××××××
3.×××××××××××××××××××××
4.×××××××××××××××××××××
5.×××××××××××××××××××××
6.×××××××××××××××××××××
7.×××××××××××××××××××××
8.×××××××××××××××××××××
9.×××××××××××××××××××××
10.××××××××××××××××××××
*పేరు:××××××××××××××××*
*చిరునామా:××××××××××××*
*సెల్:0000000000*
3..ఫొటో 👤
5.హామీ పత్రము(పేపర్ పై రాసి ఫొటో తీసి పంపాలి)
★ఫొటోకు అనుసంధానం చేస్తూ మీ పేరు రాయాలి.
*:! గమనిక:-*
*-ఉసావే నియమాలను పాటిస్తూ కవితలు రాయవలెను.:!/నియమాలను నిర్లక్ష్యం చేస్తూ మీ కవితలు ఉంటే స్వీకరించబడవు.:!*

*చివరి తేది:11.11.2020,నుండి 13.11.2020 మధ్యాహ్నం 12:00 గంటల వరకు.*

*ఈ క్రీంది వాట్సప్ లింక్ లో ప్రవేశం పొంది మినీ కవిత పంపవలెను*










ఉసావే ధ్వైమాస పత్రిక

అంశం:- *బాలల హక్కుల పరిరక్షణ... మన కర్తవ్యం*


కవితా శీర్షిక:- *కదలాలి బాలల హక్కుల కోసం*


మనమంతా చేతిలో చెయ్యేసి కదిలితేనే
బొబ్బలు పండిన బాలల చేతులకున్న
బానిస శ్రామిక లోక సంకెళ్లు విరిగిపడేది.
కన్నీళ్లను తుడిచి,
బాలల హక్కులకు విలువిచ్చి బాధ్యతాయుతంగా పోరాడాలి,
చెమటతో తడిచిన దేహాల నుండి
పట్టిన పలుగు పార విసిరేసి,
చదువులమ్మ ఒడిలో చేర్చాలి మనమంతా.
బాలల హక్కులను గౌరవించే మన చేతులే
రేపు నవ్య దేశాన్ని రూపొందించేది.

కవి:- _*లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం*_ మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల.

*చిరునామా*:-
బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ-507202

హరివిల్లు నూతన లఘు కవితా ప్రక్రియ సృష్టికర్త శ్రీ మామిడి రమేష్ గారి తొలి హరివిల్లు పుస్తకం"అక్షర జలపాతాలు" పుస్తకంలో నేను రాసిన ముందు మాటలు...

  •  కదిలించే కవనాలు... "హరివిల్లు"ల అక్షర జలపాతాలు



తరి
ముందుకు నడుస్తున్న కొద్దీ తెలుగు సాహితీవనంలో కొత్త కొత్త మొలకలు, మొక్కలు ఉద్భవిస్తూ కవన పరిమళాలను, కిరణాలను వెదజల్లుతున్నాయి.
తెలుగు భాషా ఘనతను సుస్థిరంగా నిలపాలనే ఆశయంతో, కవిత్వాన్ని సాధారణ జనుల రసన వద్దకు తీసుకెళ్లి, కవిత్వంపై మక్కువ కలిగేలా చేసి, పాఠకులు సైతం కవి కావాలనే ఉద్దేశంతో, కవులు తమ సృజనకు పదును పెట్టి నూతన కవితా ప్రక్రియలకు పురుడు పోస్తున్నారు. "అచ్చంగా తెలుగు" ఇంపును, నుడికారాలను, అతి తక్కువ పాదాల్లో, మాత్రాఛందస్సును, అంత్య ప్రాస నియమం పాటించడం, అలంకారాలను కవిత్వంలో చొప్పించి చిక్కగా, తేనె చుక్కగా అందరూ రాయాలనే నూతన కవితా ప్రక్రియలకు శ్రీకారం చుడుతున్నారు రూపకర్తలు.
అలాంటి కొద్దిమంది కవుల్లో హరివిల్లు కవితా రూపకర్త శ్రీ మామిడి రమేష్ గారిని ఒకరని చెప్పుకోవచ్చు.

ఈమధ్యే రూపుదిద్దుకున్న కైతికాలు, మణిపూసలు, చిమ్నీలు, మెరుపులు వంటి నూతన కవితా ప్రక్రియల రుచిని చూసిన రమేష్ గారు తమ వంతు తెలుగు కవిత్వం కోసం, బడిలో చదువుకునే విద్యార్థుల నుండి, తెలుగు సాహిత్యం మీద అభిమానం ఉన్న ప్రతి వ్యక్తి కోసం ఈ హరివిల్లు ప్రక్రియను రూపొందించారు అని నా అభిమతం. అతి తక్కువ కాలంలోనే వాట్సప్ వేదికగా అన్ని వయసుల వాళ్లు కలిపి దాదాపు రోజుకు రెండు వందల మందికి పైగానే ఈ సమూహంలో హరివిల్లు కవిత్వం కురిపిస్తున్నారు. అతికష్టమైనా, ఎంతో శ్రద్ధతో వాళ్లల్లో విజేతలను ఎన్నుకుంటున్నారు నిర్వాహకులు.

ఈ "అక్షర జలపాతాలు" లోని హరివిల్లు కవనాలు ప్రతి ఒక్క చదువరిని కవిత్వంతో తడిపేస్తాయి. 160 హరివిల్లులతో అలంకరించిన ఈ వయ్యి సంపూర్ణంగా జనాదరణ పొందుతుందని ఆకాంక్షిస్తున్నాను. నాకున్న వీలునుబట్టి ఇందులోనే చిక్కని కవిత్వాన్ని మీ మదికి చేరవేసే యత్నం చేస్తాను.

" సహనశీలి మగువ
  సమరభేరి మగువ
  ఇంటి వెలుగు మగువ
  ఇలన కాంతి మగువ"(16)-
అంటూ లక్ష్మీబాయి, రుద్రమదేవి వంటి మగువలు చేసిన పోరును, మగువలకు ఉన్న గొప్ప లక్షణాలను, ఒక్క హరివిల్లు లో పొందుపరిచారు.
" చలికి వణికి నపుడు
  చెద్దరగును అమ్మ
  అలసిపోయినపుడు
  ఊయలగును అమ్మ"(30)
- అంటూ అమ్మ అవ్యాజమైన ప్రేమ గురించి గొప్పగా వివరించారు.44వ హరివిల్లులో అటు కలియుగంలో జరుగుతున్న నిజాన్ని తెలియపరచి, అమ్మ దివ్యమైన గొప్పతనాన్ని చాటి చెప్పారు.
"
  
  మాట చెలిమినిచ్చు
  మాట కలిమినిచ్చు
  మాట సమత నిచ్చు
  మాట మమత నిచ్చు"(67)
 మాట ఎంత మహత్తరమైన కార్యాలను చేయగలదో, ఎంతటి ప్రేమానురాగాలను కురిపించగలదో వివరించారు.

" మాతృ భాష లోని
  మకరందం వీడకు
  పరుల భాష యొక్క
  పంచన చేరకు!"(84)
అంటూ మాతృభాషలోని ప్రేమానురాగాలను భోధిస్తూనే, పరుల భాష చెంత చేరకు అని, పరభాష నేర్చుకోవడం వరకేనని చదువరులకు చెబుతున్నారు.

నాన్న ఆప్యాయత, గురువు విశిష్టత, చెలిమి, చెట్టు విశిష్టతలు వెల్లడించారు కవి అపురూపంగా.

"నొసటి రాత రాయు
అసలు బ్రహ్మ ఓటు
  బతుకు బాగు చేయు
  బల సూత్రం ఓటు!"(102)
- అంటూ ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూనే, రాజకీయవేత్తలు ఎంత జిత్తులమారులో,కుటిల బుద్ధిగలవారో,కుంటి సాకులు వినిపిస్తారో తరువాతి హరివిల్లు కవితల్లో చూపించారు.

దేశానికి అమ్మై అన్నం అందించే రైతన్న గురించి-
" మెతుకులిచ్చు వాడు
  చతికెలపడే నేడు
  అతీగతీ లేక
  చితికి చేరెను చూడు!" (113)
అంటూ తన కవి హృదయ వేదనను కవిత్వకరించారు కవి.

"మనిషి పైన చేసే
 మారణ హేలల దాడి
 మందుగిందు లేని
 కరోనా మాయలేడి"-(119)


ప్రస్తుతం మూడవ ప్రపంచ యుద్ధంగా మారిన కరోనా మహమ్మారి పై తన క(ల)రవాలాన్ని సంధించారు.

ఆస్వాదించాలే కానీ ఇందులోని నూట అరవై కవితలు ప్రతి పాఠక ప్రియుడిని తేనె టీగలా మార్చి "హరివిల్లుల మకరందాన్ని" రుచి చూపించగలవు.
మానవత్వం,సమాజ హితం, నడకను, ఆలోచనా శక్తిని, విలువల్ని, విచక్షణని, మానవీయ బంధాలు ఇలా మానవ జీవితంలో ఆవశ్యమైన ప్రతి విషయాన్ని తీసుకుని అతి తక్కువ పదాలతో, పాదాలతో చక్కని కవిత్వాన్ని రాసి పాఠక లోకానికి అందించడంలో కవి సఫలీకృతులయ్యారు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కవి రమేష్ గారు మున్ముందు నిత్య నూతనమైన హరివిల్లుల కవిత్వాన్ని తెలుగు పాఠకు ప్రియుల అరచేతుల్లోకి తీసుకెళ్లి వారి హృదయ గ్రంథాలయంలో జీవించ గలరని ఆకాంక్షిస్తున్నాను. ఇటువంటి మనోరంజక పుస్తకాన్ని వెలువరించిన రమేష్ గారికి అభినందనలు.

✍️ లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ,

మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల,బోనకల్.

బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507202
ఫోన్:- 9949618101

27, నవంబర్ 2020, శుక్రవారం

ఆత్మీయులు, గురువులు శ్రీ పోతగాని సత్యనారాయణ గారు, దేవయ్య యనుగందల గారు నేర్పించిన రుబాయిలు తొలి ప్రయత్నంగా...

 రుబాయీలు

రుభాయీలో నాలుగు పాదాలుంటాయి.

మూడవ పాదానికి తప్ప మిగతా పాదాలకు ఖాఫియా,రదీఫ్ లను పాటించాలి. లేదా అంత్యప్రాసతోనైనా రాయవచ్చు. 

ప్రతిపాదంలోనూ సమానమైన మాత్రల సంఖ్య ఉండాలి.
అయితే అత్యధికంగా ఇరవై తొమ్మిది మాత్రలకు మించకుండా,తక్కువలో తక్కువ పదిహేను మాత్రలకు తగ్గకుండా ఉంటే మంచిది.


నాకోసం నేనైతే కవిత్వాన్ని రాయలేను
నాలోకం వేరంటూ జీవితాన్ని గడపలేను
ఒక్కరోజు కవి లాగా జీవించాలని ఉన్నది
అక్షరాలే పేర్చి నేను తవికల్ని రాయలేను!(01)


అవ్యాజపు కన్నులతో నవ్వేది బాల్యమే
నేలమీద గీతగీసి ఆడేది బాల్యమే
ఇసుకతోన భవనాలను నిర్మించే పాపలు
వయస్సు పెరిగే కొద్దీ తరిగేది బాల్యమే!(02)

కథల్లో సద్గుణాలు వెతుక్కునే వయసది
దుష్ట కార్యాలను చీదరించుకునే వయసది
చెట్టు పైన కపిలాగ ఆటలాడు నేస్తాలు
ప్రేమానురాగాలను పెంచుకునే వయసది!(03)

కోవెలలో కంచురవళి పసి మనసుల నవ్వులు
తోటలోన పరిమళించు పొన్నారుల నవ్వులు
శక్తి లేని ముదుసళ్ళు కోరేదీ బాల్యమే
జగతినే మోహనపరుచు చిన్నారుల నవ్వులు!!(04)

లిఖిత్ కుమార్ గోదా.

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం


22, నవంబర్ 2020, ఆదివారం

స్వర్గీయులు ప్రముఖ సాహితీవేత్త రెడ్డి నాగరాజు వేంపల్లి గారు రచించిన "పాల బుగ్గలు పసిడి మొగ్గలు" పుస్తకం పై నేను రాసిన పుస్తక సమీక్ష

 

నీతి కథల చిట్టడవి... రెడ్డి నాగరాజు"పాలబుగ్గలు పసిడి మొగ్గలు"(పుస్తక సమీక్ష)

పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.




    భిన్న సాహితీ ప్రక్రియలయిన కథ, కవిత్వం, నాటకం, వ్యాసం, విమర్శ, సమీక్ష వంటి అంశాలలో కొందరు సాహితీవేత్తలు ఏదో ఒక ప్రక్రియలో మాత్రమే రచనలు సాగించి లబ్దప్రతిష్టులు అవుతారు. అయితే వీరిలో కొంతమంది మాత్రం దాదాపు అన్ని ప్రక్రియలతో ప్రవేశం కలిగి సాహితీ ప్రియులను అలరించడం ద్వారా విశ్వవిఖ్యాతులవుతారు.
ఈ కోవలోకి వచ్చే వారు అక్కడక్కడా చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తారు. వీరిలో అన్ని సాహితీ ప్రక్రియలతోనూ సంబంధం కలిగి రచనలు చేస్తున్న సాహితీవేత్తగా వేంపల్లి రెడ్డి నాగరాజు గారిని పేర్కొనవచ్చు.


గత మూడు దశాబ్దాల కాలంగా పైన పేర్కొన్న అన్ని సాహితీ ప్రక్రియలలో పయనిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాలలోని సాహితీ ప్రియులను అలరిస్తున్న రచయితగా నాగరాజు గారిని పేర్కొనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.
తన కలాన్ని ఆకారం లో చిన్నదైనా ఒక ఎడారి రోజా చేసుకుని, గుత్తులు గుత్తులుగా సాహిత్యాన్ని పూయించాలనే ఆశ రెడ్డి నాగరాజు గారిది. తన సూక్ష్మ లిఖితాలతో ఎడారి లాంటి ఈ జగతిలో తనొక ప్రత్యేకం కావాలని కొత్త ఒరవడితో, వ్యూహాలతో మినీ కథలు, మినీ కవిత్వాలు వంటి రచనలు చేశారు.

 ప్రత్యేకించి బాల సాహితీవేత్తగా బాలల కోసం రాసే కథలలో గతంలో ఎవరూ చేయని వినూత్న ప్రయోగాలు చేయడం ద్వారా ఈ రచయిత తనదైన పేరును సొంతం చేసుకున్నారు. "రూపాయికి ఒక కథ" అంటూ దాదాపు లక్ష కాపీలు దాకా అమ్మారు. బాలసాహిత్యంలో ఈ-తరం బాలల కోసం "కొత్తబాట"ను నిర్మించారు. పిల్లల కోసం "బామ్మలు చెప్పని కథలు, బొమ్మలు చెప్పిన కథలు, గోరుముద్దలు, నవతరం బాలల నీతి కథలు"వంటి కథా సంపుటాలను వెలువరించారు. వీరు రాసిన బాలల కథలను ఆంగ్లంలోకి అనువదించి రెయిన్బో నామంతో ఒక పుస్తకాన్ని వెలువరించారు ప్రముఖ రచయిత్రి బి.ఎస్. పద్మావతి. అలా వారి కలం నుండి జాలువారిన కథాశిల్ప సంపుటి "పాల బుగ్గల -పసిడి మొగ్గలు".

ఈ పుస్తకం నేటితరం పిల్లలకు దొరికిన "అక్షరాల పాలపుంత" అనుకోవచ్చు. ఇందులోకి పిల్లని ఒక్కసారి చేర్చితే వారు నీతులతో దేహాన్ని శుద్ధి చేసుకోగలుగుతారు.
మొత్తం రెండు చేతులకి ఉన్న వేళ్లను కలిపితే ఇందులోని కథలు సంఖ్య. పుస్తకంలోని కథలు ఒక్కొక్కటి ఒక్కొక్క తరహాలో నడుస్తూ, పాతదానికి కొత్త రూపును చేర్చి, రసగుల్లల్లా కొత్త రుచులు చూపిస్తూ, పంచతంత్రాలను నవతంత్రాలుగా మార్చి నోరూరిస్తాయి.

యుక్తి కథలో మనకు తెలిసిన పంచతంత్ర కథ అయినా "ద్రాక్ష నక్క"ను తీసుకుని అందులో నక్క ద్రాక్షాల కోసం ఎదురు చూసే భాగం వరకు తీసుకుని తరువాత చమత్కార సృజనకు పదును పెట్టారు రచయిత. నక్క ద్రాక్ష పండ్ల కోసం చెట్టుక్రింద ఉండడం, ఒక కాకి చూసి ఏంటి ఎక్కడున్నావ్ అని అడగడం, పైన ఉన్న ద్రాక్ష పళ్లను పట్టుకుని ఊగితే స్వర్గం చూడవచ్చునని, అలా పులి స్వర్గం చూస్తాను స్నానం చేసి ఇప్పుడే వస్తాను అంటే ఇక్కడ కాపలా కాస్తున్నాను అని నక్క అనడం, నేను స్వర్గాన్ని చూస్తానని కాకి చెప్పడం, నక్క తొలుత కాదనడం, బ్రతిమాలగా ఒప్పుకోవడం, కాకి ద్రాక్షపండ్లను పట్టుకుని ఊగడం, అప్పుడు ద్రాక్ష పండ్లు రాలడం, నక్క ఆశ ఆకలి తీరడం, కాకి తిక్క కుదరడంతో కథ నవ్వులతో ముంచెత్తి కంచికి చేరుతుంది.
"శక్తి లేని చోట యుక్తితో ఎలా విజయం సాధించవచ్చు"నని చూపించిన కథ ఇది.

"నిజమైన గెలుపు" కథలో మనకు తెలిసిన కుందేలు తాబేలు కథనే తీసుకొని, అవి రెండు పోటీ పెట్టుకొని కుందేలు విశ్రాంతి తీసుకునే భాగందాకా తీసుకొని, తరువాత తాబేలు,కుందేలును నిద్రలేపి "గెలుపు దిశగా నడువు,విజయం సాధించాక కావాలంటే విశ్రాంతి తీసుకుందువు గాని" అని అనడంతో చదువరులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 
"పోటీదారులను ప్రోత్సహించడం కూడా గెలుపొందడంతో సమానం" అని నీతిని ఇచ్చే చక్కటి కథ.

ఏడుగురు రాజకుమారుల కథను "చేపల వేట" కథగా తీసుకొని పర్యావరణ హితాన్ని, చెట్లు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు నేర్పించారు రచయిత వేంపల్లి నాగరాజు గారు.

మనకు పంచతంత్రం నుంచి తెలిసిన "ఆవు పులి కథ" (పుణ్యవతి కథ)ను తీసుకొని ముందుచూపు ఎంత గొప్పదో వివరించారు.

ఇలా దశ ఆణిముత్యాలతో ముస్తాబైన ఈ కథా సంపుటి బాలల మదిలోకి చేరవలసిన మంచి పుస్తకం. పిల్లల కోసం కొత్త తరహాలో కథలు రాయడంలో రచయిత రెడ్డి నాగరాజు గారు సఫలీకృతులయ్యారు. బాలసాహిత్యంలో ఇదొక నిత్యనూతన ప్రయోగమని చెప్పుకోవచ్చు. ఇటువంటి మంచి పుస్తకాన్ని మన కళ్ళల్లోకి తీసుకొచ్చిన రచయిత వేంపల్లి రెడ్డి నాగరాజు గారికి అభినందనలు. ఇటువంటి బాలల కథలు పెద్దలే చదివి పిల్లలచేత చదివించి వారిని నవభారతం వైపు నడిపించే ప్రయత్నం చేయాలి. అప్పుడే రచయితల ఆశయాలు, లక్ష్యాలు నెరవేరుతాయి. జై బాలసాహిత్యం!!


పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్.
*నివాసం*:-బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507202.

ఫోన్:- 9949618101,7658980766


ప్రతులకు:- 
వేంపల్లి రెడ్డి నాగరాజు,
ఎల్.ఐ.సి.ఆఫ్ ఇండియా,
 రాయచోటి శాఖ, కడప (జిల్లా) - 516269
మొబైల్:- 7989928459,9985612167.


15, నవంబర్ 2020, ఆదివారం

సమ్మోహనాలు నూతన కవితా ప్రక్రియలో నేను రాసిన సమ్మోహన కవనాలు..

 




సమ్మోహనాలు నూతన కవితా ప్రక్రియ సృష్టికర్త శ్రీ నాగ మోహన్ యెలిశాల గారు


సమ్మోహనాల నియమాలు

************************

* మూడు పాదాలు
* మొదటి రెండు పాదాలకు అంత్యప్రాస
* మొదటి రెండు పాదాలకు పదేసి(10) మాత్రలు
* ముక్తపదగ్రస్త రీతి_
అనగా మొదటి పాదం చివరి పదం రెండవ పాదం మొదటి పదంగా, రెండవ పాదం చివరి పదం మూడవ పాదం మొదటి పదంగా మొదలవుతుంది
* మూడవ పాదానికి అంత్యప్రాస లేదు
* మూడవ పాదంలో (20 మాత్రలు) తొలి పదిహేను మాత్రలలో విషయాన్ని రూఢీ చేసి, తర్వాత ఐదు మాత్రలలో నామ ముద్రతో గానీ సంబోధనా పదంతో గానీ ముగించాలి.

ఉదా:

మనిషికుంటే మనసు
1 1 1 2. 2. 1 1. 1 ___10

మనసుకుంటే సొగసు
1 1. 1. 2. 2. 1 1 1. ___10

సొగసు కక్కరలేదు మైపూత 
1 1 1. 2 1 1 2 1. 2. 2. 1 __15

               మోహనా...
                2. 1. 2. ___5



**********************
            🌷 సమ్మోహనాలు 🌷
         **********************

తాత్వికా చింతనలు
చింతనా గాఢతలు
గాఢతలు మనసు పరిపక్వతలు మోహనా....!

వాస్తవం కఠినమై
కఠినమై జఠిలమై
జఠిలమై కుటిలాన్ని కూల్చేను మోహనా....!

రక్తాన్ని మరిగించి
మరిగించి రగిలించి
రగిలించి ద్వేషాన్ని పెంచకోయ్ మోహనా.....!

     📝 నాగమోహన్ 🎯

🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦

సమ్మోహనాలు.





అక్షరాలను తూచి/
తూచి మదిలో దాచి/
దాచి జీవితమున పాటించెద
కుమారా!(1)


కవిత్వమును లిఖించి/
లిఖితాన్ని పలికించి/
పలికించి పాలించెద జగతిని
కుమారా!(2)


సంశయాలను వదిలి/
వదిలి ముందుకు కదిలి/
కదిలి జీవితమున కీర్తి పొందు/ కుమారా!(3)


నయనాలనే మూసి/
మూసి మదిలో (మనసున) చూసి/
చూసి మలినమునొదలగొట్టాలి/ కుమారా!(4)


తెలుగు భాషను కొలిచి/
కొలిచి నిరతము తలిచి /
తలిచి మన భాషనే కాపాడు కుమారా!(5)

అమ్మ సమ్మోహనాలు

మమతలను కురిపించి/
కురిపించి లాలించి/
లాలించి జగమేలు అమ్మలే కుమారా!(6)

బిడ్డకూపిరి పోసి/
పోసి గుండెలో మోసి/
మోసి సహనంతో తీర్చిదిద్దు కుమారా!(7)

భూమికి మణులు పూసి/
పూసి రైతులు మురిసి/
మురిసి ఆకలి కేకలు మాన్పెను కుమారా!(8)

చిలిపి పలుకులు పలికి/
పలికి నవ్వులు చిలికి/
చిలికి మనసులు మోహనపరుచును కుమారా!(9)

దర్జీకి ఉపకారి/
ఉపకారి సహకారి/
సహకారియై ఉపాధిని పంచు కుమారా!(10)




చీకటిని చెరిపేసి/
చెరిపి ముందడుగేసి/
అడుగుతో జీవితము నిర్మించు కుమారా/!(11)



ప్రకృతి తల్లిని కొలిచి/
కొలిచి మనసును పిలిచి/
పిలిచి నిజ సిరిని చూపించెదను కుమారా!/(12)



ఓడిన నరుల కేసి/
నరుని హేళన చేసి/
చేసి నువు సాధించునదియేమి కుమారా!/(13)

*పుస్తక సమ్మోహనాలు*
(14-20)

పుస్తకం తెరువగా/
తెరిచి మది చదువగా/
చదివి సత్యాన్ని తెలుసుకునులే కుమారా!/(14)

లోకాలు విహరించి/
విహరించి వివరించి/
వివరించి లోక హితమును నేర్పు(పలుకు) కుమారా!/(15)

మలినాన్ని తొలగించి/
తొలిగించి కదిలించి/
కదిలించి నేర్పించు జీవితము కుమారా!/(16)

పువ్వలా వికసించి/
వికసించి మురిపించి/
మురిపించి మనసు ద్వారం తెరుచు కుమారా!/(17)

పుస్తకతోవ నడిచి/
నడిచి మనసును పిలిచి/
పిలిచి జగతిని మోహన పరిచెద కుమారా!/(18)

అక్షరాలై పూచి/
పూచి మదినే తూచి/
తూచి సద్గుణాలు నింపునులే కుమారా!/(19)

అక్షర కోట కట్టి/
కట్టి మనసును పట్టి/
పట్టి స్వర్గమునే బంధించును కుమారా!/(20)


🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
​ అంతర్జాతీయ బాలికల (కూతుళ్ళ) దినోత్సవ సందర్భంగా)
పసిడి పలుకుల వాణి/
వాణి గృహముకు రాణి/
రాణై కుటుంబాన్ని ప్రేమించు కుమారా!/(21)

సహనమే అమ్మలా
అమ్మ కనుగవ్వలా
గవ్వలా సవ్వళ్ళ కూతుళ్ళు కుమారా!/(22)

*కలము సమ్మోహనాలు*(23-27)
📝📝📝✒️✒️✒️

కవులకు కలం గళం/
గళమే పోరు దళం/ 
దళమై అన్యాయాలెదురించు కుమారా!/(23)
      🖊️🖊️🖊️🖊️
అధర్మం సహించక/
సహించకది వదలక/
వదలక అక్షర నిప్పులు చిమ్ము కుమారా!/(24)
     ☝️☝️☝️☝️
భావాలు కురిపించు/
కురిపించి చదివించు/
చదివించి పాఠకుని మురిపించు కుమారా!/(25)
    ☝️☝️☝️☝️☝️
కవులకది గీర్వాణి/
గీర్వాణి మన వాణి/
వాణియై లోకాన్ని పాడించు కుమారా!/(26)
13.10.2020


*సమ్మోహనాలు*


కురిసేటి నైలాన్ని/
నైలాన్ని నైనాన్ని/
నైనాన్ని కాగితమున వాల్చితి కుమారా!/(27)
(నైలా=మేఘం
 నైనా=కళ్లు)

కైతలను రాసుకుని/
రాసినవి చదువుకుని/
చదివి ఏకాంతముగా మురిసితి కుమారా!/(28)


మాటల పోటు పొడిచి/
పొడిచి మనసులు విరిచి/
విరిచి నీవు హీనుడు కావొద్దు కుమారా!/(29)

*సైనికా.. దేశానికి సేవకా*
_ప్రక్రియ:-సమ్మోహనాలు_

సరిహద్దు నివాసం/
నివాసం సాహసం/
సాహసంతొ దేశము కాపాడె సైనికా!/(30)

కుటుంబాలను వదిలి/
వదిలి ముందుకు కదిలి/
కదిలి శత్రువుల చెండాడుదువు సైనికా!/(31)

తుపాకులు చేపట్టి/
చేపట్టి పడగొట్టి/
పడగొట్టి రిపులనోడించెదవు సైనికా!/(32)

మంచు కొండలు ఎక్కి/
ఎక్కి రిపులను తొక్కి/
తొక్కి పట్టి హతమార్చు మీరే సైనికా...!/(33)

మీరు వీరులయ్యా/
వీర మేనులయ్యా/
మేనంత దేశభక్తే కదా సైనికా!/(34)

సరిహద్దులో జవాన్/
జవాన్ దేశపు మహాన్/
మహానై ప్రాణాలనిస్తావు సైనికా!/(35)

బాంబులకు భయపడక/
భయమును రానివ్వక/
రానివ్వక జయ గీతము పాడు సైనికా!/(36)

చెట్టు కింద మగువలు/
మగువలూయలాటలు/
ఆటలతో పల్లెలు పరిమళించె కుమారా!(37)

చెట్టు తల పూలతో/
పూల జడి వానతో/
వాన మగువల ఎదలు వర్షించె కుమారా!(38)


గువ్వలా కవ్వింత/
కవ్వింత కేరింత/
కేరింతలతో బాలలాడును కుమారా!(39)
(కేరింతలతొ బాలలాడుదురు కుమారా)

స్నేహితులతో కలిసి/
కలిసి ఆటలొ అలిసి/
అలిసిన మనసుల నవ్వులు చూడు కుమారా/!(40)

ప్రకృతి ఒడిలో ఆట/
ఆట కోకిల పాట/
పాటలతో పల్లె పులకరించె కుమారా/!(41)

మాటకు పాట నేర్పి/
నేర్పి ప్రేమను కలిపి/
కలిపి పెద్దలను మురిపించెదరు కుమారా/(42).

21.10.2020


ఎదను గదిలో నెట్టి/
నెట్టి గొళ్ళెం పెట్టి/
పెట్టి స్వేచ్ఛను పోగొట్టుకోకు కుమారా!(43)
 
*సమ్మోహనాలు*

నవ్వులో పువ్వులో/
పువ్వులో పరుల్లో/
పరుల్లో కవనాలన్వేషణ కుమారా!(46)

బాధలను మరువుటకు/
మరువుటకు పెరుగుటకు/
పెరిగి విజేతగును కవిత రాసి కుమారా!(47)

కన్నీరు కవితగా/
కవితగా నడకగా/
నడిచి తమ బాధలు మరువు కవులు కుమారా/!(48)

బాధలో దైవాన్ని/
దైవాన్ని భావాన్ని/
భావాలే లిఖించు కవితలో కుమార్/!(49)

స్వప్నాలు రాసుకుని/
రాసినవి పంచుకుని/
పంచి మనల్ని ఆహ్లాదపరిచు కుమారా!(50)

తప్పులను ఖండించి/
ఖండించి ఎదురించి/
ఎదిరించి జీవించు కవితలో కుమారా!(51)


రోధించు కన్నులకు/
కన్నులకు మనసులకు/
మనసునకు ఔషధం కవనమే కుమారా!(52)

ఎదకు అమృతాంజనం/
అమృతపు ప్రభంజనం/
ప్రభంజనం పుట్టించు కవితే కుమారా/!(53)


కపట మెరుగని కనులు/
కనులు నవ్వె చినుకులు/
చినుకులు శ్రీ శ్రీ కవితలు వారు బాలకవి/!(54)

తోటలో పువ్వులా/
పువ్వులా తారలా/
తారలై దేశ కీర్తి పెంచును బాలకవి/!(55)

తప్పులను ముప్పులను/
ముప్పులను చెప్పులను/
చెప్పులను మోయక శిరస్సుపై బాలకవి!/(56)


యజమానికి తోడై/
తోడు ఇంటికి నీడై/
నీడై కాపలా యుండును వేపి బాలకవి!(57)

చేతికి అందంగా/
అందమె బంధంగా/
బంధమై నాడీని కొలుచునది బాలకవి!/(58)



నింగిలో పక్షినై/
పక్షినై తారనై/
తారనై నవ్వాలని ఉన్నది కవనమా!(59)

గుండెలో రవళినై/
రవళినై నెమలినై/
నెమలినై పురి విప్పాలనుంది కవనమా/!(60)

నీటిలో మీనమై/
మీనమై కూర్మమై/
కూర్మమై ఈదాలని ఉన్నది కవనమా/!(61)

మేఘమున చినుకునై/
చినుకునై మెరుపునై/
మెరుపునై ఉరమాలని ఉన్నది కవనమా/!(62)

చెట్టులోనాకునై/
ఆకై కోయిలనై/
కోయిలనై పాడాలనున్నది కవనమా/!(63)

చెట్టుకే నీడనై/
నీడనై తోడునై/
తోడునై జగతిని హత్తుకుందు కవనమా/!(64)

చిరుతకు పోటీగా/
పోటీగ మేటిగా/
మేటిగా నిలవాలని ఉన్నది కవనమా/!(65)

గుడిలోన గంటనై/
గంటను దీపమునై/
దీపమై పూజించాలనుంది కవనమా!(66)

మనసే కవిత్వమై/
కవితే కపోతమై/
కపోతమై శాంతిని పరిచెదను నేస్తమా/!(67)

అక్షరాలు పుటలో/
పుట మైదానములో/
మైదానమునాడి కవితలయ్యె నేస్తమా/!(68)

గుడిలోని దీపమై/
దీపమై ధూపమై/
ధూపమై పరిమళించాలుంది కవనమా/!(69)

నోటిలో శాస్త్రమై/
శాస్త్రమై మంత్రమై/
మంత్రమే పలుకులే పూజారి నేస్తమా/!(70)

మేఘమే సరిగమై/
సరిగమే కవనమై/
కవనమే కురిసింది మదిలోన నేస్తమా/!(71)

చెట్టుకే పండునై/
పండునే పుండునై/
పుండునైతి రాళ్ల దెబ్బలతో నేస్తమా/!(72)

వాకిట్లొ ముగ్గులా/
ముగ్గులా చెట్టులా/
చెట్టులా బ్రతకాలని ఉన్నది కవనమా/!(73)

నెహ్రూ తనయి తాను/
తాను దేశమేలెను/
ఏలెను సమర్ధతో ఇందిరా నేస్తమా/!(74)

 

✍️ లిఖిత్ కుమార్ గోదా,

 ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం

15.11.2020

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...